Share News

CM Chandrababu Naidu: తీరు మారాలి!

ABN , Publish Date - Sep 15 , 2025 | 03:57 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వ పాలనాధిపతి అయితే... జిల్లాకు కలెక్టర్‌ సర్వోన్నతాధికారి. ముఖ్యమంత్రి రోజులో కనీసం నాలుగైదు సమావేశాల..

CM Chandrababu Naidu: తీరు మారాలి!

  • నివేదికలు, లెక్కలు, సమీక్షలతోనే కలెక్టర్లు కుస్తీ

  • ప్రభుత్వ ఆదేశాలతో వారంలో ఎక్కువ టైం వీటికే

  • ప్రజాక్షేత్రంలో కనిపించని అభివృద్ధి ముద్ర

  • ఇంకా మిథ్యగానే భూ సమస్యల పరిష్కారం

  • క్షేత్రస్థాయి సిబ్బందికి దశ, దిశ కరువు

  • పల్లె ముఖమే చూడని జిల్లా బాస్‌లు ఎందరో

  • ప్రభుత్వం తీరు మారాలంటున్న నిపుణులు

  • ప్రజాక్షేత్రంలో మమేకం కావడంతో పాటు పల్లెలు, పట్టణాల అభివృద్ధిపై దృష్టి అవసరం

  • నేడు, రేపు జిల్లా కలెక్టర్ల సమావేశం

నివేదికలు పంపాలని అమరావతి నుంచి కలెక్టర్లపై ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటోంది. నివేదికలు పంపించడంపైనే కలెక్టర్లు కష్టపడుతున్నారు. కొత్తగా, సొంతంగా పనిచేయడానికి వారికి సమయం దొరకడం లేదు. ఇక మండల, గ్రామస్థాయి సిబ్బందికి దశ, దిశ చూపడం.. వారి పనితీరును సమీక్షించే అవకాశం చాలా మందికి రావడం లేదు. ఈ పరిస్థితి ఇలా కొనసాగినంత కాలం.. అభివృద్ధి, అద్భుతాలు అన్నవి కేవలం కలెక్టర్లు పంపే నివేదికల్లోనే ఉంటాయి. ఈ పరిస్థితి మారాలంటే ఆచరణ సాధ్యంకాని నివేదికలు కోరడం ఆపేయాలి. పనికొచ్చే అంశాలపైనే నివేదికలు అడగాలి. అలాగే కలెక్టర్ల పనితీరును ప్రతి నాలుగు నెలలకోసారి సమీక్షిస్తుండాలి. గ్రామాలు, పట్టణాల సందర్శన, అభివృద్ధి కొలమానంగా వారి ప్రతిభను గుర్తించాలి. అప్పుడే పరిస్థితుల్లో మార్పు వస్తుంది.

- ఓ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి

(అమరావతి-ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వ పాలనాధిపతి అయితే... జిల్లాకు కలెక్టర్‌ సర్వోన్నతాధికారి. ముఖ్యమంత్రి రోజులో కనీసం నాలుగైదు సమావేశాలు-సమీక్షలు చేస్తున్నారు. వీలు చూసుకొని జిల్లాల పర్యటనలకు వెళ్లి నేరుగా ప్రజలను కలుస్తున్నారు. మరి 35-40 మండలాలుండే ఓ జిల్లా కలెక్టర్‌ పరిస్థితి ఎలా ఉందంటే.. ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్‌లపై రోజువారీగా రివ్యూ మీటింగ్‌లు.. శాఖల వారీగా ప్రభుత్వానికి కలర్‌ఫుల్‌ పీపీటీలు, అభివృద్ధి లెక్కలు పంపించడం.. ఇంకా జీవీఏ లెక్కలు తయారు చేసి నివేదించడం.. జిల్లాలకు వీఐపీలు, ప్రభుత్వ పెద్దలు వస్తే వారికి ప్రొటోకాల్‌ చూడటం! దాదాపు చాలా జిల్లాల కలెక్టర్ల పరిస్థితి ఇంతే. ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర శాఖల కార్యదర్శుల కార్యాలయాలకు నివేదికలు పంపించడమే వారికి ప్రధాన పనిగా ఉంటోంది. ప్రజాక్షేత్రంలోకి వెళ్లడం, సామాన్య, పేద ప్రజలతో మమేకం కావడం, పల్లెనిద్ర చేయడం, సంక్షేమ హాస్టళ్ల సందర్శన, గ్రామీణ ప్రగతిపై స్వీయపర్యవేక్షణ చేయడం అనేది చాలా మంది కలెక్టర్లకు సాధ్యపడటం లేదు. సమయం చాలడం లేదు. జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి నేటి వరకు కలెక్టరేట్‌ తప్ప పల్లెముఖం చూడని అధికారులు కూడా కొందరున్నారు. ఇలాగైతే ప్రజాజీవితంలో, గ్రామాలు, పట్టణాల అభివృద్ధిలో మార్పులు తీసుకొచ్చేదెలా? ప్రతిభావంతులైన కలెక్టర్ల పనితీరు ఎలా బయటకు వస్తుంది? ప్రజలతో మమేకం కాని కలెక్టర్లు, అధికారులతో అభివృద్ధి ఎలా పరుగులు తీస్తుంది? ఆశించిన ఫలితాలు ఎలా వస్తాయి? ఇన్ని ప్రశ్నల నేపఽథ్యంలో కూటమి సర్కారు నాలుగో విడత కలెక్టర్ల సమావేశాలను సోమవారం నుంచి రెండు రోజుల పాటు నిర్వహించేందుకు సన్నద్ధమైంది.


ముఖ్యమంత్రి ఆదేశించినా..

గత సమావేశంలో కలెక్టర్లకు ప్రభుత్వం ఇచ్చిన టాస్క్‌లు, వాటి ఫలితాలపై చర్చతో పాటు రానున్న రోజుల్లో చేపట్టే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై తాజా సమావేశంలో చర్చించనున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన మూడు కలెక్టర్ల సమావేశాల్లో ముఖ్యమంత్రిచంద్రబాబు అనేక ఆదేశాలు ఇచ్చారు. పలు కీలక నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయాలని ఆదేశించారు. అందులో అత్యంత కీలకమైనవే అమలు కాలేదు. జగన్‌ ప్రభుత్వాన్ని ప్రజలు ఇంటికి సాగనంపడానికి ప్రధాన కారణాల్లో భూ సమస్య ఒకటి. రీ సర్వే సంబంధిత సమస్యలు రావడం, పాస్‌పుస్తకాలపై జగన్‌ బొమ్మలేసి తప్పులతడక సమాచారం ఇవ్వడంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ప్రభుత్వం మారి 15 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు రాష్ట్రంలో భూ సమస్యలు పరిష్కారం కాలేదు. రైతులకు రాష్ట్ర అధికార చిహ్నంతో కూడిన పాస్‌పుస్తకాలు అందలేదు. భూమి కొలతల సమస్యలు తీరలేదు. సర్వే, సబ్‌డివిజన్‌ సమస్యలేవీ పరిష్కారం కాలేదు. ఈ విషయాలపై కలెక్టర్లు క్షేత్రస్థాయి పర్యటన చేసి, రైతులను కలిసి మాట్లాడిన సందర్భాలు మచ్చుకు ఒక్కటి కూడా లేవు. భూ అక్రమాలపై చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయాలని సీఎం తొలి సమావేశంలోనే ఆదేశించారు. రెండో సమావేశంలో మరోసారి గుర్తుచేశారు. ప్రస్తుతం నాలుగో సమావేశం జరగబోతోంది. అయినా ఈ విషయంలో ఇటు రెవెన్యూ, అటు ప్రభుత్వంలో ఇసుమంతైనా కదలిక లేదు.

నివేదికలు, గణాంకాలతో కుస్తీలు

ముఖ్యమంత్రి, ఆయన కార్యాలయం, ప్రభుత్వ విభాగాలు కలెక్టర్ల నుంచి ఇబ్బడిముబ్బడిగా నివేదికలు కోరుతున్నారు. వీటిని తయారు చేయించే పనిలో కలెక్టర్లు, అధికారులు నిమగ్నమైపోతున్నారు. ప్రభుత్వం దృష్టికి ఏదైనా సమస్య వచ్చిందంటే చాలు వెంటనే కలెక్టర్‌ నుంచి నివేదిక కోరుతున్నారు. ఆ నివేదిక రూపొందించడం కోసం కలెక్టర్లు తమ జిల్లా పరిధిలోని అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. మరోవైపు ఇదే అంశంపై సంబంధిత విభాగం కార్యదర్శి లేదా విభాగాధిపతి తమకు మరో నివేదిక పంపించాలని కలెక్టర్లను కోరుతున్నారు. అటు ప్రభుత్వానికి, ఇటు సంబంధిత విభాగానికి కలర్‌ ఫుల్‌ రిపోర్టు పంపగానే.. ప్రభుత్వం మరి కొన్ని అంశాలపై నివేదికలు కోరుతోంది. దీంతో కలెక్టర్లు వాటిపైనే చాలావరకు దృష్టి కేంద్రీకరించాల్సి వస్తోంది. ఇలా వారంలో ఏడు రోజులూ నివేదికలు, గణాంకాలతో కుస్తీలు పట్టడంతోనే కలెక్టర్లకు సరిపోతోంది. కలెక్టర్లు కోరిన డేటా ఇవ్వడం, నివేదికలు తయారు చేసి అందించడంలోనే జిల్లా స్థాయి అధికారుల పుణ్యకాలం గడిచిపోతుంది. ఇక వారు గ్రామ, పట్టణ ప్రాంతాల సందర్శనకు వెళ్లడం, అక్కడి ప్రజలతో మమేకమవడం, స్థానిక సమస్యలను తెలుసుకొని వాటికి పరిష్కారం చూపడం అనేది ఓ మిథ్యగానే ఉంటోంది. ఓ జిల్లా కలెక్టర్‌ సమయం చూసుకొని ఏదో ఒక పల్లెకు రాత్రి నిద్రకు వెళ్లి, అక్కడి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారా అంటే.. లేదనే సమాధానం వస్తోంది. నిజానికి జీవీఏ లెక్కలు అనేవి రోటీన్‌గా తయారయ్యేవి. ఆ లెక్కలే గ్రామాలు, పట్టణాల అభివృద్ధిని సూ చించలేవు. పేదరిక నిర్మూలన, సంక్షేమం, గ్రామ, పట్టణ ఆర్థిక, సామాజిక అభివృద్ధి అసలైన కొలమానాలు. కానీ ప్రభుత్వం జీవీఏ లెక్కలపైనే ఎక్కువ ఫోకస్‌ పెడుతోంది. దీంతో కలెక్టర్లు, జిల్లా, మండల స్థాయి అధికారులు వీటిపైనే దృష్టిపెడుతున్నారు. వాస్తవానికి జిల్లాకు కలెక్టర్‌ సర్వోన్నతాధికారి. ప్రభుత్వానికి జవాబుదారీగా ఉంటూనే సొంతంగా ఆలోచించి పనిచేయగలగాలి. కానీ ప్రభుత్వం నుం చి వస్తున్న ఒత్తిళ్లు, నివేదికల టార్గెట్‌లు కొందరు కలెక్టర్లకు శక్తికి మించిన భారంగా ఉంటోంది. రోజులో ఎక్కువ సమయం దీనికే కేటాయించాల్సి వస్తో ంది. దీంతో జిల్లా, డివిజన్‌, మండల, గ్రామస్థాయి అధికారులు, సిబ్బందికి దశ, దిశ చేయలేకపోతున్నారని ఓ సీనియర్‌ ఐఏఎస్‌ అభిప్రాయపడ్డారు.


కలెక్టర్లు ప్రజల్లోకి వెళ్లాలి

కలెక్టర్లు ఎక్కువగా ప్రజాక్షేత్రంలో ఉండాలి. ప్రజల దగ్గరకు వెళ్లి, వారితో కలిసి పనిచేయాలి. ఆఫీసులకు తక్కువగా పరిమితం కావాలి. నిజమైన సమీక్షలు గ్రామాలు, పట్టణాల అభివృద్ధిని రియల్‌టైమ్‌లో చూపించాలి. అంతేకానీ నిరంతరం మారే జీవీఏ లెక్కల ఆధారంగా నివేదికలతో కుస్తీ పట్లు పట్టమని చెప్పరాదు. అలాంటి వాటిపై దృష్టి పెట్టి విలువైన సమయాన్ని వృథా చేయరాదు. పల్లెలు, పట్టణాల సందర్శన, ప్రజలతో మమేకం కావడం, ప్రజా సమస్యల పరిష్కారం, పల్లెనిద్ర, సంక్షేమ హాస్టళ్ల సందర్శన వంటి వాటిపై కలెక్టర్లకు టాస్క్‌లు ఇవ్వాలి. అభివృద్ధిలో స్పష్టమైన టార్గెట్‌లు ఇవ్వాలి. తనను కలెక్టర్‌ గమనిస్తున్నారని గ్రామ, మండల స్థాయి అధికారికి భయం ఉండాలి. అలాగే, తనను ప్రభుత్వం వాచ్‌ చేస్తోందని కలెక్టర్‌కు భయం ఉండాలి. కొందరు కలెక్టర్లు సూపర్‌ బాస్‌లుగా, తాము జిల్లాకు సీఎం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

- మానవ వనరుల అభివృద్ధి సంస్థ

రిటైర్డ్‌ అధికారి సుబ్బారావు ఇదీ సమావేశం షెడ్యూల్‌

సోమవారం ఉదయం 10 గంటలకు సచివాలయంలో కలెక్టర్ల సమావేశం ప్రారంభం కానుంది. ఈసారి 12 మంది కొత్త కలెక్టర్లు సమావేశాలకు రాబోతున్నారు. సీసీఎల్‌ఏ జి.జయలక్ష్మి తొలిమాటతో సమావేశాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ మాట్లాడనున్నారు. కలెక్టర్లను ఉద్దేశించి ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ మాట్లాడనున్నారు. అనంతరం సీఎంచంద్రబాబు కలెక్టర్లకు ప్రభుత్వ ప్రాధాన్యతలపై దిశానిర్దేశం చేయనున్నారు.

ఏడుగురు నోడల్‌ అధికారులు

కలెక్టర్ల సమావేశం నిర్వహణ కోసం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ముఖ్యకార్యదర్శి ర్యాంకు అధికారులు ఏడుగురిని అంశాల వారీగా నోడల్‌ అధికారులుగా నియమించారు. జీఎ్‌సడీపీకి ఆర్థికశాఖ అధికారి పీయూష్‌ కుమార్‌, సంక్షేమం, సాధికారతకు ఎంఎంనాయక్‌, లాజిస్టిక్స్‌, మౌలిక సదుపాయాలకు ఎంటీ కృష్ణబాబు, స్వచ్ఛ భారత్‌, సర్క్యులర్‌ ఎకనామీకి శశిభూషణ్‌కుమార్‌, హెచ్‌ఆర్‌డీ, హెల్త్‌ సెక్టార్‌కు సౌరభ్‌గౌర్‌, ఐటీ సర్వీసె్‌సకు కాటమనేని భాస్కర్‌, ఆదాయార్జన శాఖలకు జి.జయలక్ష్మి నోడల్‌ అధికారులుగా వ్యవహరించనున్నారు. నోడల్‌ విభాగాలు, అధికా రుల నియామకం ద్వారా కలెక్టర్ల సమావేశంలో తక్కువ సమయంలో ఎక్కువ చర్చ జరిగేలా తొలిసారిగా నోడల్‌ విధానం తీసుకొచ్చారు. సగటున గ్రూప్‌లోని ఒక్కో శాఖ తన కార్యకలాపాల పై 5 స్లైడ్‌లకు మించని పీపీటీని ప్రదర్శించాల్సి ఉంటుంది. తద్వారా ప్రజెంటేషన్‌ల పేరిట కాలయాపన తగ్గించాలన్నది అసలు లక్ష్యంగా ఉంది.

జీఎ్‌సడీపీతో చర్చ ఆరంభం

తొలిరోజు సమావేశంలో సీఎం ప్రసంగం తర్వాత ఆర్థిక అంశాలపై చర్చ జరగనుంది. ఆర్థి క శాఖ ముఖ్యకార్యదర్శి పీయూష్‌ కుమార్‌ రా ష్ట్ర, జాతీయ స్థూల ఉత్పత్తి, ప్రైమరీ, సెకండరీ సెక్టార్‌, సర్వీసెస్‌ వంటి కీలక రంగాలపై ప్రజెంటేషన్‌ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2:30 గంటలకు సంక్షేమం, సాధికారతపై చర్చ జరగనుంది. సాయంత్రం 4:15 గంటలకు లాజిస్టిక్స్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై చర్చ జరగనుంది. 5:45 గంటలకు స్వచ్ఛభారత్‌, సర్క్యులర్‌ ఎకాన మీపై అధికారులు ప్రజెంటేషన్‌లు ఇవ్వనున్నారు.

Updated Date - Sep 15 , 2025 | 03:57 AM