Share News

వడ్డీ వ్యాపారి దారుణ హత్య

ABN , Publish Date - Jan 09 , 2025 | 12:38 AM

వడ్డీ వ్యాపారిని ఇంటి ముందే గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు మంగళవారం అర్ధరాత్రి కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేసిన ఘటన చిలకలపూడిలో సంచలనం రేకెత్తించింది.

వడ్డీ వ్యాపారి దారుణ హత్య

-అర్ధరాత్రి ఇంటి ముందే కత్తులతో పొడిచిన దుండగులు

-తీవ్రంగా గాయపడిన వ్యాపారిని ఆస్పత్రికి తీసుకెళ్లిన బంధువులు

-చికిత్స పొందుతూ కన్నుమూత... కుమార్తె ఫిర్యాదుపై కేసు నమోదు

మచిలీపట్నం టౌన్‌, జనవరి 8 (ఆంఽధ్రజ్యోతి): వడ్డీ వ్యాపారిని ఇంటి ముందే గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు మంగళవారం అర్ధరాత్రి కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేసిన ఘటన చిలకలపూడిలో సంచలనం రేకెత్తించింది. చిలకలపూడి సీఐ షేక్‌ అబ్దుల్‌ నబి తెలిపిన వివరాల మేరకు... చిలకలపూడికి చెందిన వడ్డీ వ్యాపారి అడపాల రవికుమార్‌ (50)ను మంగళవారం అర్ధరాత్రి ముగ్గురు దుండగులు ఇంటి ముందే కత్తులతో బలంగా పొడిచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన రవికుమార్‌ ఇంటికి దగ్గరలో ఉన్న బంధువు, మునిసిపల్‌ మాజీ వైస్‌చైర్మన్‌ పంచపర్వాల కాశీవిశ్వనాథం ఇంటి తలుపుకొట్టాడు. బయటకు వచ్చిన పంచపర్వాల భరతకుమార్‌ తీవ్రంగా గాయపడిన రవికుమార్‌ను చూసి బంధువులు, స్నేహితుల సాయంతో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రవికుమార్‌ మృతి చెందాడు. వారం రోజుల కిందట రేవతీ సెంటర్‌లో కొందరితో రవికుమార్‌కు వాగ్వివాదం జరిగిందని తెలుస్తోంది. వారిలో ఒకరిపై రవికుమార్‌ చేయి చేసుకున్నట్టు సమాచారం. వారే రవికుమార్‌ ఇంటికి వచ్చి కత్తులతో పొడిచి హతమార్చి ఉంటారని అనుమానిస్తున్నారు. సీసీ పుటేజిలో రికార్డు అయిన దృశ్యాలను పోలీసులు పరిశీలించారు. దుండగులు ఉపయోగించిన కత్తిని గుర్తించారు. నిందితులు మచిలీపట్నానికి చెందిన వారిగా తెలుస్తోంది. కాగా, రవికుమార్‌ కుమార్తె ధాత్రినాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిలకలపూడి సీఐ షేక్‌ అబ్దుల్‌ నబి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శవ పరీక్ష నిర్వహించారు. పదిహేనేళ్ల కిందట రవికుమార్‌పై బంధువులు దాడి చేసిన ఘటనపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.

Updated Date - Jan 09 , 2025 | 12:38 AM