Share News

స.హా చట్టం పేరుతో బ్లాక్‌ మెయిల్‌

ABN , Publish Date - Feb 15 , 2025 | 11:03 PM

సమాచార హక్కు చట్టం ప్రజలకు వజ్రాయుధం లాంటిది. అలాంటి స.హా. చట్టాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారనడానికి ఈ ఘటన నిదర్శనం.

స.హా చట్టం పేరుతో బ్లాక్‌ మెయిల్‌
ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలోని యజమానాన్ని బ్లాక్‌ మేయిల్‌ చేసిన ఇద్దరిని అరెస్టు చేసిన వనటౌన సిఐ

ఆసుపత్రి యజమాని నుండి రూ.50 లక్షలు డిమాండ్‌

వనటౌన పోలీస్‌స్టేషనలో ఫిర్యాదు

అరెస్టు చేసిన సీఐ శ్రీరాములు

ఆదోని, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి) : సమాచార హక్కు చట్టం ప్రజలకు వజ్రాయుధం లాంటిది. అలాంటి స.హా. చట్టాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారనడానికి ఈ ఘటన నిదర్శనం. పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో ఏన్టీఆర్‌ వైద్య సేవలో అవకతవకలు జరిగాయని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామని, ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలంటే రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేసిన ఇద్దరు వ్యక్తులు కటకటాలపాలయ్యారు. ఈ సంఘటన ఆదోని పట్టణంలో శనివారం జరిగింది. పట్టణంలోని మధు ప్రైవేట్‌ ఆసుపత్రిలో ఏన్టీఆర్‌ వైద్య (ఆరోగ్యశ్రీ) సేవల్లో అవకతవకలు జరిగాయని, కలెక్టర్‌, సబ్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామని ఆదోని మండలం బసాపురం గ్రామానికి చెందిన కమ్మి ఏనుగుల రఘునాథ్‌, కమ్మి అడువేష్‌ ఆసుపత్రి యజమాని గురురెడ్డిని బెదిరించారు. కేసు వెనక్కి తీసుకోవాలంటే రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీంతో గురురెడ్డి రూ.39 లక్షలు చెల్లించేలా అడ్వాన్స కింద రూ.5లక్షలు ఇచ్చేందుకు డీల్‌ కుదుర్చుకున్నారు. ఆదే రోజు ఆయన దగ్గర నుంచి బలవంతంగా రూ.10వేలు ఫోన పే ద్వారా తీసుకున్నారు. ఆసుపత్రి యజమాని గురురెడ్డి ఈనెల 11వ తేదిన తనను డబ్బుల కోసం బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నట్లు వనటౌన పోలీస్‌స్టేషనలో ఫిర్యాదు చేశారు. కానిస్టేబుళ్లు బాల భాస్కర్‌, మునిచంద్ర ఇంటి నోటీసులు ఇవ్వడానికి బసాపురం గ్రామానికి వెళ్లారు. అయితే నిందితులు వారిపై తిరగబడి దాడి చేశారు. కొత్త బ్రిడ్జి వద్ద వారిని అరెస్టు చేసినట్లు ఆదోని ఒకటో పట్టణ సీఐ శ్రీరాం తెలిపారు. వీరు చాలామందిని స.హా చట్టం ఆధారం చేసుకొని బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని ఆయన అన్నారు. వీరిపై ఇస్వీ పోలీస్‌స్టేషన్లో కేసు నమోదైందన్నారు.

Updated Date - Feb 15 , 2025 | 11:03 PM