AP Govt Approves to Curb Public Drinking: రోడ్లపై తాగుడుకు చెక్
ABN , Publish Date - Aug 13 , 2025 | 03:13 AM
రాష్ట్ర ప్రభు త్వం బహిరంగ మద్యపానానికి చెక్ పెట్టే చర్యలు ప్రారంభించింది. మద్యం షాపుల్లో పర్మిట్ రూమ్‌ల ఏర్పాటుకు అనుమతిస్తూ ఎక్సైజ్ శాఖ మంగళవారం....
షాపుల వద్ద పర్మిట్ రూమ్‌లకు అనుమతిస్తూ జీవో
అమరావతి, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభు త్వం బహిరంగ మద్యపానానికి చెక్ పెట్టే చర్యలు ప్రారంభించింది. మద్యం షాపుల్లో పర్మిట్ రూమ్‌ల ఏర్పాటుకు అనుమతిస్తూ ఎక్సైజ్ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. పర్మిట్ రూమ్ అంటే మద్యం షాపు పక్కనే మందు తాగేందుకు అవకాశం కల్పిస్తూ ఒక గది ఏర్పాటు చేస్తారు. అయితే బార్ తరహాలో కుర్చీలు, బల్లలు అందులో ఉండవు. గతేడాది అక్టోబరు లో ప్రైవేటు మద్యం షాపుల పాలసీ అమల్లోకి వచ్చి నప్పుడు పర్మిట్ రూమ్‌లకు అనుమతి ఇవ్వలేదు. దీంతో బహిరంగ మద్యపానం పెరిగింది. రోడ్లపై, ఫుట్‌పా త్‌లపై, ఇతర బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం అలవాటుగా మారింది. గతేడాది జూన్ నుంచి ఈ ఏడా ది జూన్ వరకు బహిరంగ మద్యపానంపై 2,77,549 కేసులు నమోదయ్యాయి. ఇది తాగేవారితో పాటు సామాన్య ప్రజలకూ ఇబ్బందిగా మారింది. దీంతో ఈ అంశంపై పునఃసమీక్షించిన క్యాబినెట్ సబ్ కమిటీ పర్మిట్ రూమ్‌ల ఏర్పాటుకు అనుమతిచ్చింది. తాజా ఉత్తర్వుల ప్రకారం రెండు విభాగాల్లో పర్మిట్ రూమ్ లకు లైసెన్స్ ఫీజు నిర్ణయించారు. రూ.55లక్షల వరకు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ (వార్షిక లైసెన్స్ ఫీజు) ఉన్న షాపు లు రూ.5లక్షలు, రూ.65 లక్షల నుంచి రూ.85లక్షల వరకు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ఉన్న షాపులు రూ.7.5 లక్షలు పర్మిట్ రూమ్‌కు విడిగా లైసెన్స్ ఫీజు చెల్లించాలి. ఇందుకోసం లైసెన్సీలు ఎక్సైజ్ శాఖకు దరఖాస్తు చేసుకోవాలి. వెయ్యి చదరపు అడుగులు దాటకుండా పర్మిట్ రూమ్ ఏర్పాటు చేసుకోవచ్చు. అందులో కిచెన్ ఉండకూడదు. కానీ.. సిద్ధంగా ఉంచిన స్నాక్స్ అమ్మవచ్చు. పర్మిట్ రూమ్‌లలో తాగేవారికి విడిగా మద్యం సర్వ్ చేయకూడదు. సీసాలు కొనుక్కుని వచ్చి మాత్రమే అక్కడ తాగాలి. మద్యం షాపుల పనివేళల్లో మాత్రమే పర్మిట్ రూమ్‌లు తెరిచి ఉంచాలి.