AP students: రాకెట్ ఎగిరేది ఇలా
ABN , Publish Date - Nov 07 , 2025 | 04:25 AM
సైన్స్ ఎక్స్‌పోజర్ టూర్ టు న్యూఢిల్లీ’ కార్యక్రమం కింద దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లిన ఏపీ ప్రభుత్వ.....
ఏపీ విద్యార్థుల ఢిల్లీ పర్యటనలో తొలిరోజు రాకెట్ పనితీరును వివరించిన శాస్త్రవేత్తలు
న్యూఢిల్లీ, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): ‘సైన్స్ ఎక్స్‌పోజర్ టూర్ టు న్యూఢిల్లీ’ కార్యక్రమం కింద దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లిన ఏపీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు రాకెట్ సైన్స్‌పై అవగాహన పెంచుకున్నారు. ఏపీ సైన్స్ సిటీ, సమగ్రశిక్ష అభియాన్ ఏపీ సంయుక్త అధ్వర్యంలో మూడు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రం నుంచి వచ్చిన 52 మంది విద్యార్థులకు తొలిరోజైన గురువారం ఘజియాబాద్‌లోని కైట్స్ ఇంజనీరింగ్ కాలేజీలో ఇస్రో గుర్తింపు పొందిన శాస్త్రవేత్తలు.. రాకెట్ అంటే ఏమిటి.. అది ఎలా పనిచేస్తుంది.. దాన్ని ఎలా తయారు చేస్తారు.. ఎలా ప్రయోగిస్తారు..? ఇలా ప్రతి అంశంపైనా పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. పర్యటనలో భాగంగా విద్యార్థులు శుక్రవారం రష్యన్ కల్చర్ సెంటర్‌ను సందర్శించనున్నారు.
చంద్రబాబు నాయకత్వంలో కొత్త తరం: రామ్మోహన్‌నాయుడు
సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏఐ, ఏరోస్పేస్ వంటి రంగాల్లో అంతర్జాతీయంగా తెలుగుజాతి ఖ్యాతి ఇనుమడించేలా సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో కొత్తతరం రూపుదిద్దుకుంటోందని కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్‌నాయుడు అన్నారు. సైన్స్ టూర్‌లో భాగంగా ఢిల్లీలో పర్యటిస్తున్న 52 మంది ఏపీ విద్యార్థులతో గురువారం సాయంత్రం ఆయన తన నివాసంలో ముచ్చటించారు.