High Court Suggests Supreme Court Hearing: రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగానే స్థానికత నిర్ణయం
ABN , Publish Date - Aug 14 , 2025 | 04:55 AM
రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకే స్థానికత నిర్ణయిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి..
హైకోర్టుకు నివేదించిన ఏజీ, ఏకీభవించిన ధర్మాసనం
సుప్రీంకోర్టులోనే తేల్చుకోవాలని పిటిషనర్లకు సూచన
అమరావతి, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకే స్థానికత నిర్ణయిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ బుధవారం హైకోర్టుకు నివేదించారు. ఆ ఉత్తర్వుల ప్రకారం అర్హత పరీక్షకు హాజరయ్యేనాటికి వరుసగా నాలుగేళ్లు రాష్ట్రంలో చదివిన విద్యార్ధులనే స్థానిక అభ్యర్ధులుగా పరిగణిస్తారని తెలిపారు. స్థానికత విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆ ఉత్తర్వులకు అనుగుణంగా నడుచుకోవడం తప్ప మరో మార్గం లేదని స్పష్టంచేశారు. ఈ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ ఆర్.రఘునందనరావుతో కూడిన ధర్మాసనం స్థానికత అంశాన్ని సుప్రీంకోర్టులోనే తేల్చుకోవాలని పిటిషనర్లకు సూచించింది. ఈ వ్యవహారం పై సవివరంగా గురువారం ఉత్తర్వులు జారీ చేస్తామని పేర్కొంది. కాగా.. నీట్ పరీక్షలో అర్హత సాధించినప్పటికీ, ఇంటర్మీడియట్ తెలంగాణలో చదివామనే కారణంతో వైద్య విద్య ప్రవేశాలకు నిర్వహించే కౌన్సెలింగ్‌లో తమను లోకల్ అభ్యర్ధులుగా పరిగణించకపోవడాన్ని సవాల్ చేస్తూ గుంటూరు జిల్లా, ప్రత్తిపాడుకు చెందిన ఎస్‌కె ఖమరుద్ధీన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే శ్రీకాకుళం జిల్లా, కోటబొమ్మాళికి చెందిన సనపల వెంకటరమణ మరో 51మంది మరో పిటిషన్ వేశారు. వీటితో పాటు మరో 20 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది.