APSRTC : స్టీరింగ్ ఒకరికి.. సిగ్నల్ మరొకరికి!
ABN , Publish Date - Feb 07 , 2025 | 05:11 AM
ఒక వాహనాన్ని ఇద్దరు డ్రైవర్లు నడిపితే.. దాని గమ్యం ఏటు వెళుతుందో చెప్పగలమా..!! ప్రస్తుతం ఏపీఎ్‌సఆర్టీసీలో పరిస్థితి ఇదే విధంగా ఉంది. ఆర్టీసీ వైస్ చైర్మన్, ఎండీగా రిటైర్డ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉన్నారు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్(పీటీడీ) కమిషనర్‌గా రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి

ఆర్టీసీ వైస్‌చైర్మన్, ఎండీగా ద్వారకా తిరుమలరావు
పీటీడీ కమిషనర్‌గా కాంతిలాల్‌కు పూర్తి బాధ్యతలు
ఆపరేషన్స్, అడ్మినిస్ట్రేషన్ విధులు వేర్వేరుగా ఇద్దరికి..
గందరగోళ పరిస్థితిపై అధికారులు, సిబ్బందిలో చర్చ
అమరావతి, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): ఒక వాహనాన్ని ఇద్దరు డ్రైవర్లు నడిపితే.. దాని గమ్యం ఏటు వెళుతుందో చెప్పగలమా..!! ప్రస్తుతం ఏపీఎ్‌సఆర్టీసీలో పరిస్థితి ఇదే విధంగా ఉంది. ఆర్టీసీ వైస్ చైర్మన్, ఎండీగా రిటైర్డ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉన్నారు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్(పీటీడీ) కమిషనర్‌గా రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తారు. బస్సుల ఆపరేషన్స్ విభాగాన్ని ఎండీ పర్యవేక్షిస్తే.. పరిపాలనా వ్యవహారాలు (అడ్మినిస్ట్రేషన్) రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి చూస్తారు. ఆర్టీసీ చరిత్రలో ఎన్నడూ లేని ఇలాంటి విచిత్ర పరిస్థితి నెలకొనడం చర్చనీయాంశమైంది. ఆర్టీసీ హౌస్‌లోని కింది స్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారుల వరకూ దీనిపై మాట్లాడుకుంటున్నారు. గత నెలాఖరున తిరుమలరావు రిటైర్డ్ అయ్యే వరకు ఆయన చేతిలోనే ఉన్న ఈ మొత్తం బాధ్యతలు, ఇప్పుడు విభజన కావడంపై గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రతిరోజూ 11 వేల బస్సుల్లో 45 లక్షల మందికి పైగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీలో 48 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ప్రతి నెలా రూ.500 కోట్ల ఆదాయం తెచ్చుకునే కీలకమైన సంస్థకు గత ప్రభుత్వంలో 2020 జనవరి నుంచి ఒక విధమైన ముప్పు వస్తే.. 2025 ఫిబ్రవరి నుంచి మరో సమస్య ఎదురైంది. కార్పొరేషన్‌గా ఉన్న ఆర్టీసీని రెండు ముక్కలు చేసి బస్సులు, ఆస్తులను కార్పొరేషన్ కిందే ఉంచి.. సిబ్బంది, జీతభత్యాలు, ఇతర పాలనా వ్యవహారాలను పీటీడీ కింద ప్రభుత్వ పరిధిలోకి తీసుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వం తీసుకున్న అలాంటి అనాలోచిత నిర్ణయం వల్ల ఆర్టీసీ సిబ్బంది విలీన సమస్యలు పరిష్కారం కాక నాలుగేళ్ల పాటు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడిప్పుడే ఆ సమస్యలు తీరిపోతున్నాయనగా.. మరో కొత్త సమస్య ఎదురైంది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి పూర్తిస్థాయిలో పాలకమండలిని ఏర్పాటు చేయకపోవడంతో విధానపరమైన నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి నెలకొంది. ఏడు నెలలకు పైగా ఇన్‌చార్జి బాస్‌గా ఉన్న తిరుమలరావు జనవరి 31న డీజీపీగా పదవీ విరమణ పొందారు. అయితే త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే ఆలోచనలో ఉన్న కూటమి ప్రభుత్వం.. అందుకు అనుభవజ్ఞుడైన అధికారి ఉంటే మంచిదన్న భావనలో ఉంది. ఇందుకు అనుగుణంగానే తిరుమలరావును పదవీ విరమణ తర్వాత ఆర్టీసీ వైస్‌చైర్మన్, ఎండీగా నియమించింది. అయితే ప్రభుత్వంతో జరిపే పాలనాపరమైన వ్యవహారాలు రిటైర్డ్ అధికారికి అప్పగించడం సరికాదన్న ఆలోచనతో అడ్మినిస్ట్రేషన్ విభాగాన్ని రవాణా శాఖ ముఖ్య కార్యదర్శికి అప్పగిస్తూ జీవో జారీచేసింది. కీలకమైన అడ్మిన్ విభాగం ఎండీ చేతిలో లేకపోతే కనీసం డిపో మేనేజర్‌ను కూడా బదిలీ చేయడం సాధ్యం కాదు. ఆపరేషన్స్ విభాగంపై పూర్తి పట్టు రావాలంటే డిపో మేనేజర్ స్థాయిలో చర్యలు తీసుకునే అధికారం ఎండీ చేతిలో ఉంటే ప్రయాణ సేవల్లో నాణ్యత ఉంటుంది. కానీ రిటైర్ట్ అధికారి సంతకంతో పంపించే దస్త్రానికి విలువ ఉండదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రవాణా శాఖ ఉన్నతాధికారులు అంటున్నారు. తిరుమలరావు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని బస్సుల నిర్వహణతోపాటు ఆపరేషన్స్ వ్యవహారాలు ఆయనకు అప్పగించినట్లు వివరిస్తున్నారు. అయితే ఇదంతా గందరగోళంగా ఉందని ఆర్టీసీ హౌస్‌లోని సిబ్బంది, అధికారులు, అసోసియేషన్ల ప్రతినిధులు పెదవి విరుస్తున్నారు. పూర్తిస్థాయి అధికారాలు ఒకరి వద్దే ఉంటే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.