Handloom Sector: పొరుగు వస్త్రం కొనుగోళ్లపై ప్రభుత్వం సీరియస్
ABN , Publish Date - Jan 30 , 2025 | 04:47 AM
ఏపీలో లక్షన్నరకు పైగా చేనేత మగ్గాల్లో లేని వస్త్రం తెలంగాణలోని 17 వేల మగ్గాల్లో ఎలా ఉత్పత్తి అయ్యిందని సీఎంవో ఆరా తీసింది. సొంత రాష్ట్రంలోని చేనేత సొసైటీల వద్ద ఉన్న వస్త్ర నిల్వలను పరిగణనలోకి తీసుకోకుండా తెలంగాణలోని మ్యాక్ సొసైటీల్లో కొనుగోలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

చేనేత జౌళి శాఖ అధికారులతో సీఎంవో సమీక్ష
అక్రమాలు జరిగినట్లు చెప్పిన సీనియర్ ఐఏఎస్
తెలంగాణ సొసైటీల్లో కనీస వస్త్రం ఉత్పత్తి కాలేదు
మహారాష్ట్ర వ్యాపారి తమిళనాడులో కొన్న గుట్టు రట్టు
అమరావతి, జనవరి 29(ఆంధ్రజ్యోతి): మన రాష్ట్రంలోని చేనేత కార్మికుల పొట్టకొట్టి కమీషన్ల కోసం పొరుగు రాష్ట్రం నుంచి లివరీ వస్త్రాన్ని కొనుగోలు చేసిన చేనేత జౌళి శాఖ అధికారులపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఏపీలో లక్షన్నరకు పైగా చేనేత మగ్గాల్లో లేని వస్త్రం తెలంగాణలోని 17 వేల మగ్గాల్లో ఎలా ఉత్పత్తి అయ్యిందని సీఎంవో ఆరా తీసింది. సొంత రాష్ట్రంలోని చేనేత సొసైటీల వద్ద ఉన్న వస్త్ర నిల్వలను పరిగణనలోకి తీసుకోకుండా తెలంగాణలోని మ్యాక్ సొసైటీల్లో కొనుగోలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ముందస్తు అడ్వాన్సు చెల్లించి, సేకరణ ధర పెంచి మహారాష్ట్ర వ్యాపారి ద్వారా తమిళనాడులో సేకరించడం వెనకున్న వైనాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు సిద్ధమయ్యారు. పొరుగు రాష్ట్రంలో లివరీ వస్త్రం కొనుగోలు వ్యవహారంలో మన చేనేత సంఘాలు చేసిన ఫిర్యాదు, అందించిన ఆధారాలతో ఏపీ చేనేత జౌళి శాఖ అధికారులను సీఎంవో అధికారి ప్రశ్నించగా అక్రమాలు జరిగినట్లు సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు వెల్లడించినట్లు తెలుస్తోంది. మొత్తం వ్యవహారంలో ఆప్కో అధికారితోపాటు ఒక టెక్నీషియన్ సూత్రధారిగా ఏపీ చేనేతలు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌కు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ బాగోతాన్ని వెలికితీసి బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రభుత్వ శాఖలు కొనుగోలు చేసే లివరీ వస్త్రాలను తప్పనిసరిగా మన చేనేతల నుంచే కొనుగోలు చేయాలి. ఈ మేరకు చంద్రబాబు ప్రభుత్వం స్పష్టమైన జీవో జారీ చేసింది. అయినా కమీషన్లకు అలవాటుపడ్డ చేనేత జౌళి శాఖ అధికారులు పొరుగు రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తున్నారు.
మన సొసైటీల్లో లివరీ వస్త్రం ఉన్నా..
తెలంగాణతో పోలిస్తే మన రాష్ట్రంలో పది రెట్లు ఎక్కువ చేనేత మగ్గాలున్నప్పటికీ ఇక్కడి ప్రభుత్వ సంక్షేమ శాఖలకు అవసరమైన దుప్పట్లు, తువ్వాళ్లు, బెడ్ షీట్లు పొరుగు రాష్ట్రం నుంచి కొనుగోలు చేయడంపై నేతన్నలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’లో ‘మన నేతన్నల పొట్టకొట్టి..’ శీర్షికన ప్రచురితమైన వార్తపై ఆప్కో ఎండీ వివరణ ఇచ్చారు. రాష్ట్ర సంక్షేమ శాఖల అవసరాలకు సరిపడా లివరీ బెడ్‌షీట్లు మన చేనేత సొసైటీల్లో ఉత్పత్తి లేదన్నారు. అందులో వాస్తవం లేదని, చేనేత సొసైటీల్లో లివరీ వస్త్రం నిల్వ ఉన్నా పొరుగు రాష్ట్రంలోని మ్యాక్ సొసైటీల నుంచి కొనుగోలు చేయడం వెనుక అవినీతి ఉందని ఏపీ చేనేత సహకార సంఘాలు ప్రభుత్వానికి లేఖ రాశాయి. పొరుగు రాష్ట్రంలోని మ్యాక్ సొసైటీల్లో కొనుగోలు చేయడం, వాటికి మహారాష్ట్ర వస్త్ర వ్యాపారి ద్వారా తెలంగాణ మ్యాక్ సొసైటీల బిల్లులు సృష్టించి తమిళనాడు నుంచి కొనుగోలు చేసి భారీ కమీషన్లు తీసుకున్న ఆప్కో అధికారులు ఇక్కడి షోరూమ్‌ల్లో విక్రయాల్లోనూ ప్రైవేటు వస్ర్తాలకు అనుమతి ఇచ్చినట్లు చెబుతున్నారు. రాష్ట్రంలోని ఆప్కో షోరూమ్‌లు, డిపోల్లోని వస్త్ర నిల్వలను విజిలెన్స్ అధికారులతో తనిఖీ చేయిస్తే రికార్డుల్లో చూపించే స్టాకు, అక్కడున్న దానికి ఏ మాత్రం పొంతన ఉండదని అంటున్నారు. ఈ వ్యవహారంలో ఒక టెక్నికల్ అసిస్టెంట్ సూత్రధారిగా ఉన్నారని, గుంటూరులో ఏకంగా నాలుగు ఇళ్లు కొనుగోలు చేసిన అతన్ని సీఐడీ అధికారులు విచారిస్తే మొత్తం గుట్టు బయట పడుతుందని చెబుతున్నారు.
మరిన్నీ తెలుగు వార్తల కోసం..
Also Read: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర మంత్రులు.. అసలు విషయం ఇదే
Also Read: పంచగ్రామాల ప్రజలకు గుడ్ న్యూస్
Also Read: ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతోన్న ముఠా గుట్టను రట్టు చేసిన పోలీసులు
Also Read: మీకు వాట్సాప్ ఉంటే చాలు.. మీ ఫోన్‌లోనే ప్రభుత్వం
Also Read: జాతీయ క్రీడల జరుగుతోన్న వేళ.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు
Also Read: హైకోర్టు తీర్పుపై స్పందించిన జ్యోతి సురేఖ
For AndhraPradesh News And Telugu News