Visakhapatnam: ఇక వరుసగా అల్పపీడనాలు
ABN , Publish Date - Jul 15 , 2025 | 04:25 AM
వర్షాల కోసం ఎదురుచూస్తున్న కోస్తా, రాయలసీమ రైతులకు వాతావరణ శాఖ శుభవార్త తెలిపింది. ఈనెల 17 నుంచి రాష్ట్రంలో వర్షాలు పెరగనున్నాయి. 18వ తేదీ నుంచి మూడు రోజులపాటు విస్తారంగా...
రాష్ట్రంలో 17 నుంచి పెరగనున్న వానలు
18 నుంచి 20 వరకూ కోస్తా,సీమల్లో భారీవర్షాలు
పశ్చిమ బెంగాల్ సమీపంలో వాయుగుండం
విశాఖపట్నం, జూలై 14(ఆంధ్రజ్యోతి): వర్షాల కోసం ఎదురుచూస్తున్న కోస్తా, రాయలసీమ రైతులకు వాతావరణ శాఖ శుభవార్త తెలిపింది. ఈనెల 17 నుంచి రాష్ట్రంలో వర్షాలు పెరగనున్నాయి. 18వ తేదీ నుంచి మూడు రోజులపాటు విస్తారంగా, అక్కడక్కడ భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. గడచిన రెండు వారాలు మధ్య, ఉత్తర భారతాల్లో చురుగ్గా ఉన్న రుతుపవనాలు రానున్న రెండు, మూడు రోజుల్లో దక్షిణాదిలో బలపడనున్నాయి. పశ్చిమ పసిఫిక్‌లో బలపడిన రుతుపవనాల తీవ్రత అటు నుంచి బంగాళాఖాతం వైపు పయనిస్తోంది. ఈ నేపథ్యంలో బంగాళాఖాతంలో వరుసగా అల్పపీడనాలు ఏర్పడతాయని, దీంతో దేశంలో మరోసారి రుతుపవనాలు బలంగా ప్రభావం చూపుతాయని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. ఆదివారం రాత్రి ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం బంగ్లాదేశ్ వైపు వెళ్లే క్రమంలో బలపడి వాయుగుండంగా మారింది.
ప్రస్తుతం కోల్‌కతాకు ఈశాన్యంగా 70 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం ఉంది. మంగళవారానికి పశ్చిమ వాయవ్యంగా పశ్చిమ బెంగాల్ మీదుగా పయనించనుంది. మరోవైపు మధ్యప్రదేశ్, దానికి ఆనుకొని రాజస్థాన్‌లో ఏర్పడిన అల్పపీడనం సోమవారం నాటికి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఈ రెండింటి ప్రభావంతో రుతుపవనద్రోణి ఉత్తర భారతం వైపు పయనించడంతో మధ్య, తూర్పు, వాయవ్య భారతాల్లో భారీ నుంచి అతిభారీగా, అక్కడక్కడ కుంభవృష్టిగా వర్షాలు కురుస్తున్నాయి. ఇదిలావుండగా పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడనాలు ఆగ్నేయ ఆసియా దేశాల మీదుగా పయనించి బలహీనపడిన తరువాత వాటి అవశేషాలు బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తున్నాయి. వచ్చే వారంలో అటువంటి అవశేషం ఒకటి బలపడి 17వ తేదీ తరువాత నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీనికితోడు తూర్పు, పడమర ద్రోణి ఒకటి విస్తరించనున్నది. వీటి ప్రభావంతో ఈనెల 17వ తేదీ నుంచి రాష్ట్రంలో వర్షాలు పెరుగుతాయని, 18వ తేదీ నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఇస్రో వాతావరణ శాఖ విభాగం అంచనా వేసింది. ముఖ్యంగా మధ్య కోస్తా, దానికి ఆనుకుని రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.