స్వచ్ఛాంధ్రలో వెనుకబాటు..!
ABN , Publish Date - Feb 14 , 2025 | 11:28 PM
స్వచ్ఛాంధ్ర.. స్వర్ణాంధ్ర లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన కళ్యాణ్ కృషి చేస్తున్నారు.

వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో అంతులేని నిర్లక్ష్యం
స్వచ్ఛతలో 21వ స్థానంలో కర్నూలు జిల్లా
కర్నూలు, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): స్వచ్ఛాంధ్ర.. స్వర్ణాంధ్ర లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన కళ్యాణ్ కృషి చేస్తున్నారు. పల్లె, పట్టణాల్లో పౌరులు భాగస్వామ్యులు కావాలి. ఇల్లు.. కాలనీ.. ఊరు స్వచ్ఛత కోసం పాటుపడాలి..! మండల స్థాయి నుంచి జిల్లాస్థాయి అధికారులు.. గ్రామ సర్పంచ నుంచి మంత్రుల వరకు చెబుతున్న మాటలు ఇవి. వాస్తవాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. నగరం, మున్సిపాలిటీ పట్టణాల్లో ఓ రకంగా స్వచ్ఛత కోసం పాటుడుతుంటే.. గ్రామీణ ప్రాంతాల్లో ఆ దిశగా తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగానే కనిపిస్తున్నాయి. ప్రతి నెల మూడో శనివారం ‘స్వచ్ఛత దివస్’ నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పంచాయతీ రాజ్ శాఖ స్వచ్ఛతపై 14 అంశాలపై పక్కాగా సర్వే నిర్వహించారు. జిల్లా 21వ స్థానంలో నిలిచింది. అంటే స్వచ్ఛతలో జిల్లా ఎంత వెనుకబడి ఉందో తెలుస్తోంది.
జిల్లా వ్యాప్తంగా 484 పంచాయతీలు, 237 మజారా గ్రామాలు కలిపి 721 పల్లెలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలు, కర్నూలు నగరపాలక సంస్థ, ఆదోని, ఎమ్మిగనూరు మున్సిపాలిటీలు, గూడూరు నగర పంచాయతీల్లో స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. బహిరంగ మల, మూత్ర విసర్జన పూర్తిగా అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత మిషన గ్రామీణ్ పథకం అమలు చేస్తుంది. ఇందుకోసం భారీగా నిధులు కూడా ఖర్చు చేస్తుంది. కేంద్రం స్పూర్తితో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం స్వచ్చాంధ్ర కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మంగా అమలు చేస్తోంది. గడిచిన రెండేళ్లలో స్వచ్ఛాంధ్ర మిషనలో భాగంగా రూ.41.02 కోట్లతో 998 పనులు చేపట్టారు. 651 పనులు పూర్తి చేశామని, 337 పనులు వివిధ దశల్లో ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. 30 శాతం పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులే అంటున్నారు.
ఫ స్వచ్ఛతలో జిల్లా 21వ స్థానం:
స్వర్ణాంధ్ర.. స్వచ్ఛాంధ్రలో భాగంగా పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలు 14 అంశాలపై సర్వే నిర్వహించాయి. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణం, పబ్లిక్ టాయిలెట్స్, ఇంటింటి చెత్త సేకరణ, సాలిడ్ వేస్ట్ సెగ్రిగేషన, పాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, కమ్యూనిటీ సోక్ పిట్స్, పరిశుభ్ర గ్రామాలు (క్లీన విలేజ్), ఓడీఎఫ్ ప్లస్ మోడల్ విలేజ్.. వంటి అంశాల్లో జిల్లా వారిగా పురోగతి సర్వే చేశారు. ఒక్కో అంశానికి 10-20 పాయింట్లు కేటాయించారు. పై అంశాలు అమలవుతున్న తీరుపై సర్వే అధికారులు పాయింట్లు ఇచ్చారు. ఆ వివరాలను స్వచ్ఛాంధ్ర మొబైల్ యాప్‌లో నమోదు చేస్తారు. మొత్తం 200 పాయింట్లకు గానూ 129 పాయింట్లతో ఎన్టీఆర్ జిల్లా ప్రథమ స్థానంలో ఉంటే.. 99 పాయింట్లతో కర్నూలు జిల్లా 21వ స్థానంలో నిలిచింది. 94 పాయింట్లతో నంద్యాల జిల్లా 23వ స్థానంలో ఉంది.