Ongole: ఒంగోలులో ఏవీ ఇన్ఫాక్రాన్ చైర్మన్ అరెస్టు
ABN , Publish Date - Jun 25 , 2025 | 03:15 AM
బైబ్యాక్ పేరుతో రూ.కోట్లలో రియల్ ఎస్టేట్ మోసానికి పాల్పడిన ఏవీ ఇన్ఫాక్రాన్ పైవ్రేట్ లిమిటెడ్ చైర్మన్ లక్ష్మీ విజయ్‌కుమార్ గోగులను సైబరాబాద్ పోలీసులు ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలులో అరెస్టు చేశారు.
రియల్ ఎస్టేట్ స్కీమ్‌లతో రూ.కోట్లకు టోకరా
8నిందితుడు బెజవాడ వైసీపీ నేత కుమారుడు
హైదరాబాద్ సిటీ/ఒంగోలు క్రైం, జూన్ 24(ఆంధ్రజ్యోతి): బైబ్యాక్ పేరుతో రూ.కోట్లలో రియల్ ఎస్టేట్ మోసానికి పాల్పడిన ఏవీ ఇన్ఫాక్రాన్ పైవ్రేట్ లిమిటెడ్ చైర్మన్ లక్ష్మీ విజయ్‌కుమార్ గోగులను సైబరాబాద్ పోలీసులు ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలులో అరెస్టు చేశారు. ఈయన ఒంగోలులోని సంతపేటలో తెలిసినవారి ఇంట్లో తలదాచుకున్నట్లు ఉప్పందుకున్న సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం(ఈవోడబ్ల్యూ) బృందాలు.. స్థానిక పోలీసుల సాయంతో అదుపులోకి తీసుకున్నాయి. అనంతరం కోర్టులో హాజరుపరిచి, న్యాయమూర్తి అనుమతితో హైదరాబాద్‌కు తరలించాయి.
ఇతణ్ని ప్రత్యేక బృందాలు విచారిస్తున్నట్లు తెలిసింది. విజయ్‌కుమార్ విజయవాడ వైసీపీ నేత, మాజీ డిప్యూటీ మేయర్ గోగుల రమణారావు కుమారుడు. మాదాపూర్ దుర్గం చెరువు సమీపంలో.. ఏవీ ఇన్‌ఫ్రాకాన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన విజయ్‌కుమార్.. రియల్‌ఎస్టేట్ దందా ప్రారంభించారు. నారాయణ్‌ఖేడ్, యాదగిరిగుట్ట, బుదేరా తదితర ప్రాంతాల్లో తమ వెంచర్లున్నాయంటూ నమ్మబలికారు. దీంతో పలువురు బాధితులు బైబ్యాక్ పథకానికి ఆకర్షితులయ్యారు. రూ.లక్షల్లో పెట్టుబడులు పెట్టారు. కొన్ని నెలల తర్వాత.. తమ పెట్టుబడులను వెనక్కి ఇవ్వకపోవడంతో బాధితులు విజయ్‌పై ఒత్తిడి పెంచారు. చివరకు తాము మోసపోయినట్లు నిర్ధారణకు వచ్చిన బాధితులు సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.