Share News

Bobbili Theft Case: చోరీకి వచ్చి.. అక్కడే మకాం

ABN , Publish Date - Jul 02 , 2025 | 06:04 AM

ఎక్కడైనా దొంగతనం అంటే చోరీ చేసుకొని వెళ్లిపోవడం.. ఆ తర్వాత పోలీసులకు దొరికిపోవడం చూస్తుంటాం. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే దొంగ మహా ‘ఘనుడు’! యాజమానులు లేని ఓ ఇంట్లోకి చొరబడి, దొంగతనం చేసిన వస్తువులను బయట అమ్ముకొని, వచ్చిన డబ్బుతో మద్యం తాగి..

Bobbili Theft Case: చోరీకి వచ్చి.. అక్కడే మకాం

  • యాజమానులు లేని ఓ ఇంట్లో చొరబడ్డ దొంగ

  • 4-5 రోజులుగా కొన్నికొన్ని వస్తువుల అమ్మకం!

  • వచ్చిన ఆ డబ్బుతో మద్యం తాగడం..

  • తిరిగి ఆ ఇంటికే వచ్చి పడుకుంటున్న వైనం

  • స్థానికుల సమాచారంతో పట్టుకున్న పోలీసులు

  • విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఘటన

బొబ్బిలి, జూలై 1 (ఆంధ్రజ్యోతి): ఎక్కడైనా దొంగతనం అంటే చోరీ చేసుకొని వెళ్లిపోవడం.. ఆ తర్వాత పోలీసులకు దొరికిపోవడం చూస్తుంటాం. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే దొంగ మహా ‘ఘనుడు’! యాజమానులు లేని ఓ ఇంట్లోకి చొరబడి, దొంగతనం చేసిన వస్తువులను బయట అమ్ముకొని, వచ్చిన డబ్బుతో మద్యం తాగి.. ఆ మత్తులో మళ్లీ ఆ ఇంటికే వచ్చి నిద్రపోయే చోరుడు అన్నమాట!! దీన్ని గమనించిన స్థానికులు ఇచ్చిన సమాచారంతో చివరకు పోలీసులకు దొరికిపోయాడు. ఈ ఘటన విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణ పరిధిలోని గొల్లపల్లి అంబేద్కర్‌ కాలనీలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. అలజంగి గ్రామానికి చెందిన శీర శ్రీనివాసరావు, జయలక్ష్మి దంపతులకు గొల్లపల్లిలో ఇళ్లు ఉంది. వీరిద్దరు పొలం పనుల నిమిత్తం తమ గ్రామానికి వెళ్లి ఉంటున్నారు. అదను చూసుకొని పిరిడి గ్రామానికి చెందిన ఓ దొంగ ఎవరూ లేని ఆ ఇంట్లోకి చొరబడ్డాడు. గత నాలుగైదు రోజుల క్రితమే ఇంట్లోకి చొరబడి రోజూ బయటకు వెళ్లి, మళ్లీ ఇంట్లోకి వస్తున్నట్లుగా తెలుస్తోంది. రోజుకు కొంత వెండి సామగ్రి, ఇతర వస్తువులను తీసుకెళ్లి అమ్ముకోవడం, వచ్చిన ఆ డబ్బులో మద్యం తాగడం, తిరిగి అదే ఇంటికి వచ్చి పడుకోవడం చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఇంట్లో మద్యం మత్తులో పడి ఉండడాన్ని గుర్తించిన ఇరుగుపొరుగు వారు మంగళవారం రాత్రి ఇంటి యజమాని శీర శ్రీనివాసరావు సమాచారం అందజేశారు.


విశాఖలోని ఐఏఎస్‌ అకాడమీలో ఫ్యాకల్టీగా పనిచేస్తున్న శ్రీనివాసరావు కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ రమేష్‌ వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని, మద్యం మత్తులో ఉన్న దొంగను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత ఆస్పత్రికి తరలించారు. ఆ దొంగ ఇంట్లో, బీరువాలోని సామాన్లు అన్నింటినీ చిందరవందరగా పడేశాడు. ఇంట్లో ఉన్న వెండి ఆభరణాల్లో కొన్నింటిని ఎవరికో అమ్మేశాడని అంటున్నారు. అయితే బీరువాలో రూ.10 వేల నగదు ఉన్నా.. ఆ డబ్బు జోలికి వెళ్లకపోవడం గమనార్హం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆ చోరుడు ఎవరు, ఆతను ఆ ఇంట్లో ఎంతమేర దొంగతనం చేశాడనే వివరాలు తెలియాల్సి ఉంది.

Updated Date - Jul 02 , 2025 | 08:42 AM