AP Govt: రెవెన్యూ చట్టాల్లో మార్పులపై మంత్రివర్గ ఉపసంఘం
ABN , Publish Date - Mar 06 , 2025 | 07:00 AM
రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న భూ వివాదాలు, సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ చట్టాలు, నిబంధనల్లో సమూల మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.
అసైన్డ్, నాలా, ఓటీసీ,22(ఏ)అంశాలపై అధ్యయనం
సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు
అమరావతి, మార్చి 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న భూ వివాదాలు, సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ చట్టాలు, నిబంధనల్లో సమూల మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. రైతులు, సామాన్యులు ఎదుర్కొంటున్న అసైన్డ్ భూముల సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలని నిర్ణయించింది. దీనిపై దిశానిర్దేశం చేయడానికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఉత్తర్వులు (జీఓ 464) జారీ చేశారు. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ చైర్మన్‌గా ఉండే ఈ కమిటీలో మంత్రులు పయ్యావుల కేశవ్, పి.నారాయణ, టీజీ భరత్, ఆనం రామనారాయణ రెడ్డి, ఎన్‌ఎండీ ఫరూఖ్ సభ్యులుగా ఉన్నారు. రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సభ్య కన్వీనర్‌గా వ్యవహరిస్తారని జీవోలో పేర్కొంది.
కమిటీ అధ్యయనం చేసే అంశాలివీ..
అమల్లో ఉన్న రెవెన్యూ చట్టాలు, వాటి నియమ నిబంధనల్లో తీసుకురావాల్సిన మార్పులు, సవరణలు
రెవెన్యూ వ్యవస్థను మరింత సులభతరం చేయడం, ప్రజలకు చేరువ చేసేందుకు భూ పరిపాలనకు సంబంధించిన బోర్డు స్టాండింగ్ ఆర్డర్స్ (బీఎ్‌సవో), ఉత్తర్వుల (జీవో)పై అధ్యయనం.
వ్యవసాయ భూమి వినియోగ మార్పిడి, వన్ టైమ్ కన్వర్షన్స్ తదిత ర స్కీములను మరింత బలోపేతం చేయడానికి పురపాలక శాఖతో కలిసి సమగ్ర పాలసీని రూపొందించడం.
అసైన్డ్ భూముల చట్టం ప్రకారం భూములను ఫ్రీహోల్డ్ చేయడంలో పేద వర్గాల ప్రయోజనాలు కాపాడేలా కొత్త పాలసీని ఖరారు చేయడం.
రిజిస్ట్రేషన్ చట్టంలోని 22(ఏ) సెక్షన్‌ను అధ్యయనం చేసి అసైన్డ్, ఇతర కీలక భూముల విషయంలో తగిన పాలసీని సిఫారసు చేయాలి.
భూకేటాయింపు విధానం పక్కాగా అమలయ్యేలా తగిన జాగ్రత్తలు, సూచనలు చేయాలి. ఈ అంశాలపై ప్రభుత్వం తగిన నిర్ణయాలు తీసుకోవడానికి మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సీఎస్ కోరారు.