Share News

PRC Commission: పీఆర్‌సీ కమిషన్‌ చైర్మన్‌ను నియమించాలి

ABN , Publish Date - Aug 21 , 2025 | 04:51 AM

2వ వేతన సంఘం పీఆర్‌సీ కమిషన్‌ చైర్మన్‌ను వెంటనే నియమించాలి, మధ్యంతర భృతి ఐఆర్‌ తక్షణమే ప్రకటించాలి. పెండింగ్‌లో ఉన్న 3..

PRC Commission: పీఆర్‌సీ కమిషన్‌ చైర్మన్‌ను నియమించాలి

  • వెంటనే మధ్యంతర భృతి ప్రకటించాలి

  • గత డీఏ, పీఆర్‌సీ బకాయిలు చెల్లించాలి

  • ఏ ఉద్యోగికి ఎంత బాకీ పడ్డారో చెప్పాలి

  • అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు పథకాలివ్వాలి

  • జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతల వినతులు

  • ఆర్థిక అంశాలన్నీ సీఎం దృష్టికి తీసుకెళ్తాం

  • సమస్యల పరిష్కారానికి కృషి: సీఎస్‌ హామీ

అమరావతి, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): ‘‘12వ వేతన సంఘం(పీఆర్‌సీ) కమిషన్‌ చైర్మన్‌ను వెంటనే నియమించాలి, మధ్యంతర భృతి(ఐఆర్‌) తక్షణమే ప్రకటించాలి. పెండింగ్‌లో ఉన్న 3 డీఏల్లో 2 వెంటనే ఇవ్వాలి.’’ అని పలు ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వానికి విన్నవించారు. అదేవిధంగా 11వ పీఆర్సీ, డీఏ బకాయిలను కూడా చెల్లించాలని కోరారు. ఏ ఉద్యోగికి ఎంత బకాయి ఉందో పే-స్లిప్లుల్లో పేర్కొనాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఆర్థికేతర, ఆర్థిక సమస్యలన్నీ పరిష్కరించాలని కోరారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు బుధవారం అమరావతి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ అధ్యక్షతన జరిగిన జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలు పలు అంశాలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా విజయానంద్‌ స్పందిస్తూ.. ఉద్యోగుల ఆర్థికపరమైన అంశాలను గురువారం(ఈరోజు) జరిగే మంత్రివర్గ సమావేశానికి ముందే సీఎం దృష్టికి తీసుకెళ్తానని, ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది తొలి జాయింట్‌ స్టాఫ్‌ కౌనిల్‌ సమావేశమని, ఉద్యోగ సంఘాల నేతలు ప్రస్తావించిన అన్ని అంశాలను నమోదు చేసుకున్నామని తెలిపారు. బుధవారం మధ్నాహ్నం 3 గంటలకు ప్రారంభమైన సమావేశం రాత్రి 8 గంటల వరకు జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న 14 సంఘాల నాయకులకు మాట్లాడే అవకాశం కల్పించారు. ఆర్థికేతర సమస్యలపై 4 నుంచి 5 గంటలపాటు సుదీర్ఘ చర్చ జరిగింది. ఏపీఎన్జీజీవో సంఘం అధ్యక్షుడు విద్యాసాగర్‌, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం కార్యదర్శి మనోహర్‌, ఏపీ రెవెన్యూసర్వీసెస్‌ అసోసియేషన్‌, ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు, యూటీఎఫ్‌ అధ్యక్షులు ప్రసాద్‌, ఏపీటీఎఫ్‌ అధ్యక్షుడు హృదయరాజు, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కాగా, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి సస్పెన్షన్‌లో ఉండడంతో సమావేశానికి ఆయనను అనుమతించలేదు. అయితే, ఉద్యోగిగా మాత్రమే తాను సస్పెన్షన్‌లో ఉన్నానని, సంఘం నేతగా కాదని వ్యాఖ్యానించారు. ఇక, ఈ సమావేశం అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు.

VFXB.jpg


నగదు రహిత వైద్యం: ఎన్జీజీవో

12వ పీఆర్‌సీ కమిషన్‌ చైర్మన్‌ను వెంటనే నియమించాలని కోరినట్టు ఏపీ ఎన్జీజీవో సంఘం అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్‌ తెలిపారు. ఉద్యోగులకు ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్యానికి సంబంధించి చర్చించామన్నారు. 7 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులకు ఇచ్చిన పర్మినెంట్‌ హామీని అమలు చేయాలని, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని కోరామన్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు నోషనల్‌ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, 4, 5 నెలలకు ఒకసారైనా జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించాలని విజ్ఞప్తి చేశామన్నారు. 24 ప్రధాన డిమాండ్లు, 68 డిపార్ట్‌మెంట్‌ అంశాలను ప్రస్తావించామన్నారు. గురుకుల సొసైటీల్లో ఉద్యోగులకు పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచాలని, సీపీఎస్‌ ఉద్యోగుల డీఏ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరామన్నారు. హెడ్‌ ఆఫ్‌ ది డిపార్ట్‌మెంట్స్‌ ఉద్యోగులకు అమరావతి రాజధాని ప్రాంతంలోనే ఇంటి స్థలాలను కేటాయించేలా ఇచ్చిన జీవోను తక్షణమే అమలు చేయాలని కోరినట్టు తెలిపారు.

క్యాబినెట్‌లో చర్చించమన్నాం: ఏపీటీఎఫ్‌

ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యలపై గురువారం జరిగే క్యాబినెట్‌ సమావేశంలో చర్చించి కొన్ని నిర్ణయాలైనా తీసుకోవాలని సీఎ్‌సకు విన్నవించినట్టు ఏపీటీఎఫ్‌ అధ్యక్షుడు హృదయరాజు చెప్పారు. సీపీఎస్‌ స్థానంలో ఓపీఎస్‌ అమలు చేయాలని కోరినట్టు తెలిపారు.

పే స్లిప్పుల్లో బకాయిలు: ఏపీ జేఏసీ

ఉద్యోగులకు, పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిలను పే-స్లిప్పుల్లో పేర్కొనేలా చర్యలు తీసుకోవాలని కోరినట్టు ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రజలకు పథకాలను చేరవేసే ఉద్యోగుల గురించి ప్రభుత్వం ఆలోచించకపోవడం బాధాకరమన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు వెంటనే ఐఆర్‌ ప్రటించాలన్నారు.

ప్రణాళికతో చేయాలి: సూర్యనారాయణ

ఉద్యోగుల బకాయిల చెల్లింపులకు సంబంధించి ఒక ప్రణాళిక ఇవ్వాలని కోరినట్టు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అఽధ్యక్షుడు సూర్యనారాయణ తెలిపారు. గత జూన్‌ వరకు రూ.22 వేల కోట్ల వరకు బకాయిలు ఉన్నాయని, ప్రస్తుతం అవి రూ.33 వేల కోట్లకు చేరాయని చెప్పారు. ప్రతి ఉద్యోగికీ ఎంత బాకీ ఉన్నారన్న విషయాన్ని తేల్చాలని కోరినట్టు తెలిపారు.

Updated Date - Aug 21 , 2025 | 04:51 AM