Share News

Teacher Beats Kids in AP School Over Homework: విద్యార్థులను చెప్పుతో కొట్టిన టీచర్‌

ABN , Publish Date - Apr 11 , 2025 | 05:36 AM

శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో, హోంవర్క్‌ చేయలేదని రెండో తరగతి విద్యార్థులను టీచర్‌ చెప్పుతో కొట్టిన ఘటన కలకలం రేపింది. తల్లిదండ్రుల ఆగ్రహంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది

Teacher Beats Kids in AP School Over Homework: విద్యార్థులను చెప్పుతో కొట్టిన టీచర్‌

  • హోం వర్క్‌ చేయలేదని అమానుష చర్య

  • శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో ఘటన

ధర్మవరం, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): హోంవర్క్‌ చేయలేదని విద్యార్థులను ఓ ఉపాధ్యాయురాలు చెప్పుతో కొట్టి అమానుషంగా ప్రవర్తించా రు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని జీనియస్‌ ప్రైవేటు పాఠశాలలో గొట్లూరు గ్రామానికి చెందిన విద్యార్థులు సనద్వైజ్‌, జశ్విన్‌, భరత్‌ రెండో తరగతి చదువుతున్నారు. ఇదే పాఠశాలలో రెండు రోజుల క్రితం అనిత టీచర్‌గా చేరారు. ముగ్గురు విద్యార్థులు హోంవర్క్‌ చేయలేదని ఆగ్రహంతో దుర్భాషలాడారు. విచక్షణ కోల్పోయి తన చెప్పు తీసుకుని ముగ్గురు విద్యార్థులనూ కొట్టారు. ఇంటికి వెళ్లిన విద్యార్థులు జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో తల్లిదండ్రులు పాఠశాల వద్దకు వచ్చి టీచర్‌ను ప్రశ్నించారు. అనుకోకుండా అలా జరిగిందని, కావాలని కొట్టలేదని చెప్పినా తల్లిదండ్రులు శాంతించకపోవడంతో వారిపైనా అనిత చెప్పు ఎత్తారు. దీంతో ఆమెను తల్లిదండ్రులు చితకబాదారు. పాఠశాల కరస్పాండెంట్‌ ప్రేమ్‌ కిశోర్‌తో వాగ్వాదానికి దిగారు. అనంతరం తల్లిదండ్రులు వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌కు వెళ్లి పాఠశాల యాజమాన్యం, అనితపై ఫిర్యాదు చేశారు.

Updated Date - Apr 11 , 2025 | 05:36 AM