APPSC Leak: ఏపీపీఎస్సీలో లీకు వీరుడు!
ABN , Publish Date - Oct 06 , 2025 | 03:42 AM
లక్షలాది మంది నిరుద్యోగుల కలలను సాకారం చేసే రాజ్యాంగ బద్ధమైన సంస్థ ఏపీపీఎస్సీ. దీని నుంచి ఎలాంటి ప్రకటన వచ్చినా నిరుద్యోగులను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది....
అనధికార సోషల్ మీడియాలో అధికారిక సమాచారం
ముందే లీక్ చేస్తున్న కమిషన్ సభ్యుడు
గోప్యంగా ఉంచాల్సిన విషయాలూ వెల్లడి
అభ్యర్థుల అభిప్రాయాలు సేకరణ
తాజా ర్యాంకింగ్ జాబితాలపై పోల్స్
వైసీపీ హయాంలో సుధీర్ నియామకం
జగన్‌కు సమీప బంధువనే ప్రచారం
సర్వం తానే అన్నట్టుగా వ్యవహారం
సర్కారుకు నిరుద్యోగుల సంఘం ఫిర్యాదు
అమరావతి, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): లక్షలాది మంది నిరుద్యోగుల కలలను సాకారం చేసే రాజ్యాంగ బద్ధమైన సంస్థ ఏపీపీఎస్సీ. దీని నుంచి ఎలాంటి ప్రకటన వచ్చినా నిరుద్యోగులను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఇప్పటి వరకు ఏపీపీఎస్సీకి ఎలాంటి సోషల్ మీడియా ఖాతా లేదు. కానీ, కమిషన్ సభ్యుడు పరిగె సుధీర్ అత్యుత్సాహానికి పోయారు. తనే సొంతంగా ఓ టెలిగ్రామ్ గ్రూప్‌ను సృష్టించి.. ఏపీపీఎస్సీకి సంబంధించిన సమాచారాన్ని అనధికారికంగా ముందే వెల్లడిస్తున్నారు. అంతేకాదు.. అభ్యర్థుల నుంచి పలు కీలక విషయాలపై సమాచారం సేకరిస్తున్నారు. ఈ వ్యవహారంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ‘‘గ్రూప్1, 2 ఫలితాలకు ముందు జనరల్ ర్యాంకింగ్ జాబితాలు విడుదల చేయాలా?. వద్దా?. గ్రూప్-2 అభ్యర్థులకు పోస్టు ప్రాధాన్యత ఎంపికకు మరో అవకాశం ఇవ్వాలా? వద్దా?. ఉద్యోగాల భర్తీలో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తే బాగుంటుంది?. అపాయింట్‌మెంట్‌కు ముందా? తర్వాతా?.’’ అంటూ.. టెలిగ్రామ్‌లో పోల్ నిర్వహిస్తున్నారు. అంతేకాదు ఏపీపీఎస్సీ ప్రకటించాల్సిన పలు అధికారిక నిర్ణయాలు ముందుగానే ఆయన టెలిగ్రామ్ గ్రూప్‌లో ప్రకటిస్తున్నారు. ప్రభుత్వానికి గోప్యంగా పంపే కీలక ప్రతిపాదనలనూ టెలిగ్రామ్‌లో పోస్ట్ చేస్తున్నారు. ఒక్కముక్కలో చెప్పాలంటే అనధికారికంగా ఆయన మరో వ్యవస్థను నడుపుతున్నారు. కమిషన్‌లో సభ్యుడిగా ఉంటూ ఇలా పోల్స్ నిర్వహించడం, అధికారిక నిర్ణయాలు, ప్రతిపాదనలను బహిర్గతం చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై నిరుద్యోగుల సంఘం ఆన్‌లైన్ ద్వారా ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. మరోవైపు ఆయన నిర్వహిస్తున్న పోల్స్‌తో అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు.
అప్పట్లో ట్విట్టర్..
గత వైసీపీ ప్రభుత్వంలో పరిగె సుధీర్ కమిషన్ సభ్యుడిగా నియమితులయ్యారు. ‘సమాజ సేవ’(సోషల్ సర్వీస్) కోటాలో ఆయన ఏపీపీఎస్సీలోకి వచ్చారు. మాజీ సీఎం జగన్‌కు బంధువు అని ప్రచారం ఉంది. కమిషన్ నిబంధనల ప్రకారం చైర్మన్, కార్యదర్శిలు మాత్రమే అధికారిక నిర్ణయాలు ప్రకటించాలి. కానీ, ఆయన కమిషన్ సభ్యుడిగా నియామకం అయినప్పటి నుంచీ సోషల్ మీడియా వేదికగా అనధికారికంగా కమిషన్ నిర్ణయాలు ప్రకటిస్తూ వస్తున్నారు. గత ప్రభుత్వంలో ‘ట్విట్టర్’ వేదికగా కమిషన్ నిర్ణయాలను ప్రకటించేవారు. పరీక్షల తేదీలు, నిర్వహణలో మార్పులు లాంటి అధికారిక సమాచారం అంతా ఆయన ట్విట్టర్‌లో ముందుగానే వెల్లడించేవారు. ఆ తర్వాత కమిషన్ అధికారికంగా ప్రకటనలు జారీచేసేది. ప్రభుత్వం మారిన తర్వాత టెలిగ్రామ్ గ్రూప్ సృష్టించారు. దీనిలో ప్రస్తుతం 3,600 మంది నిరుద్యోగులు ఉన్నారు. కమిషన్ నిర్ణయాలు, ప్రతిపాదనలు అన్నీ ఆయన దీనిలో పోస్టు చేస్తున్నారు. కమిషన్ కంటే ముందుగానే నిర్ణయాలు ప్రకటించడమే తప్పయితే, అసలు గోప్యంగా ఉంచాల్సిన ప్రతిపాదనలు కూడా బహిర్గతం చేస్తున్నారు. దీంతో రాబోయే నోటిఫికేషన్లు ఎలా ఉంటాయో, ఎలాంటి మార్పులు వస్తాయోనని అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు. ఆయన స్వయంగా కమిషన్‌లో సభ్యుడు కావడంతో ఎక్కువ మంది నిరుద్యోగులు ఆయన ప్రకటనలు నమ్ముతున్నారు. అలాగే చైర్‌పర్సన్ స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయాలపై అనధికారికంగా పోల్స్ నిర్వహించడంపైనా ఆందోళన వ్యక్తమవుతోంది. పోల్స్‌లో నిరుద్యోగుల అభిప్రాయాలను చైర్‌పర్సన్‌కు వివరించి సానుకూల నిర్ణయం వచ్చేలా చూస్తానని హామీలూ ఇస్తున్నారు.
ఉద్యోగ సమాచారం చెప్పేస్తారు!
ఇక ఉద్యోగం వస్తుందా? రాదా? అనే సమాచారాన్ని ఎవరైనా వ్యక్తిగతంగా మెసేజ్ చేసి అడిగితే సుధీర్ సమాధానం చెబుతున్నారని నిరుద్యోగులు చెబుతున్నారు. ఈ క్రమంలో కమిషన్ అధికారికంగా ప్రకటించాల్సిన ఫలితాలను ముందే ఎలా చెప్పలగలుగుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే గ్రూప్-2 రాసిన కొందరు అభ్యర్థులతో ఆయన ఇటీవల సమావేశమైన ఫొటోలు వెలుగు చూశాయి. కమిషన్ నిబంధనల ప్రకారం చైర్‌పర్సన్ లేదా కార్యదర్శిని మాత్రమే నిరుద్యోగులు సమస్యలు, సందేహాలపై కలుస్తారు. సభ్యులను నిరుద్యోగులు కలవరు. కానీ, ఆయన్ను ఎందుకు కలిశారని నిరుద్యోగుల సంఘం ప్రశ్నిస్తుండడం గమనార్హం.