Bommidi Nayakar: కారుమూరీ మాట తీరు మార్చుకో
ABN , Publish Date - Apr 10 , 2025 | 03:51 AM
విప్ బొమ్మిడి నాయకర్, మాజీ మంత్రి కారుమూరిపై తీవ్రంగా స్పందిస్తూ మాట తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. ఆయన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదులు చేశారు

‘కారుమూరీ... ఒళ్లు దగ్గర పెట్టుకో. పద్ధతిగా మాట తీరు మార్చుకో. కూటమి నాయకులు, కార్యకర్తల జోలికి వస్తే తాట తీస్తాం’ అంటూ ప్రభుత్వ విప్, నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ వార్నింగ్ ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం లక్ష్మణేశ్వరంలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ‘పద్ధతి, భాష మార్చుకోవాలి. లేకపోతే గుణపాఠం చెబుతాం. మీ పాలనలో దాడులు, పోలీసు కేసులు భరించాం. ఇప్పుడు ఇంకా అధికారంలో ఉన్నట్లు వ్యవహరిస్తున్నారు. అంబటి రాంబాబు, మీరు మాట తీరు మార్చుకోవాలి. లేకపోతే మీ నియోజకవర్గానికి వచ్చి మీ కార్యకర్తల ముందే బుద్ధి చెబుతాం’ అని హెచ్చరించారు. ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ, ‘చట్టబద్ధంగా పనిచేస్తున్న పోలీసులను మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి, నరికేస్తామంటూ మాజీ మంత్రి కారుమూరి ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకునేది లేదు. నోరు అదుపులో పెట్టుకోవాలి. జగన్మోహన్‌రెడ్డికి చేతనైతే తన చెల్లి, తల్లితోపాటు చిన్నాన్న కూతురు సునీత కన్నీళ్లు తుడవాలి, వారికి న్యాయం చేయాలి’ అని సూచించారు.
కారుమూరిపై పలు చోట్ల ఫిర్యాదు
కారుమూరిపై రాష్ట్రంలో పలు చోట్ల టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. బుధవారం గుంటూరు పశ్చిమ డీఎస్పీని కలిసిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు, పలువురు నేతలు విద్వేష వ్యాఖ్యలు చేసిన కారుమూరిని అరెస్టు చేయాలని కోరారు. ఆయనపై తణుకు, ఇరగవరం, అత్తిలి పోలీసు స్టేషన్‌లలో బుధవారం ఎస్సీ, బీసీ నాయకులు ఫిర్యాదు చేశారు. కారుమూరి వ్యాఖ్యలతో తాము భయాందోళనలకు గురవుతున్నామని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు.