Share News

National Service Awards: అంకితభావానికి అందలం

ABN , Publish Date - Aug 15 , 2025 | 04:36 AM

విధి నిర్వహణలో ధైర్యసాహసాలు, అంకితభావం ప్రదర్శించిన పోలీసు సిబ్బంది జాతీయ స్థాయి పురస్కారాలకు ఎంపికయ్యారు.

National Service Awards: అంకితభావానికి అందలం

  • రాష్ట్రంలో 25 మందికి పోలీసు పతకాలు

  • జాబితాలో ఐజీ రవికృష్ణ, ఎస్పీ భద్రయ్య

  • జైళ్ల శాఖ డీఐజీ వరప్రసాద్‌తో పాటు మరో ఇద్దరికి విశిష్ఠ సేవా పురస్కారాలు

అమరావతి/న్యూఢిల్లీ, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): విధి నిర్వహణలో ధైర్యసాహసాలు, అంకితభావం ప్రదర్శించిన పోలీసు సిబ్బంది జాతీయ స్థాయి పురస్కారాలకు ఎంపికయ్యారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా యూనిఫాం సర్వీసులకు కేంద్రం పతకాలు ప్రకటించింది. రాష్ట్రపతి పోలీసు సేవ, విశిష్ఠ సేవ, కరెక్షనల్‌ సర్వీస్‌ విభాగాల్లో రాష్ట్రానికి చెందిన 25 మంది పోలీసులు, జైళ్ల శాఖ అధికారులు ఈ జాబితాలో ఉన్నారు. సీఎం చంద్రబాబుకు నిరంతరం రక్షణ కల్పిస్తున్న ఐఎ్‌సడబ్ల్యూ ఎస్పీ చెన్నుపాటి భద్రయ్యతో పాటు డీఎస్పీ రాజీవ్‌కుమార్‌ను రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకం వరించింది. ‘ఈగల్‌’ ఐజీ ఆకే రవికృష్ణ ప్రతిభా పూర్వక సేవా పతకానికి ఎంపికయ్యారు. పార్వతీపురం, చింతపల్లి, కొత్తగూడెం ప్రాంతాల్లో పనిచేసిన రవికృష్ణ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ‘గాంధేయ పోలీసింగ్‌’తో ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. ‘అమ్మ పిలుపు’ కార్యక్రమం ద్వారా మావోయిస్టులను అడవుల నుంచి సమాజంలోకి తీసుకొచ్చేందకు కృషి చేశారు. కర్నూలు జిల్లా ఎస్పీగా ఉన్న సమయంలో ఫ్యాక్షన్‌ గ్రామం కప్పట్రాళ్లను దత్తత తీసుకుని శాంతి పథంలో నడిపించి ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత ఐబీలో చేరి భారత్‌ తరపున చైనాలో పనిచేశారు.

జైళ్లలో సంస్కరణలకు మార్గదర్శి డాక్టర్‌ వరప్రసాద్‌

రాష్ట్రంలోని జైళ్లలో పరిపాలన సంస్కరణలకు నాంది పలికి అత్యుత్తమ ఫలితాలు సాధించిన డీఐజీ ఎం.వరప్రసాద్‌కు సేవా పురస్కారం లభించింది. కస్టడీ, కేర్‌, కరెక్షన్‌ అనే మూడు ప్రధాన లక్ష్యాలను సమర్థంగా అమలు చేస్తూ ఖైదీల జీవితాల్లో మార్పు తీసుకొచ్చిన ఆయన పనితీరును కేంద్రం గుర్తించింది. ఖైదీల్లో నైపుణ్యాభివృద్ధి పెంచడం ద్వారా విడుదల అనంతరం వారి ఉపాధికి మార్గం చూపారు. సీఎ్‌సఆర్‌ నిధులు సమీకరించి జైళ్లలో వసతులు కల్పించడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 18పెట్రోలు బంకులు ఏర్పాటు చేయించి పునరావాసం పొందిన ఖైదీలకు ఉపాధి కల్పించారు. ఏపీ మోడల్‌ ప్రిజన్స్‌ యాక్ట్‌-2023 రూపకల్పనలో ఆయన కీలకంగా వ్యవహరించారు. వినూత్న ఆలోచనలతో జైళ్ల శాఖను నూతన దిశగా నడిపించారు.


పతకాలకు ఎంపికైనవారు...

ప్రతిభా పూర్వక సేవా పతకాలు పొందినవారిలో వల్లూరు శ్రీనివాసరావు(డీఎస్పీ), వీరవెంకట ప్రతాప్‌ కుమార్‌ (డీఎస్పీ), కె. రామచంద్రరాజు (అసిస్టెంట్‌ కమాండెంట్‌), మామిడి గోవిందరావు (ఇన్‌స్పెక్టర్‌), జి. రామకృష్ణ (ఇన్‌స్పెక్టర్‌), బొడ్డు శ్రీనివాసరావు (హెడ్‌ కానిస్టేబుల్‌), కె. సీతారాము (సబ్‌ ఇన్‌స్పెక్టర్‌), పెద్దిరెడ్డి చంద్రశేఖర్‌ (ఏఎ్‌సఐ), నాగమల్లేశ్వరరావు (ఏఎ్‌సఐ), వెంకట రామశర్మ (ఏఎ్‌సఐ), ఉస్మాన్‌ ఘనీ ఖాన్‌ (ఏఎ్‌సఐ), కురువ గోపాల్‌ (సబ్‌ ఇన్‌స్పెక్టర్‌), కొత్తకోట కోటేశ్‌ (సబ్‌ ఇన్‌స్పెక్టర్‌), డి. నాగేశ్వరరావు (ఏఎ్‌సఐ), పామర్తి సీతారామాంజనేయులు (ఏఎ్‌సఐ), నాగబాబు కొప్పిశెట్టి (ఏఎ్‌సఐ), జి. గోపాలకృష్ణ (హెడ్‌ కానిస్టేబుల్‌), సురేశ్‌ కుమార్‌ మురుగేశన్‌ (హెడ్‌ కానిస్టేబుల్‌), జి. దానం (హెడ్‌ కానిస్టేబుల్‌)తో పాటు జైళ్లశాఖకు చెందిన రవికుమార్‌ కరణం (చీఫ్‌ హెడ్‌ వార్డర్‌), తలపర్తి వీరవెంకట సత్యనారాయణ (హెడ్‌ వార్డర్‌) ఉన్నారు.

ఇద్దరు ఆర్‌పీఎఫ్‌ అధికారులకూ..

రాష్ట్రానికి చెందిన ఇద్దరు ఆర్‌పీఎఫ్‌ అధికారులు రాష్ట్రపతి పోలీసు సేవ పతకానికి ఎంపికయ్యారు. గుంటూరులో ఆర్‌పీఎఫ్‌ డివిజనల్‌ సెక్యూరిటీ కమిషనర్‌ జి. మధుసూదనరావు, రేణిగుంటలో ఆర్‌పీఎఫ్‌ అసిస్టెంట్‌ సెక్యూరిటీ కమిషనర్‌ కె. రాజగోపాలరెడ్డి ఈ అవార్డులు అందుకోనున్నారు. ఐఆర్‌పీఎ్‌ఫఎస్‌ అధికారి అయిన మధుసూదనరావు 1989లో ఆర్‌పీఎ్‌ఫలో సబ్‌-ఇన్‌స్పెక్టర్‌గా విధుల్లో చేరారు. 2016లో ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌, 2014లో డీజీ/ ఆర్‌పీఎఫ్‌ ఇన్సిగ్నియా, జీఎం మెడల్‌, పీసీఎ్‌ససీ అవార్డులు, 16 డీఆర్‌ఎం అవార్డులు అందుకున్నారు. ఇక రాజగోపాల్‌రెడ్డి 2012లో ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌తో పాటు తన పరిశోధనాత్మక నైపుణ్యాలకు గాను అనేక జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. కొసావో, దక్షిణ సూడాన్‌లో ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక మిషన్లలో పోలీసు సలహాదారుగా సేవలు అందించినందుకు నాలుగు పతకాలు అందుకున్నారు. కాగా, దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మనేజర్‌ సంజయ్‌ కుమార్‌ శ్రీవాస్తవ వీరిద్దరినీ అభినందించారు. రైల్వే ఆస్తులు, ప్రయాణికుల భద్రత విషయంలో వారు చూపించిన అంకితభావాన్ని ఆయన ప్రశంసించారు.

Updated Date - Aug 15 , 2025 | 04:36 AM