Share News

Araku Chali Utsav : నేటి నుంచి ‘అరకు చలి ఉత్సవ్‌’

ABN , Publish Date - Jan 31 , 2025 | 06:13 AM

పర్యాటకుల స్వర్గధామంగా ఉన్న ఆంధ్రా ఊటీ అరకులోయలో.. ‘అరకు చలి ఉత్సవ్‌’ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు ప్రత్యేక వినోద, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు

Araku Chali Utsav : నేటి నుంచి ‘అరకు చలి ఉత్సవ్‌’

కూటమి ప్రభుత్వం రాకతో మళ్లీ ఉత్సవాలు

రూ.కోటి విడుదల చేసిన సర్కారు

అలరించనున్న గిరిజన సాంస్కృతిక కార్యక్రమాలు

ఫ్లవర్‌ షో, కార్నివాల్‌, సైక్లింగ్‌, ట్రెకింగ్‌, లేజర్‌ షో

ప్రత్యేక ఆకర్షణగా హెలికాప్టర్‌ రైడ్‌, పారా గ్లైడింగ్‌

ఉత్సవ్‌ కార్యక్రమాలు

పాడేరు/అరకులోయ, జనవరి 30(ఆంధ్రజ్యోతి): పర్యాటకుల స్వర్గధామంగా ఉన్న ఆంధ్రా ఊటీ అరకులోయలో.. ‘అరకు చలి ఉత్సవ్‌’ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు ప్రత్యేక వినోద, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందుకు అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం వేదిక కానుంది. పద్మాపురం గార్డెన్స్‌లో పుష్ప ప్రదర్శన ఏర్పాటుచేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014-19 మధ్య ఏటా అరకు ఉత్సవ్‌ నిర్వహించేవారు. ఆ తర్వాత వైసీపీ సర్కారు ఒక్కసారే ఉత్సవాలు జరిపి సరి పెట్టింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం.. ఈ నెల 31, ఫిబ్రవరి 1, 2 తేదీల్లో అరకు ఉత్సవ్‌ను నిర్వహించాలని ఆదేశిస్తూ, కోటి రూపాయలు మంజూరు చేసింది. దీంతో అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌ ఎ.ఎ్‌స.దినేశ్‌కుమార్‌ ఆధ్వర్యంలో భారీస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి ‘హెలికాప్టర్‌ రైడ్‌’ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.


మొదటిరోజు: శుక్రవారం ఉదయం 7.30కు అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం నుంచి ఆర్‌టీసీ కాంప్లెక్స్‌ వరకూ మారథాన్‌ నిర్వహిస్తున్నారు. 11 గంటలకు పద్మాపురం బొటానికల్‌ గార్డెన్స్‌లో ఫ్లవర్‌ షో ప్రారంభిస్తారు. ట్రైబల్‌ మ్యూజియం ప్రాంగణంలో పెయింటింగ్‌ పోటీలు ఉంటాయి. మధ్యాహ్నం ప్రధాన వేదిక వద్ద 25 స్టాళ్లను ప్రారంభిస్తారు. సాయంత్రం 5నుంచి రాత్రి 9వరకు గిరిజన కళాకారుల నృత్య ప్రదర్శనలు ఉంటాయి.

రెండో రోజు: ఫిబ్రవరి ఒకటో తేదీ ఉదయం 7.30 గంటలకు బొర్రా జంక్షన్‌ నుంచి ఉత్సవ్‌ ప్రధాన కేంద్రమైన అరకులోయ డిగ్రీ కళాశాల మైదానం వరకూ సైక్లింగ్‌ ఈవెంట్‌ ప్రారంభమవుతుంది. సాయంత్రం ఐదు గంటల నుంచి ప్రధాన వేదికపై ఫ్యాషన్‌ షో, గిరిజన కళాకారులతో నృత్య, సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి.

మూడో రోజు: 2వ తేదీన ఉదయం 7.30 గంటలకు సుంకరమెట్ట కాఫీ తోటల నుంచి అరకు ట్రెక్‌ ప్రారంభమవుతుంది. అరకులో ముగ్గుల పోటీ, సాయంత్రం 5 నుంచి ప్రధాన వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఫోక్‌, వెస్ట్రన్‌ డ్యాన్స్‌లు, లేజర్‌షో నిర్వహించనున్నారు. వీటితోపాటు మూడు రోజులూ అరకులోయ లోతేరు రోడ్డులో గల వజ్రాలకొండ ఎదురుగా ఉన్న ప్రాంతంలో హెలికాప్టర్‌ రైడ్‌, మాడగడ సన్‌రైజ్‌ హిల్స్‌ వద్ద టెండమ్‌ గ్లైడింగ్‌, పారా గ్లైడింగ్‌, పద్మాపురం గార్డెన్‌లో హాట్‌ ఎయిర్‌ బెలూన్‌ సందర్శకులకు అందుబాటులో ఉంటాయి.



Also Read-
Bad Girl: సమాజంలో కులం ఉంది కాబట్టే సినిమాల్లో కులం

Also Read- Spirit: రెబల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. స్పిరిట్ షూటింగ్ అప్పుడే

Also Read- Kangana Ranaut: కాజోల్‌, దీపికా ముద్దు.. మేమంటే చేదు

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 31 , 2025 | 06:13 AM