AP Liquor Scam: సిట్ కస్టడీకి లిక్కర్ స్కామ్ నిందితులు..
ABN , Publish Date - May 30 , 2025 | 09:26 AM
లిక్కర్ స్కామ్‌లో ప్రధాన సూత్రధారి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి విచారించారు. అతడు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డితోపాటు బాలాజీ గోవిందప్పను పోలీసులు అరెస్ట్ చేశారు.
విజయవాడ, మే 30: ఏసీబీ కోర్టు అనుమతితో లిక్కర్ కేసులో నలుగురు నిందితులను సిట్ అధికారులు శుక్రవారం తమ కస్టడీకి తీసుకున్నారు. ఈ కేసులో నిందితులు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి (ఏ1), ధనుంజయ రెడ్డి (ఏ31), కృష్ణమోహన్ రెడ్డి (ఏ32), గోవిందప్ప బాలాజీ (ఏ 33)లను విజయవాడలోని జిల్లా జైలు నుంచి సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. కోర్టు అనుమతితో వీరిని సిట్ కార్యాలయంలో శుక్రవారం, శనివారం రెండు రోజుల పాటు అధికారులు విచారించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వీరిని విచారించేందుకు కోర్టు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. తొలుత వీరికి ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం వారిని సిట్ కార్యాలయానికి తరలించనున్నారు.
లిక్కర్ స్కామ్‌లో ప్రధాన సూత్రధారి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి విచారించారు. అతడు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డితోపాటు బాలాజీ గోవిందప్పను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇప్పటికే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని సిట్ అధికారులు విచారించారు. మరోసారి అతడిని విచారించాలని సిట్ అధికారులు.. ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ క్రమంలో అతడిని మూడురోజుల పాటు విచారించేందుకు అనుమతి ఇవ్వాలని ఆ పిటిషన్‌లో కోర్టును కోరారు. అలాగే మిగిలిన ముగ్గురు నిందితులను సైతం తాము విచారించాలని.. అందుకు ఏడు రోజులు అనుమతి ఇవ్వాలంటూ సిట్ అధికారులు ఏసీబీ కోర్టును కోరారు. అందుకు సంబంధించి కోర్టులో వాదోపవాదాలు సోమవారమే పూర్తయ్యాయి. ఈ కేసులో తీర్పును గురువారానికి వాయిదా వేసింది. దీంతో వీరిని సిట్ అధికారు విచారణకు అనుమతి ఇస్తూ ఏసీబీ కోర్టు నిన్న ఆదేశాలు ఇచ్చింది.
జగన్ ప్రభుత్వ హయాంలో పాత బ్రాండ్లను పక్కన పెట్టి.. జే బ్రాండ్లను అందుబాటులోకి తీసుకు వచ్చింది. దీంతో ఈ మద్యం తాగి చాలా మంది అనారోగ్యం పాలైయ్యారు. అంతేకాదు..వందలాది మంది మరణించారు. అదీకాక ఈ మద్యం విక్రయాలన్నీ అన్‌లైన్ చెల్లింపుల్లో కాకుండా.. నగదు రూపంలో జరిగాయి. ఈ నేపథ్యంలో ఈ మద్యం తయారీ, విక్రయాలపై ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. ఈ మద్యం కుంభకోణంపై దర్యాప్తు చేయిస్తామని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. 2024లో జరిగిన ఎన్నికల్లో కూటమికి ఓటరు పట్టం కట్టాడు. దీంతో చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. అనంతరం ఈ మద్యం వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. అందులోభాగంగా దర్యాప్తు చేపట్టింది. ఇప్పటికే ఈ కుంభకోణంలో పలు కీలక విషయాలను సిట్ రాబట్టింది. మరిన్ని విషయాలును వీరి నుంచి రాబట్టేందుకు సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు.
For Andhrapradesh News And Telugu News