చింతమనేనిపై హత్యాయత్నం!
ABN , Publish Date - Feb 14 , 2025 | 06:36 AM
ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై హత్యాయత్నం జరిగింది. బుధవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఏలూరు సమీపంలోని ఓ గ్రామంలో జరిగిన వివాహ వేడుకకు హాజరై, వెనుతిరిగిన సమయంలో వైసీపీకి చెందిన మాజీ

కారు అడ్డుపెట్టి కవ్వింపు చర్యలు.. ఇనుప రాడ్డుతో దాడి
మాజీ ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరిపై ఎమ్మెల్యే గన్‌మ్యాన్ ఫిర్యాదు
ఎస్పీకి ఆధారాలు అందజేసిన చింతమనేని ప్రభాకర్
పెదవేగి, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై హత్యాయత్నం జరిగింది. బుధవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఏలూరు సమీపంలోని ఓ గ్రామంలో జరిగిన వివాహ వేడుకకు హాజరై, వెనుతిరిగిన సమయంలో వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి, చింతమనేని కారుకు తన కారును అడ్డుగా పెట్టి, కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. కారును అడ్డు తీయాలని తాను వెళ్లి అభ్యర్థించినప్పటికీ.. దుర్భాషలాడుతూ అబ్బయ్యచౌదరి ఇనుప రాడ్డు తీసుకుని దాడి చేశారని చింతమనేని గన్‌మ్యాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీ అల్లరి మూకలు ప్రభాకర్‌పై దాడికి ప్రయత్నించాయని డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనతో దెందులూరులో ఉద్రిక్తత నెలకొంది. పెదవేగి మండలం దుగ్గిరాలలోని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇంటికి టీడీపీ శ్రేణులు భారీగా చేరుకున్నాయి. అటు వైసీపీ వర్గీయులు పెదవేగి మండలం కొండలరావుపాలెంలోని కొఠారు ఇంటికి భారీగా చేరుకున్నారు. దీంతో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేసి, పర్యవేక్షించారు. ఈ సంఘటనపై చింతమనేని ప్రభాకర్ ఏలూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ వివాదానికి సంబంధించిన ఆధారాలను ఎస్పీకి అందించారు.