AP Govt Support: తోతాపురికి తోడ్పాటు
ABN , Publish Date - Jul 07 , 2025 | 02:08 AM
ఈ ఏడాది తోతాపురి దిగుబడి పెద్దఎత్తున రావడం, ఉత్పత్తులకు డిమాండ్ తగ్గిపోవడంతో రైతులు ధరలు లేక ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. మద్దతు ధరగా కిలో రూ.8 ప్రకటించినా ఆ మేరకు రైతుకు దక్కడం లేదు.
ఇతర రాష్ట్రాల కంటే ఏపీలోనే ఎక్కువ మద్దతు
రైతులు అడక్కముందే కిలోకు 4 సబ్సిడీ
ఎన్ని టన్నులకైనా రాష్ట్ర ప్రభుత్వమే సాయం
తోతాపురి సేకరణకు 130 కోట్లు ఇవ్వండి
కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ
(చిత్తూరు-ఆంధ్రజ్యోతి)
ఈ ఏడాది తోతాపురి దిగుబడి పెద్దఎత్తున రావడం, ఉత్పత్తులకు డిమాండ్ తగ్గిపోవడంతో రైతులు ధరలు లేక ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. మద్దతు ధరగా కిలో రూ.8 ప్రకటించినా ఆ మేరకు రైతుకు దక్కడం లేదు. మార్కెట్లో గరిష్ఠంగా రూ.6 వరకే దక్కుతోంది. ఈ పరిస్థితిని ముందే గ్రహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు తోతాపురి మామిడికి కిలోకు రూ.4 సబ్సిడీ ప్రకటించారు. ఇలా ఉమ్మడి చిత్తూరు జిల్లా రైతులకే రూ.200 కోట్ల వరకు సబ్సిడీగా అందించనున్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలోనే రైతులకు అధిక మద్దతు ధర లభిస్తోంది. మన రాష్ట్రంలో తోతాపురి రకం మామిడిని ఎక్కువగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సాగు చేస్తున్నారు. మార్కెట్లో ఇతర రకాలతో పోలిస్తే తోతాపురి ధరలు తక్కువగా ఉంటాయి. ఎక్కువగా వీటిని జ్యూస్ ఫ్యాక్టరీలు కొనుగోలు చేస్తుంటాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈసారి తోతాపురి బంపర్ క్రాప్ (దాదాపు 5.05 లక్షల టన్నులు) వచ్చింది. ఆశించిన ధరలు లేకపోవడంతో ప్రభుత్వం ఆదుకుంటోంది. కొనుగోళ్ల పరిమితిపై ఆంక్షలు పెట్టకుండా కిలోకు రూ.4 చొప్పున సబ్సిడీ అందిస్తోంది. ఫ్యాక్టరీలు రూ.5-6 చొప్పున ఇస్తున్నాయి. రైతులు 50, 100, 200 టన్నుల కాయలు తెచ్చినా, ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోంది. ఇలా టన్నుకు రూ.4 వేల చొప్పున వంద టన్నులు తెచ్చినా రూ.4 లక్షల సబ్సిడీ రైతుకు ఇస్తోంది.
తమిళనాడులో సాయమేదీ?
పొరుగునే ఉన్న తమిళనాడు ప్రభుత్వం మామిడి రైతుల్ని పట్టించుకోవడం లేదు. అక్కడా ఈసారి బంపర్ క్రాప్ వచ్చింది. అక్కడ ఫ్యాక్టరీలు ప్రస్తుతం కిలోకు ధర రూ.4-4.5 మధ్యలో అందిస్తున్నాయి. దీనికి అదనంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి సాయం లేదు. దీంతో రైతులు కూడా చేసేదేమీలేక ఆ ధరకే అమ్ముకుంటున్నారు.
కర్ణాటకలో ఆంక్షలు
కర్ణాటకలోనూ తోతాపురి రకాన్ని ఎక్కువగా సాగు చేస్తారు. పల్ప్ ఫ్యాక్టరీలు కిలోను రూ.4-4.5 మధ్య కొనుగోలు చేస్తున్నాయి. ఆ రాష్ట్ర ప్రభుత్వం రైతుల్ని ఆదుకోవడానికి మొదట ముందుకు రాలేదు. ఆ రాష్ర్టానికి చెందిన కేంద్ర మంత్రి కుమారస్వామి జూన్ చివర్లో మామిడి రైతుల్ని ఆదుకోవాలని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు లేఖ రాశారు. దీంతో కర్ణాటక రైతుల్ని ఎంఐఎస్ (మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్) ద్వారా ఆదుకుంటామని చౌహాన్ ప్రత్యుత్తరం పంపించారు. ఎంఐఎస్ స్కీమ్ ద్వారా కర్ణాటకలో కిలో తోతాపురి మామిడికి మద్దతు ధరను రూ.16.16గా కేంద్రం నిర్ణయించింది. కానీ ఎవరూ ఆ ధరకు కొనడం లేదు. ప్రభుత్వం కిలోకు రూ.4 సబ్సిడీ ఇస్తుంది. రూ.2 కేంద్రం ఇస్తే, రూ.2 కర్ణాటక ప్రభుత్వం రైతులకు అందించాలి. మొత్తంగా రైతులకు కిలోకు రూ.8-8.5 మాత్రమే లభిస్తోంది. ఇక కొనుగోలులో అనేక ఆంక్షలు పెట్టడంతో రైతులకు పూర్తిస్థాయిలో లబ్ధి కలగడం లేదు. సాధారణంగా ఓ హెక్టారుకు 12.5 నుంచి 13 టన్నుల తోతాపురి కాయల దిగుబడి వస్తాయి. కానీ కేంద్రం జీవోలో ఓ హెక్టారుకు 5 టన్నులనే ఎంఐఎస్ స్కీమ్ ద్వారా కొంటామని పేర్కొంది. అంతేగాక ఒక్కో రైతు నుంచి 2 హెక్టార్ల వరకే కొనుగోలు చేస్తారు. మొత్తమ్మీద ఆ రాష్ట్రంలో 25 లక్షల టన్నులే ప్రభుత్వం కొంటుంది.
జగన్ చేసిందేమిటి?
మామిడి రైతులకు మద్దతుగా ఈ నెల 9వ తేదీన వైసీపీ అధ్యక్షుడు జగన్ ఉమ్మడి చిత్తూరు జిల్లా బంగారుపాలెం పర్యటనకు వెళ్తున్నారు. ఐదేళ్ల జగన్ పాలనలో రెండేళ్లు తోతాపురి ధరలు పడిపోయాయి. కానీ ఆయన పట్టించుకోలేదు. మద్దతు ధర ప్రకటించి రైతులను ఆదుకోలేదు. నాడు కలెక్టర్ మద్దతు ధర ప్రకటించినా అమలు కాలేదు. తన హయాంలో మామిడి రైతుల గురించి ఏమాత్రం ఆలోచించని జగన్ ఇప్పుడు మద్దతు ధర పేరిట రాజకీయం చేసేందుకు వస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
ఎందుకీ పరిస్థితి
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సాధారణ పరిస్థితుల్లో దాదాపు 4 లక్షల టన్నుల వరకు తోతాపురి రకం మామిడి దిగుబడి వస్తుంది. ఈ సారి బంపర్ క్రాప్(అధిక దిగుబడి) అంటే.. 5.5 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. డిమాండ్‌కు మించి దిగుబడి రావడం ధరలు తగ్గడానికి ఓ కారణం.
ఇంతకుముందు మాదిరి పల్ప్‌కు అంత డిమాండ్ లేదు. దీంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జ్యూస్ ఫ్యాక్టరీల్లో 2023, 2024 సంవత్సరాల నాటి 40 వేల టన్నుల పల్ప్ డిమాండ్ లేక ఉండిపోయింది. దీంతో ఈసారి తోతాపురి కొనుగోళ్లకు ఇష్టపడటం లేదు. ధరలు పతనం కావడానికి ఇది కూడా ఓ కారణం.
ఏపీలో ఆంక్షలు లేకుండా..
ఏపీలో రైతులు ఎన్ని టన్నులు తోతాపురి తెచ్చినా సబ్సిడీ వర్తిస్తుంది. ఉదాహరణకు ఓ రైతు వంద టన్నులు తెస్తే రూ.4 లక్షలు సబ్సిడీ వస్తుంది. అదే కర్ణాటకలో ఓ రైతు వంద టన్నులు పండించినా గరిష్ఠంగా 10 టన్నులకే (రెండు హెక్టార్లకు మాత్రమే) సబ్సిడీ అందుతుంది. అంటే.. గరిష్ఠంగా రూ.40 వేలు అన్నమాట. తమిళనాడులో అయితే ప్రభుత్వ సాయమే లేదు.