ప్రజల్లోకి కేంద్ర బడ్జెట్
ABN , Publish Date - Feb 18 , 2025 | 05:44 AM
ఈసారి కేంద్ర బడ్జెట్‌లో పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడే ఎన్నో కీలక నిర్ణయాలు ఉన్నాయని, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ భావిస్తోంది. ఈనేపథ్యంలో కేంద్ర బడ్జెట్‌పై
కీలక నిర్ణయాలపై బీజేపీ ప్రచారం
నేటి నుంచి రాష్ట్రంలో మేధావుల సదస్సులు
హాజరుకానున్న పలువురు కేంద్ర మంత్రులు
అమరావతి, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): ఈసారి కేంద్ర బడ్జెట్‌లో పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడే ఎన్నో కీలక నిర్ణయాలు ఉన్నాయని, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ భావిస్తోంది. ఈనేపథ్యంలో కేంద్ర బడ్జెట్‌పై మేధావులతో సదస్సులు నిర్వహించేందుకు రాష్ట్ర బీజేపీ నాయకులు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో మంగళవారం నుంచి ప్రారంభం అయ్యే ఈ సదస్సులు ఈనెల 26 వరకు కొనసాగనున్నాయి. అన్ని జిల్లాల్లో నిర్వహించే ఈ సదస్సుల్లో కేంద్ర మంత్రులు, ఎంపీలు, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వై.సత్యకుమార్ యాదవ్‌తోసహా బీజేపీ ఎమ్మెల్యేలు, వ్యాపారవేత్తలు పాల్గొంటారు. 18న గుంటూరులో జరిగే కార్యక్రమానికి కేంద్ర మంత్రి కె.రామ్మోహన్ నాయుడు హాజరవుతారు. 19న తిరుపతిలో సదస్సుకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, 21న విజయవాడలో జరిగే సదస్సుకు కేంద్ర మంత్రి హర్దీ్‌పసింగ్ పూరి, 22న విశాఖలో జరిగే సదస్సుకు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, 24న రాజమహేంద్రవరంలో జరిగే కార్యక్రమానికి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, 22న కాకినాడ సదస్సుకు ఎంపీ సీఎం రమేశ్ హాజరవుతారు. వీటితో పాటు 19న శ్రీకాకుళం జిల్లాలో, 21న ఏలూరు, నెల్లూరు, శ్రీసత్యసాయి జిల్లాల్లో, 22న పార్వతీపురంమన్యం, అనకాపల్లి, పశ్చిమగోదావరి, బాపట్ల, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, కడప జిల్లాల్లో, 23న అల్లూరి సీతారామరాజు, విజయనగరం, విశాఖపట్నం, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పల్నాడు, కృష్ణా జిల్లాల్లో ఈ సమావేశాలు జరుగుతాయి.