Share News

Minister Atchannaidu: వైసీపీ ఫేక్‌.. జగన్‌ చెప్పేవన్నీ ఫేక్‌

ABN , Publish Date - Aug 26 , 2025 | 06:02 AM

వైసీపీ ఒక ఫేక్‌ పార్టీ అని, ఆ పార్టీ నుంచి సీఎంగా పనిచేసిన జగన్‌ చెప్పేవన్నీ ఫేక్‌ అని మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. అబద్ధాల నుంచి పుట్టుకొచ్చిన ఆ పార్టీ...

Minister Atchannaidu: వైసీపీ ఫేక్‌.. జగన్‌ చెప్పేవన్నీ ఫేక్‌

  • కూటమి 30 ఏళ్లుంటుంది

  • కాకినాడ పార్లమెంటరీ స్థాయి సమావేశంలో అచ్చెన్న

కాకినాడ సిటీ, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): వైసీపీ ఒక ఫేక్‌ పార్టీ అని, ఆ పార్టీ నుంచి సీఎంగా పనిచేసిన జగన్‌ చెప్పేవన్నీ ఫేక్‌ అని మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. అబద్ధాల నుంచి పుట్టుకొచ్చిన ఆ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్ట్ని గట్టిగా తిప్పి కొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాకినాడలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం జరిగిన కాకినాడ పార్లమెంటరీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారం కోసం బాబాయ్‌ని చంపించి గుండెపోటు అని చిత్రీకరించిన జగన్‌, వైజాగ్‌లో కోడి కత్తి డ్రామా, విజయవాడలో గులకరాయి డ్రామా ఆడిన సంగతి అందరికీ తెలిసిందేనన్నారు. సూపర్‌ సిక్స్‌ పథకాల ద్వారా ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తూ ప్రధాని మోదీ సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు. దీంతో ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని, దాన్ని ఓర్వలేక దుష్ప్రచారాలకు ఒడిగట్టారని అన్నారు. ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్‌ తీసేస్తోందని వైసీపీ ఫేక్‌ ప్రచారం సాగిస్తోందన్నారు. వికలాంగుల పెన్షన్‌ అర్హులెవరికీ తొలగించడంలేదని స్పష్టం చేశారు. దీనిపై జగన్‌ దుష్ప్రచారం చేస్తున్నారని, ఆయన రోత పత్రికలో ఇష్టానుసారం పెడరాతలు రాస్తున్నారని అన్నారు. కాగా, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కలయిక ఇంకో 30 ఏళ్లు ఉంటుందని అచ్చెన్న అన్నారు. అందుకు టీడీపీ కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుందని, ఆ దిశగా పార్టీ శ్రేణులు సిద్ధపడి ఉండాలని పిలుపునిచ్చారు. పార్టీలోను, అనుబంధ కమిటీల్లోను అనేక పదవులు ఉన్నాయని తెలిపారు. త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయని, కష్టపడిన వారికి తప్పకుండా సముచిత స్థానం లభిస్తుందని భరోసా ఇచ్చారు.

Updated Date - Aug 26 , 2025 | 06:03 AM