Share News

Welfare Reforms: సంఘ విద్రోహులకు సంక్షేమం కట్‌

ABN , Publish Date - Jun 23 , 2025 | 06:18 AM

ఉత్తరప్రదేశ్‌లో ‘యోగి సర్కారు మోడల్‌’ అమలు చేయాలనే కోణంలోనూ ఆలోచిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో కేవలం రాజకీయ ఉద్దేశాలతో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే సంఘటనలు జరుగుతున్నాయి.

Welfare Reforms: సంఘ విద్రోహులకు సంక్షేమం కట్‌

నేరగాళ్లపై కఠిన చర్యల దిశగా యోచన

  • రౌడీలకు రాజకీయ అండపై సీరియస్‌

  • యూపీ తరహాలో నిర్ణయాలపై చర్చ

  • బుల్డోజర్‌, ఎన్‌కౌంటర్లు కాకుండా..

  • ఇతర చర్యలు తీసుకునే ఆలోచన సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వ పెద్దల దృష్టి

(అమరావతి-ఆంధ్రజ్యోతి): పేదలకు ప్రభుత్వం అండగా నిలవాల్సిందే. సామాన్యులకు సంక్షేమ పథకాలు ఇవ్వాల్సిందే! కానీ... అరాచక శక్తులనూ ప్రభుత్వ ఖర్చుతో ‘పోషించాలా?’ సంఘ విద్రోహ శక్తులకూ సంక్షేమ పథకాలు అందించాలా? పనిగట్టుకుని నేరాలకు పాల్పడే వారిని కట్టడి చేసేదెలా? దీనిపై ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఉత్తరప్రదేశ్‌లో ‘యోగి సర్కారు మోడల్‌’ అమలు చేయాలనే కోణంలోనూ ఆలోచిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో కేవలం రాజకీయ ఉద్దేశాలతో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే సంఘటనలు జరుగుతున్నాయి. రాజకీయ అండతో చెలరేగే నేరగాళ్లను కట్టడి చేయకపోతే... ఆంధ్రప్రదేశ్‌ ఒకప్పటి ఉత్తరప్రదేశ్‌, బిహార్‌లా మారే ప్రమాదముందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితి నివారించేమార్గాలపై ఇప్పుడు దృష్టి సారించారు. దీనిని సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు.


యూపీలో ఇలా...

గ్యాంగ్‌స్టర్లు, రౌడీలు, నేరగాళ్లపై ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. ఎన్‌కౌంటర్లు, బుల్డోజర్లతో నేరగాళ్ల గుండెళ్లో వణుకు పుట్టిస్తున్నారు. రౌడీషీట్లు నమోదైన వారి ఆస్తులు స్వాధీనం చేసుకోవడం, రాజకీయ మద్దతుతో రెచ్చిపోయే వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు కట్‌ చేయడం, తగ్గకపోతే నగర బహిష్కరణ చేయడం వంటి చర్యలు తీసుకుంటున్నారు. దీంతో అక్కడ నేరగాళ్లు గజగజా వణికిపోతున్నారు. అయితే... యూపీలో ‘బుల్డోజర్‌ న్యాయం’పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కోర్టులూ పలుమార్లు తప్పు పట్టాయి.

ఏపీలో ఏం చేయొచ్చు?

యూపీలోలాగా బుల్డోజర్లు పంపి ఇళ్లను కూల్చడం, ఎన్‌కౌంటర్ల వంటి తీవ్రమైన చర్యలు కాకుండా... నేరగాళ్లను దారికి తెచ్చే మార్గాలను గుర్తించడంపై రాష్ట్ర యంత్రాంగం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఉదాహరణకు... అలవాటుగా నేరాలకు పాల్పడే వాళ్లకు సంక్షేమ పథకాలు ఆపివేస్తే, కుటుంబ సభ్యుల నుంచే వారిపై ఒత్తిడి వస్తుంది. పద్ధతి మార్చుకుంటారు. నిజానికి... ప్రభుత్వం వైపు నుంచి ఇప్పటికే ఈ తరహా హెచ్చరికలు వెలువడ్డాయి. మహిళలపై నేరాలకు పాల్పడితే రౌడీషీట్‌ తెరుస్తామని హోంమంత్రి అనిత పలుమార్లు చెప్పారు. గంజాయి, డ్రగ్స్‌ విక్రయాల్లో పట్టుబడితే సంక్షేమ పథకాలు కట్‌ చేస్తామని మంత్రి లోకేశ్‌ ప్రకటించారు. సంఘ విద్రోహ శక్తులు ఈ హెచ్చరికలను పెద్దగా పట్టించుకుంటున్న దాఖలాలు కనిపించడంలేదు. అందుకే, ప్రభుత్వం దీనిని తీవ్రంగా పరిగణిస్తోంది.


ఇలాగే వదిలేస్తే

కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాజధాని అమరావతి నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. పోలవరం ప్రాజెక్టును పట్టాలెక్కించారు. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి. కేంద్రం తన వంతు సాయం చేస్తోంది. వైసీపీ ప్రభుత్వంలో మాదిరి ఏకపక్షంగా కాకుండా పోలీసులు చట్టప్రకారం పనిచేస్తున్నారు. అక్రమార్కులపై చర్యలు తీసుకుంటున్నారు. గంజాయి సాగు కట్టడికి ఈగల్‌, మహిళల భద్రత కోసం శక్తి విభాగాలు ఏర్పాటు చేసి మార్పు చూపిస్తున్నారు. అయితే చట్టప్రకారం వ్యవహరిస్తున్న పోలీసు అధికారులను బెదిరించే ధోరణిలో జగన్‌ మాట్లాడుతున్నారు. దీంతో అరాచక శక్తులు మళ్లీ రెచ్చిపోతున్నాయి. ఇలాంటి వారిపట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తే రాష్ట్ర భవిష్యత్తుకే ప్రమాదమని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే... ‘కఠిన చర్యల’ దిశగా ఆలోచిస్తోంది. ‘ఒకప్పుడు హైదరాబాద్‌లో మత కలహాలు జరిగేవి. రాయలసీమలో ఫ్యాక్షనిజం ఎక్కువగా ఉండేది. కొన్ని ప్రాంతాల్లో మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉండేది. శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చాక రాష్ట్రం అభివృద్ధి దిశగా దూసుకెళ్లింది. 2019 నాటికి ఆర్థికంగా పుంజుకుంటున్న విభజిత రాష్ట్రం ఆ తర్వాత తిరోగమనం బాట పట్టింది. రాష్ట్రాభివృద్ధికి శాంతి భద్రతలు చాలా ముఖ్యం. దీనికోసం కఠిన చర్యలు తీసుకోవాల్సిందే’ అని ఒక రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి పేర్కొన్నారు.


ఉత్తరప్రదేశ్‌లో ఉక్కుపాదం

ఒకప్పుడు ఉత్తరప్రదేశ్‌లో అరాచకం రాజ్యమేలేది. నేరగాళ్లు, మాఫియా ముఠాలు ప్రైవేటు సైన్యాలు ఏర్పాటు చేసుకుని సమాంతర ప్రభుత్వం నడిపేవారు. హత్యలు, కిడ్నా్‌పలు, సెటిల్మెంట్లు, బలవంతపు వసూళ్లు, మహిళలపై అఘాయిత్యాలు, ఆయుధాల విక్రయం.. ఇలా ఎన్నో దారుణాలు జరిగేవి. ఎనిమిదేళ్ల క్రితం యూపీ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్‌ ప్రమాణం చేశాక నేరగాళ్లపై ఉక్కుపాదం మోపారు. నేరస్తులను చూసి సామాన్య ప్రజలు భయపడే పరిస్థితి నుంచి ప్రాణభయంతో నేరగాళ్లే పోలీసులకు వద్దకు వచ్చి లొంగిపోయే పరిస్థితి తీసుకువచ్చారు. యోగి ఇటీవల వెల్లడించిన వివరాల ప్రకారం.. యూపీలో బీజేపీ ప్రభుత్వం ఎనిమిదేళ్ల పాలనలో 222 మంది మాఫియా డాన్లను హతమార్చారు. 8,118 మంది నేరస్తులు ఎన్‌కౌంటర్లలో గాయపడ్డారు. గ్యాంగ్‌స్టర్‌ చట్టం కింద ఏకంగా 79,984 మంది నేరగాళ్లపై ఉక్కుపాదం మోపారు. 930 మందిపై కఠిన చర్యలు తీసుకున్నారు. మాఫియా గ్యాంగ్‌ల నుంచి మొత్తం రూ.4,076 కోట్ల విలువైన ఆస్తిని స్వాధీనం చేసుకున్నారు. నేరాల కట్టడికి గత ఎనిమిదేళ్లలో 2,16,450 మంది పోలీసులను నియమించినట్లు యోగి తెలిపారు.

Updated Date - Jun 23 , 2025 | 07:23 AM