AP Mineral Department: గనుల ఆదాయం పెంచాలి
ABN , Publish Date - Jul 28 , 2025 | 03:55 AM
నూతన ఖనిజ తవ్వకాల ప్రాజెక్టులు తీసుకొచ్చి ఆదాయం పెంచాలనుకున్న సర్కారుకు కొత్త సమస్య వచ్చిపడింది. రాష్ట్రంలోని ఖనిజ నిక్షేపాలు, లీజులను ఆదాయ వనరుగా చూపించి 9 వేల కోట్ల బాండ్లు సేకరించిన ప్రభుత్వం..
రెండేళ్లలో రెండింతలు కావాలి
ఎండీసీపై 9 వేల కోట్ల బాండ్ల భారం.. తట్టుకోవాలంటే ఏటా 2 వేలకోట్లు కావాలి
ప్రస్తుత ఆదాయం 923 కోట్లే.. వృద్ధి మార్గాలపై సర్కారు దృష్టి
గనుల శాఖ నుంచి ప్రతిపాదనలు.. ఎండీసీకి ప్రభుత్వ బకాయిలే 1444 కోట్లు
జేపీ వెంచర్స్ నుంచి 167 కోట్లు.. మరో 6 ప్రైవేటు కంపెనీలు 242 కోట్లు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
నూతన ఖనిజ తవ్వకాల ప్రాజెక్టులు తీసుకొచ్చి ఆదాయం పెంచాలనుకున్న సర్కారుకు కొత్త సమస్య వచ్చిపడింది. రాష్ట్రంలోని ఖనిజ నిక్షేపాలు, లీజులను ఆదాయ వనరుగా చూపించి 9 వేల కోట్ల బాండ్లు సేకరించిన ప్రభుత్వం.. తిరిగి అసలు, వడ్డీ చెల్లింపుల విషయంలో చిక్కులను ఎదుర్కొనే ప్రమాదం కనిపిస్తోంది. 9 వేల కోట్ల బాండ్లతో కొత్త ఖనిజ ప్రాజెక్టులను చేపడతామని సర్కారు చెబుతున్నా.. అవి కార్యరూపంలోకి వచ్చి ఆదాయం తీసుకొచ్చేదెప్పుడు అన్నదానిపై స్పష్టత లేదు. కానీ 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి బాండ్లకు అసలు, వడ్డీ కలిపి ఏటా 1800 కోట్ల రూపాయల చొప్పున తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఇది సజావుగా సాగాలంటే ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ఆదాయం 2026-27 నాటికి రెండింతలు కావాల్సి ఉంది. ఇది ఎవరో చెబుతున్న మాటకాదు. స్వయంగా రాష్ట్ర గనుల శాఖే సర్కారు ముందు ఉంచిన ఓ నివేదిక సారాంశం. ప్రస్తుతం ఎండీసీకి వివిధ ప్రాజెక్టుల ద్వారా వస్తున్న ఆదాయం నగదు రూపంలో లెక్కిస్తే 923 కోట్లే ఉంది. మరో రెండేళ్లలో ఈ ఆదాయం ఎంతలేదన్నా కనీసం 2 వేల కోట్లకు చేరుకోవాల్సి ఉంటుందని, అప్పుడే బాండ్లకు చెల్లింపులు సజావుగా సాగుతాయని ఆ నివేదికలో ఉంది. ఆదాయం పెరిగే విషయంలో సాధ్యాసాధ్యాలపై గనుల శాఖ అధికారులు తర్జనభర్జనపడుతున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ముందు కొన్ని ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు ఉంచారు. అయితే అందులో కొన్ని వర్కవుట్ అయ్యే అవకాశాలే కనిపించడం లేదు.
ఎండీసీకి కోట్ల బకాయిలు
ఏపీఎండీసీకి ప్రభుత్వం నుంచి రూ.1,444 కోట్లు రావాల్సి ఉంది. అందులో ఇసుక బకాయిలు 55 కోట్లు. జగన్ ప్రభుత్వంలో సర్వే రాళ్ల కోసం నాటి గనుల శాఖ అధికారి వెంకటరెడ్డి అత్యుత్సాహంతో చెల్లించిన 525 కోట్లు రెవెన్యూ శాఖ నుంచి రాలేదు. ఈ బకాయిలు ఇప్పించాలని గనుల శాఖ సర్కారును కోరుతోంది. మరో 555 కోట్లు ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ వద్ద డిపాజిట్ రూపంలో ఉన్నాయి. వీటిని తిరిగి ఇప్పించాలని గనుల శాఖ ప్రభుత్వాన్ని కోరుతోంది. ప్రైవేటు బకాయిలు కూడా భారీగా ఉన్నాయి. జగన్ ప్రభుత్వం చివరి రోజుల్లో సర్కారుకు తెలియకుండా నాటి ఇసుక కాంట్రాక్ట్ సంస్థ జేపీ వెంచర్స్‌కు బ్యాంక్ గ్యారెంటీలు వెనక్కి ఇప్పించారు. కానీ ఆ సంస్థ ఎండీసీకి 167 కోట్లు చెల్లించాలి. ఆ సంస్థ బకాయిలున్నా వెంకటరెడ్డి ప్రభుత్వానికి, ఆర్థిక శాఖకు తెలియకుండా బ్యాంక్ గ్యారెంటీలు ఇప్పించారు. పైగా ఆ సంస్థ ఎండీసీకి ఎలాంటి బకాయిలు లేదంటూ సర్టిఫికెట్ ఇచ్చారు. ఇప్పుడు ఈ బకాయిల వసూలుకు ప్రభుత్వ స్థాయిలో చర్యలు తీసుకోవాలని గనుల శాఖ కోరుతోంది. బెరైటీ్‌సకు సంబంధించి ఆరు కంపెనీల నుంచి ఎండీసీకి నికరంగా 242 కోట్లు రావాల్సి ఉంది. ట్రైమెక్స్ కంపెనీ 37 కోట్లు, ఐబీసీ 29 కోట్లు, కిషన్ ఎంటర్‌ప్రైజెస్ 5.2 కోట్ల మేర బకాయిలు ఉన్నాయని గనుల శాఖ చెబుతోంది. ఇందులో ఓ వైసీపీ ప్రముఖుడి కంపెనీ కూడా ఉంది.
తెరపైకి బాక్సైట్
బాగా ఆదాయం తీసుకొచ్చే ఖనిజాల తవ్వకాల ప్రతిపాదనల్లో గనుల శాఖ బాక్సైట్ బ్లాక్‌లను చూపించింది. విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో ఉన్న బాక్సైట్‌ను ఏటా 5లక్షల టన్నుల మేర తవ్వి తీయడం ద్వారా 1,400 కోట్లు రావొచ్చని పేర్కొంది. అయితే ఇదంతా షెడ్యూల్డ్ ఏరియా, అటవీ ప్రాంతంలో ఉంది. గతంలోనే బాక్సైట్ తవ్వకాలపై గిరిజనులు, ప్రజాసంఘాల నుంచి ఆందోళన వ్యక్తమైంది. దీంతో మైనింగ్‌కు ఇచ్చిన అనుమతులు రద్దు చే శారు. దీని ఫలితంగా రస్‌ఆల్ ఖైమా నష్టపరిహారం కోరుతూ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కోర్టులో కేసు వేసింది. మరో ప్రత్యామ్నాయంగా అనంతపురం జిల్లా ఓబుళాపురంలోని ఐరన్‌ఓర్ మైనింగ్‌ను ప్రతిపాదించారు. ఇందులోనూ అనేక న్యాయ చిక్కులున్నాయి. అవి తేలేవరకు కొలిక్కి వచ్చే అవకాశమే లేదు. నిర్దేశిత విధానంలో ఏపీఎండీసీ 2026-27 నాటికి రెట్టింపు ఆదాయం పొందాలంటే కోట్ల వర్షం కురిపించే కొత్త ప్రాజెక్టులు రావాల్సిందే.
గనుల శాఖ ప్రత్యామ్నాయాలివీ..
మంగంపేటలోని సీ, డీ, బ్ల్యూ గ్రేడ్‌ల బెరైటీస్‌ను అమ్మేయడం వల్ల కనీసం 120 కోట్లు వస్తుందని అంచనా.
మధ్యప్రదేశ్‌లోని సులియారీ కోల్‌బ్లాక్‌లో బొగ్గు తవ్వకాలను మరింతగా పెంచాలనుకుంటోంది. దీనివల్ల అదనంగా మరో 150 కోట్లు వస్తుందని అంచనా వేసింది. ఇందులో బీచ్‌శాండ్ మినరల్స్‌ను కూడా కలిపింది. నిజానికి ఈ టెండర్ వ్యవహారాన్ని హైకోర్టు నిలిపివేసింది. అదానీ గ్రూప్ బీచ్‌శాండ్ టెండర్ కోసం అనేక ప్రయత్నాలు చేస్తోంది. కోర్టు కేసు వల్ల టెండర్ నిలిచిపోయింది.
ప్రకాశం జిల్లా కొణిజేడు-మర్లపాడు ఐరన్‌ఓర్ ప్రాజెక్టు టెండర్లు జగన్ ప్రభుత్వ హయాంలో జరిగాయి. కానీ టెండర్ దక్కించుకున్న జేఎ్‌సడబ్ల్యూ సంస్థ ఇప్పటి వరకు ఒప్పందం చేసుకోలేదు. ఇది ముందుకు సాగుతుందా? అన్న సందేహాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా 300 కోట్ల ఆదాయం వస్తుందన్న అంచనాలు ప్రశ్నార్థకమే.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏపీలో పెట్టుబడులకు సింగపూర్ గ్రీన్ సిగ్నల్.. ప్రధానంగా ఈ రంగాల్లో
బద్వేల్‌లో ఉప ఎన్నిక.. ఆదినారాయణరెడ్డి ఏమన్నారంటే..
Read latest AP News And Telugu News