B.R. Naidu Says: అడ్మినిస్ర్టేషన్ లోపం వల్లే!
ABN , Publish Date - Jan 09 , 2025 | 04:12 AM
తిరుమల వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాలకు టోకెన్ల జారీ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు అడ్మినిస్ర్టేషన్ లోపమే కారణం కావచ్చని టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు.
తొక్కిసలాటకు బాధ్యత అధికారులదే
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు
తిరుపతి, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): తిరుమల వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాలకు టోకెన్ల జారీ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు అడ్మినిస్ర్టేషన్ లోపమే కారణం కావచ్చని టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. టోకెన్ల జారీ కేంద్రాల వద్ద తోపులాటల్లో భక్తులు చనిపోవడం దురదృష్టకరమని, జరగరానిది జరిగిందని విచారం వ్యక్తం చేశారు. ‘టెలికాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొంత అడ్మిస్ర్టేషన్ లోపం కారణంగా జరిగిందని నాకు అనుమానం ఉంది. ఘటనకు బాధ్యత అధికారులదే కదా. మంగళవారం కూడా నేను అధికారులతో సమావేశమై ఆషామాషిగా తీసుకోవద్దని చెప్పాను. గొడవలు జరుగుతాయని నాకు సమాచారముందని హెచ్చరించాను. ఐదు వేలమంది పోలీసులను పెట్టామని, చూసుకుంటామని అధికారులు చెప్పారు. టోకెన్లు జారీ చేసే ఒక సెంటర్‌లో ఓ మహిళ అస్వస్థతకు గురైన క్రమంలో ఆమెను బయటకు తీసుకువచ్చేందుకు అక్కడున్న డీఎస్పీ గేట్లు తెరవడంతో భక్తులు ఒక్కసారిగా ముందుకు రావడంతో తోపులాట జరిగింది. అందులో ఆరుగురు చనిపోయినట్టు తెలిసింది’ అని బీఆర్ నాయుడు అన్నారు.