Share News

Amaravati : రాజధాని టెండర్లు పిలుచుకోవచ్చు!

ABN , Publish Date - Feb 07 , 2025 | 03:47 AM

అమరావతి రాజధాని పనులకు టెండర్లు పిలవటానికి అడ్డంకులు తొలిగాయి. టెండర్లు పిలుచుకోవచ్చని, ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత మాత్రమే వాటిని ఖరారు చేయాల్సిందిగా ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. దీంతో టెండర్లు పిలవాలన్న సీఆర్‌డీఏకు పెద్దఊరట లభించింది. అమరావతి రాజధాని ప్రాంత

Amaravati : రాజధాని టెండర్లు పిలుచుకోవచ్చు!

కానీ కోడ్‌ ముగిసే వరకు ఖరారు చేయవద్దు: ఈసీ

విజయవాడ, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): అమరావతి రాజధాని పనులకు టెండర్లు పిలవటానికి అడ్డంకులు తొలిగాయి. టెండర్లు పిలుచుకోవచ్చని, ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత మాత్రమే వాటిని ఖరారు చేయాల్సిందిగా ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. దీంతో టెండర్లు పిలవాలన్న సీఆర్‌డీఏకు పెద్దఊరట లభించింది. అమరావతి రాజధాని ప్రాంత పనులకు సంబంధించి కొంతమంది సైంధవులు పనులను అడ్డుకునేందుకు ప్రపంచబ్యాంకుకు ఫిర్యాదులు మీద ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ ఫిర్యాదులన్నీ వైసీపీయే తమ నాయకులు, కార్యకర్తల చేత చేయిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో ఉమ్మడి కృష్ణా-గుంటూరు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావటంతో.. మళ్లీ సైంధవులు ఫిర్యాదు చేసి అడ్డుకునే ప్రయత్నం చేస్తారన్న ఉద్దేశంతో వాస్తవ పరిస్థితిని తెలియచేస్తూ సీఆర్‌డీఏ కమిషనర్‌ కన్నబాబు ఎన్నికల సంఘానికి కొద్ది రోజుల కిందట లేఖ రాశారు. అమరావతి రాజధాని నగరంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రూ. 48,012.67 కోట్ల విలువతో చేపట్టేందుకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు ఇవ్వటం జరిగిందని, అందులో రూ. 14,874.53 కోట్ల విలువైన పనులకు టెండర్లను ఆహ్వానించినట్టు తెలిపారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో రాజధాని ప్రాజెక్టు పనులను నిలుపుదల చేయటం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ప్రభావం చూపే పరిస్థితి ఉందని ఆయన ఎన్నికల సంఘం దృష్టికి తీసుకు వచ్చారు. గత కొన్ని సంవత్సరాలుగా పనుల విషయంలో సుదీర్ఘ జాప్యం జరగటం వల్ల ఖర్చు పెరిగిపోయిందని.. ఆర్థిక చిక్కులకు దారి తీసిందని ఆ లేఖలో కమిషనర్‌ పేర్కొన్నారు. రాజధాని నిర్మాణ పనులను ముందుకు తీసుకు వెళ్లేందుకు ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు, హడ్కో, కేఎ్‌ఫడబ్ల్యూల నుంచి రూ. 31 వేల కోట్ల రుణాలను తీసుకోవటం జరిగిందని తెలిపారు. చాలా కాలంగా నిలిచిపోయిన పనులను వేగంగా ముందుకు తీసుకువెళ్లటానికి వీలుగా టెండర్లు పిలవటం జరిగిందని, ఇంకా పిలవాల్సి ఉందని తెలిపారు. రాజధాని ప్రాజెక్టులనేవి రాష్ట్రం మొత్తం అభివృద్ధి, ఆర్థిక వృద్ధి, ఉపాధి, మౌలిక సదుపాయాలకు సంబంధించినవని తెలిపారు. ఈ తరుణంలో ఏదైనా అంతరాయం తలెత్తితే రాష్ట్ర పురోగతిపై ప్రభావం చూపుతుందని చెప్పారు. రాష్ట్ర సీఈఓ ఈ లేఖను పరిశీలించి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు. దీనిపై ఈసీ స్పష్టతిచ్చింది.

Updated Date - Feb 07 , 2025 | 03:47 AM