Share News

AP Announces Nursing SET from 2025: నర్సింగ్‌కూ సెట్‌

ABN , Publish Date - Apr 11 , 2025 | 05:10 AM

ఆంధ్రప్రదేశ్‌లో నర్సింగ్‌ కోర్సులకు ప్రత్యేకంగా సెట్‌ నిర్వహించేందుకు ఆరోగ్యశాఖ నిర్ణయం తీసుకుంది. జూన్‌లో పరీక్ష నిర్వహించి, జూలై నాటికి అడ్మిషన్లు పూర్తిచేసేలా షెడ్యూల్‌ ఖరారు చేశారు

AP Announces Nursing SET from 2025: నర్సింగ్‌కూ సెట్‌

  • ఏపీలో తొలిసారిగా అమలుకు నిర్ణయం

  • జూన్‌లో పరీక్ష.. జూలై నాటికి అడ్మిషన్లు

అమరావతి, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నర్సింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రత్యేకంగా కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (సెట్‌) నిర్వహించాలని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ ఆదేశించారు. డాక్టర్‌ ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీలో గరువారం ఉదయం నర్సింగ్‌ కాలేజీల అసోసియేషన్‌ ప్రతినిధులతో సమావేశమైన మంత్రి పలు అంశాలపై చర్చించారు. ఇప్పటివరకూ నర్సింగ్‌ కాలేజీల్లో ప్రవేశాలకు కేంద్ర ప్రభుత్వం నిర్వహించే నీట్‌, రాష్ట్రాల స్థాయిలో జరిగే ఎంట్రన్స్‌ల ద్వారా ప్రవేశాలు చేపడుతున్నారు. ఇకపై నీట్‌, ఏపీఈఏపీసెట్‌లతో సంబంధం లేకుండా జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్‌ కోర్సుల్లో చేరే వారికోసం ప్రత్యేకంగా సెట్‌ నిర్వహించాలని నిర్ణయించారు. దేశంలోనే తొలిసారి ఏపీలో 2025-26 విద్యా సంవత్సరంలోనే నర్సింగ్‌ కోర్సులకు సెట్‌ నిర్వహించాలని మంత్రి సూచించారు.


ఇకపై ఏప్రిల్‌లో దరఖాస్తుల ప్రక్రియ మొదలు పెట్టి, జూన్‌లో ఎంట్రన్స్‌ టెస్ట్‌ నిర్వహించాలని, జూలై నాటికి అడ్మిషన్లు పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. కాగా, మూడేళ్ల వ్యవధితో కూడిన జీఎన్‌ఎం కోర్సులకు వార్షిక బోధనా రుసం రూ.15000, నాలుగేళ్ల బీఎస్సీ (నర్సింగ్‌) కోర్సులకు రూ.19,000గా నిర్ధారించడం వల్ల నాణ్యమైన నర్సింగ్‌ విద్యను అందించడంలో సమస్యలు ఎదురవుతున్నాయని అసోసియేషన్‌ ప్రతినిధులు తెలిపారు. దీంతో బోధనా రుసుమును నిర్ధారించడానికి ప్రస్తుతం అనుసరిస్తున్న విధివిధానాల్ని పునఃసమీక్షించాలని మంత్రి సూచించారు. నర్సింగ్‌ కాలేజీల ఏర్పాటు, వాటి నిర్వహణకు సంబంధించి పరస్పర వైరుధ్యాలతో కూడిన పలు జీవోల వల్ల గందరగోళం నెలకొందని, వీటన్నింటినీ పరిశీలించి ఒకే సమగ్ర జీవోను రూపొందించాలని ప్రతినిధులు కోరారు. ఈ విషయాన్ని పరిశీలించిన మంత్రి మూడు నెలల్లో సమగ్ర జీవోను రూపొందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కాగా, 20 ఏళ్ల తర్వాత నర్సింగ్‌ కాలేజీల యాజమాన్యాలతో సమావేశం పెట్టి, పలు సమస్యలకు పరిష్కారాలు చూపినందుకు నర్సింగ్‌ కాలేజీల అసోసియేషన్‌ ప్రతినిధులు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. హైపర్‌ కమిటీ నూతన అధ్యక్షుడు, హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావు, వైస్‌చాన్సలర్‌ నర్సింహం, రిజిస్ట్రార్‌ రాధికారెడ్డి సమావేశంలో పాల్గొన్నారు.

Updated Date - Apr 11 , 2025 | 05:10 AM