Minister Atchannanidu: ప్రతి రైతుకూ ఎరువులిస్తాం
ABN , Publish Date - Aug 26 , 2025 | 04:43 AM
రాష్ట్రంలో రైతులకు అవసరమైన ఎరువులు సకాలంలో అందేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
రాష్ట్రంలో ప్రస్తుతం అందుబాటులో 6.48 లక్షల టన్నులు
6న గంగవరం పోర్టుకు 15 వేల టన్నుల యూరియా
2వ వారంలో కాకినాడ పోర్టుకు 30 వేల టన్నులు: అచ్చెన్న
అమరావతి, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రైతులకు అవసరమైన ఎరువులు సకాలంలో అందేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కేంద్రం సహకారంతో రాష్ట్రంలో ప్రతి రైతుకూ ఎరువులు అందేలా కృషి చేస్తున్నామని, రైతులు ఆందోళన చెందనవసరం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుత సీజన్‌లో ఎరువుల అవసరం, సరఫరా, నిల్వలు, కేంద్ర-రాష్ట్ర సమన్వయంపై సోమవారం ఈ మేరకు ఓ ప్రకటన జారీ చేశారు. ‘ఖరీఫ్ సీజన్‌కు 31.15 లక్షల టన్నుల ఎరువులు అవసరమని అంచనా వేయగా, ఇప్పటికి 21.34 లక్షల టన్నులు రాష్ట్రానికి చేరాయి. యూరియా, డీఏపీ, కాంప్లెక్స్, ఎంవోపీ, ఎస్‌ఎ్‌సపీ కలిపి 6.22 లక్షల టన్నులు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రం మొత్తం రైతుల అవసరాలను బట్టి జిల్లాల వారీగా సరఫరాలను పర్యవేక్షిస్తూ ఎక్కడా కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకుని, 1.10 లక్షల టన్నుల బఫర్ స్టాక్ ఉంచాం’ అని మంత్రి వివరించారు. డిపోల్లో 79,633 టన్నుల నిల్వలు ఉండగా, అవసరమైన ప్రాంతాలకు తరలింపు జరుగుతోందని తెలిపారు. కేంద్రం నుంచి 1.30 లక్షల టన్నులు వచ్చాయని, 0.47 లక్షల టన్నులు రాబోతున్నాయని తెలిపారు. ఆగస్టులో 1.65 లక్షల టన్నులు కేటాయించగా, 0.75 లక్షల టన్నులు ఇప్పటికే రాష్ట్రానికి చేరాయని, మిగిలిన 0.90 లక్షల టన్నులు గంగవరం, కాకినాడ, విశాఖపట్నం, ఒడిశా పోర్టుల ద్వారా త్వరలో చేరనున్నాయని వివరించారు. ఒడిశాలోని ధమ్రా పోర్టు నుంచి 10,800 టన్నుల యూరియా దిగుమతికి కేంద్రం ఉత్తర్వులిచ్చిందని, వచ్చే నెల 6న గంగవరం పోర్టుకు 15వేల టన్నులు, రెండో వారంలో కాకినాడ పోర్టుకు 30వేల టన్నుల యూరియా రానుందని తెలిపారు. రైతులకు ఎరువులు పారదర్శకంగా అందించేందుకు ఇంటిగ్రేటెడ్ ఫర్టిలైజర్ మేనేజ్‌మెంట్ సిస్టం(ఐఎఫ్ఎంఎస్) ద్వారా పర్యవేక్షిస్తున్నామని, తద్వారా రియల్ టైమ్ సమాచారం అందుతోందని తెలిపారు.
జిల్లా అధికారులు, సహకార సంఘాలు, వ్యవసాయశాఖ సంయుక్తంగా సమన్వయం చేసుకుంటూ ఎరువుల కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. మార్కెట్‌లో ఎవరైనా అధిక ధరలకు అమ్మే ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 6.48లక్షల టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. ‘వర్షాల వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో పంటలకు ప్రత్యేక అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎరువులు అందిస్తున్నాం. నల్లబియ్యం, అరటి, చెరకు వంటి పంటలకు తగిన ఎరువులు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటాం’ అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.