CM Highlights Welfare Successes: పెన్షన్లలో ఏపీ టాప్
ABN , Publish Date - Oct 02 , 2025 | 04:05 AM
సామాజిక పెన్షన్ల పంపిణీలో మన రాష్ట్రమే అగ్రస్థానంలో ఉందని సీఎం చంద్రబాబు చెప్పారు. దేశంలో మరే ప్రభుత్వమూ ఈ స్థాయిలో పింఛన్లు ఇవ్వడం లేదన్నారు. ప్రతి 100 మందిలో 13 మందికి పింఛన్లు.....
సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా చదువుకున్న పిల్లలకు ఇస్తున్న ‘తల్లికి వందనం’ పథకం కాదు. అది ప్రభుత్వం తరఫున పిల్లలపై పెట్టుబడి. రేపటి తరంపై పెట్టుబడి పెట్టి చదివిస్తున్నాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ ఇస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో 9 పర్యాయాలు విద్యుత్ చార్జీలు పెంచి రూ.32 వేల కోట్ల భారం మోపారు. మేం ట్రూడౌన్ పేరుతో చార్జీలు తగ్గిస్తున్నాం. నవంబరు నుంచి యూనిట్‌కు 13 పైసల చొప్పున తగ్గనుంది. రానున్న రోజుల్లో పొలాల్లో సోలార్ సిస్టమ్‌ను తీసుకొస్తాం.
- సీఎం చంద్రబాబు
ప్రతి వంద మందిలో 13 మందికి పింఛన్లు: ముఖ్యమంత్రి
లబ్ధిదారుల్లో 59% మంది మహిళలే
సూపర్ సిక్స్.. సూపర్ హిట్ చేశాం
ఆడబిడ్డలు కష్టపడకూడదనే దీపం 1, 2
45 రోజుల్లోనే బస్సుల్లో 10 కోట్ల మంది మహిళల ఉచిత ప్రయాణం
4న ‘ఆటో డ్రైవర్ల సేవలో’ నిధులు విడుదల
తల్లికి వందనం పథకం కాదు.. పిల్లలపై ప్రభుత్వం పెడుతున్న పెట్టుబడి
15 నెలల్లో 4.7 లక్షల మందికి ఉద్యోగాలు
10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయ్
వీటితో 9 లక్షల ఉద్యోగాలు వస్తాయ్
2 వేల కోట్లతో ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు పూర్తి
ఇకపై ఆకస్మిక తనిఖీలు చేస్తాం
దత్తి సభలో సీఎం చంద్రబాబు ప్రకటన
విజయనగరం, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): సామాజిక పెన్షన్ల పంపిణీలో మన రాష్ట్రమే అగ్రస్థానంలో ఉందని సీఎం చంద్రబాబు చెప్పారు. దేశంలో మరే ప్రభుత్వమూ ఈ స్థాయిలో పింఛన్లు ఇవ్వడం లేదన్నారు. ప్రతి 100 మందిలో 13 మందికి పింఛన్లు అందిస్తున్నట్లు తెలిపారు. లబ్ధిదారుల్లో 59 శాతం మంది మహిళలేనని చెప్పారు. సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేసిన ఘనత టీడీపీ కూటమి ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం దత్తి గ్రామంలో బుధవారం సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. లబ్ధిదారులకు పింఛన్లు అందించిన తర్వాత ప్రజావేదికలో మాట్లాడారు. అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో రూ.500 మాత్రమే అందిస్తున్నారన్నారు. మానవత్వంతో ఆలోచించి పింఛన్ మొత్తాన్ని రూ.4 వేలకు పెంచి అందిస్తున్నామని తెలిపారు. ప్రతినెలా ఒక గ్రామానికి వచ్చి నేరుగా పర్యవేక్షిస్తున్నానని, ఇందులో భాగంగా ఈ రోజు మీ గ్రామానికి వచ్చానని సీఎం చెప్పడంతో గ్రామస్థులు హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. ఒక్క పింఛన్ పెంపుతోనే సరిపెట్టలేదని.. సూపర్ సిక్స్ హామీలను అమలుచేసి సూపర్ హిట్ చేశామన్నారు. ‘ఆడబిడ్డలు కష్టపడకూడదన్న కోణంలో ఆలోచించి నాడు దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. ఇప్పుడు దీపం-2 కింద ఏటా మూడు సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నాం. స్త్రీశక్తి పథకం ద్వారా ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ పథకం కల్పిస్తున్నాం. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించేలా సాహసోపేత నిర్ణయం తీసుకున్నాం. పథకం ప్రారంభించిన 45 రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా 10 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు’ అని వివరించారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలని నాడు డ్వాక్రా సంఘాలను తీసుకొచ్చామని.. వాటికి మరింత చేయూతనందించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
ఈనెల 4న ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకం కింద ఒక్కొక్కరికి రూ.15 వేలు జమ చేస్తామన్నారు. విజయనగరం జిల్లా పేదరికంలో ఉందని.. దాన్ని మార్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. వ్యవసాయం ప్రధాన ఆధారం కావడంతో ఆ రంగంలో మౌలిక వసతుల కల్పన, సాగునీటిపై దృష్టిపెడతామన్నారు. అన్నదాత సుఖీభవ కింద రైతులకు రూ.20 వేలు అందిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. ఏడాదిలోనే మెగా డీఎస్సీని పూర్తిచేసి 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసిన విషయాన్ని కూడా గుర్తుచేశారు. యువతకు అండగా ఉండి ఉద్యోగాలు కల్పించే బాధ్యత తనదేనన్నారు. అధికారంలోకి వచ్చిన ఈ 15 నెలల కాలంలో 4,71,574 మందికి ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని.. 9 లక్షల ఉద్యోగాలు వస్తాయని ప్రకటించారు. సీఎం ఇంకా ఏం చెప్పారంటే..
ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా
ప్రజల అరోగ్య సంరక్షణ బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రస్తుతం 2.50 లక్షల ఆరోగ్య బీమా అందజేస్తున్నాం. రానున్న రోజుల్లో కుటుంబానికి రూ.25 లక్షల బీమా ఇస్తాం. 2029నాటికి అందరికీ ఇళ్లు కట్టించి అందజేస్తాం. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలిస్తాం. జీఎ్‌సటీ వల్ల రాష్ట్రానికి రూ.8 వేల కోట్ల ఆదాయం తగ్గింది. అయినా భయపడలేదు.
చివరి ఊపిరి ఉన్నంతవరకు పేదల కోసమే
నా చివరి ఊపిరి ఉన్నంత వరకు పేదల కోసమే పనిచేసి సంక్షేమ పధకాలు అమలు చేస్తా. కష్టంలేని సుపరి పాలన అందించడమే నా లక్ష్యం. మని, ఒక్క రూపాయి లంచం లేకుండా ప్రజలకు సుపరి పాలన అందించేందుకు బాధ్యత తీసుకున్నాం. వాట్సాప్ ద్వారా పౌర సేవలు అందిస్తున్నాం. ఎక్కడ ఏది జరిగినా ఫోన్‌లో సమాచారం తెలుసుకుంటున్నాం. ప్రతి ఇంటి నుంచీ ఒక పారిశ్రామికవేత్త తయారుకావాలి.
ప్రజలకు సేవలు ప్రభుత్వ ఉద్యోగుల బాధ్యత
ప్రభుత్వ యంత్రాంగం తప్పు చేస్తే ప్రజల ముందు నిలబెడతాం. యంత్రాంగం పనితీరుపై రానున్న రోజుల్లో ఆకస్మిక తనిఖీలు చేపడతాం. గతంలో అధికారులు తప్పుచేస్తే చర్యలు తీసుకునేవాళ్లం. ఇక నుంచి అలా ఉండదు. ప్రజలకు సేవలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులపై ఉంది. వారు బాగా పని చేయకపోతే గతంలో తిట్టేవాడినని, ఇప్పుడు ప్రజల ముందు నిలబెడతున్నాం. హార్డ్‌వర్క్ కాదు.. స్మార్ట్‌గా వర్క్ చేయాలి. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటలవరకు పనిచే స్తే ప్రజలకు చక్కటి సేవలు అందుతాయి.
భోగాపురం ఎప్పుడో పూర్తికావాలి..
వెనుక బడిన ఉత్తరాంధ్ర జిల్లాల్లో రానున్న రెండేళ్లలో రూ.2 వేల కోట్లతో ప్రాజెక్టులు పూర్తిచేస్తాం. విజయనగ రం జిల్లాలోని తోటపల్లి, తారక రామతీర్థసాగర్, గజపతినగరం బ్రాంచ్ కెనాల్ వంటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. నదులు అనుసంధాన ప్రక్రియ కూడా చేపడతాం. విశాఖకు టీసీఎస్, కాగ్నిజెంట్, గూగుల్, యాక్సెంచర్ వంటి కంపెనీలు వస్తున్నాయి. లక్షలాది మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తాయి. ఉత్తరాంధ్రకు న్యాయం జరగాలన్న ఉద్దేశంతో భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు చేపట్టాం. ఎప్పుడో పూర్తికావల్సిన ఈ ప్రాజెక్టును గత పాలకులు నిర్లక్ష్యం చేశారు. కూటమి అదికారం లోకి వచ్చిన తక్షణమే పనులు వేగవంతం చేశాం. వచ్చే ఏడాది ఆగస్టులో ఈ విమానాశ్రయాన్ని ప్రాంరభిస్తాం. దీనివల్ల ఈ ప్రాంతం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతుంది.
పీ-4 ద్వారా లక్ష మంది మార్గదర్శకులు
సమాజంలో అట్టడుగులో ఉన్నవారిని ఆదుకోవాలి. ఆర్థిక అసమానతలు తగ్గించి మెరుగైన జీవన ప్రమాణాలు అందించడానికి పీ-4 కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. రాష్ట్రంలో లక్ష మంది మార్గదర్శకులు పది లక్షల మంది బంగారు కుటుంబాలను వృద్ధిలోకి తీసుకురానున్నారు (దత్తి గ్రామంలోని రెండు బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్న వారిని ముఖ్యమంత్రి అభినందించారు). రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తే ఖబడ్దార్. ఆడబిడ్డలకు స్వేచ్ఛ, రక్షణ కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఇప్పుడు స్వాతంత్య్రం వచ్చింది
గత ప్రభుత్వంలో రహదారులకు ఇరువైపులా ఉన్న పచ్చనిచెట్లను నరికి పరదాలు కట్టుకుని పర్యటించేవారు. ఇప్పుడా విధానానికి స్వస్తి పలకడంతో ప్రజలకు స్వాతంత్య్రం వచ్చింది. నాకు కక్షగట్టడం తెలియదు.
కిడ్నీ రోగి ఇంటికి సీఎం
ముఖ్యమంత్రి చంద్రబాబు దత్తి గ్రామంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న పొట్నూరు అప్పలరాజు ఇంటికి వెళ్లి స్వయంగా పింఛన్ అందజేశారు. ఆయన తల్లికి వృద్ధాప్య పింఛను ఇచ్చారు. వారితో కాసేపు కూర్చుని ముచ్చటించారు. గతంలో అప్పలరాజుకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.1.65 లక్షలు వచ్చిందని, ఆయన తల్లి కిడ్నీ దానం చేసిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం ప్రతి నెలా ఆయనకు రూ.10 వేలు, ఆయన తల్లికి రూ.6 వేల పింఛన్ అందుతోంది. కార్యక్రమంలో మంత్రులు వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, సెర్ప్ సీఈవో కరుణ్, జిల్లా కలెక్టర్ రాంసుందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


