Ration Vehicle Scheme: రేషన్ వాహనాలు రద్దు
ABN , Publish Date - May 21 , 2025 | 04:33 AM
జగన్ హయాంలో ప్రవేశపెట్టిన ఎండీయూ రేషన్ వాహనాల వ్యవస్థను ఏపీ కేబినెట్ రద్దు చేసింది. జూన్ 1 నుంచి రేషన్ సరుకులను మళ్లీ చౌక ధరల దుకాణాల ద్వారానే పంపిణీ చేయనున్నది.
1 నుంచి చౌకధరల దుకాణాల్లోనే పంపిణీ
రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం
అమరావతి, మే 20 (ఆంధ్రజ్యోతి): ప్రజా పంపిణీ వ్యవస్థలో జగన్ ప్రభుత్వం అనాలోచితంగా తీసుకొచ్చిన మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ (రేషన్ వాహనాలు) వ్యవస్థను రద్దుచేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. జూన్ 1 నుంచి లబ్ధిదారులకు చౌకధరల దుకాణాల ద్వారానే రేషన్ సరుకులు పంపిణీ చేయాలని నిశ్చయించింది. 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు, దివ్యాంగులకు మాత్రం ఇంటికే డోర్ డెలివరీ చేయాలని నిర్ణయించింది. దీపం ఫేజ్-3లో ఉచిత గ్యాస్ సిలెండర్ల రాయితీ సొమ్మును ముందుగానే లబ్ధిదారుల ఖాతాల్లో వేయాలని తీర్మానించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం వెలగపూడి సచివాలయంలో సమావేశమైన మంత్రిమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ వివరాలను సమాచార, పౌరసంబంధాలు, గృహనిర్మాణ శాఖల మంత్రి కొలుసు పార్థసారథి, పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాకు వెల్లడించారు. జూన్ ఒకటో తేదీ నుంచి గతంలో మాదిరిగానే చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ కార్డుదారులకు నిత్యావసర సరుకులను పంపి ణీ చేయనున్నట్లు తెలిపారు. ఎండీయూ వాహనాలను ఉచితంగా వాటి లబ్ధిదారులకే బదలాయించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రతి జిల్లాలో ఓ యూనివర్సిటీ ఉండాలని కేబినెట్ భేటీలో సీఎం స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకే పరిమితమైపోయిన తెలుగు విశ్వవిద్యాలయం, బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలను పూర్తి స్థాయిలో రాష్ట్రంలో నెలకొల్పాలని మంత్రివర్గం నిర్ణయించింది. రాజమండ్రిలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ ప్రధాన కార్యాలయం, ఏలూరులో అంబేడ్కర్ వర్సిటీ హెడ్‌క్వార్టర్స్ ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేయాలని ఉన్నత విద్యాశాఖ చేసిన ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 200 జంతు ప్రదర్శనల శాలల ఏర్పాటుకు అవకాశాలు ఉన్నాయని సీఎం చెప్పారు. వీలున్న ప్రాంతాల్లో ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యంలో వీటి ఏర్పాటుపై దృష్టి సారించాలన్నారు.
గత వైసీపీ ప్రభుత్వం 9,260 ఎండీయూ వాహనాల కొనుగోలుకు రూ.1,860 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని.. పైలట్ ప్రాజెక్టు కోసం మరో రూ.200 కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఈ వాహనాల వల్ల వినియోగదారులకు ఎటువంటి ప్రయోజనం కలుగకపోగా.. బియ్యం అక్రమ రవాణాకు దారితీసిందన్నారు. ఐవీఆర్‌ఎస్ ఫీడ్‌బ్యాక్ ప్రకారం 25 శాతం మందికి నిత్యావసర సరుకులు అందకపోవడం, 26 శాతం మంది ఎండీయూ ఆపరేటర్లు అధిక ధరలు వసూలు చేయడం వంటి ఫిర్యాదులు వచ్చాయన్నారు. దొంగ లెక్కలు చూపించి వాహనాలను దారి మళ్లించారని.. ఒక్కొక్క వాహనానికి నెలకు 27 వేలు కార్పొరేషన్ నుంచి చెల్లిస్తున్నారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ బీసీ, ఈబీసీ తదితర కార్పొరేషన్ల ద్వారా ఎండీయూ వాహనాలు పొందిన వారిలో 10 శాతం కట్టిన వారికి ఈ వాహనాలను ఉచితంగా అందజేయాలని మంత్రిమండలి నిర్ణయించిందన్నారు. రేషన్ కార్డుల్లో పేరు చేర్చడం కోసం దాదాపు మూడున్నర లక్షల దరఖాస్తులు వచ్చాయని.. కొన్ని సాంకేతిక సమస్యలు ఉత్పన్నం కావడంతో వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 70 వేల మెట్రిక్ టన్నుల అక్రమ బియ్యాన్ని కూటమి ప్రభుత్వం సీజ్ చేసిందని తెలిపారు.
కేబినెట్ మరిన్ని నిర్ణయాలివీ..
భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి వెనక్కి తీసుకున్న 500 ఎకరాల భూమిని తిరిగివ్వాలంటూ జీవీఐఏఎల్ చేసిన అభ్యర్థనకు ఆమోదం.
అమరావతిలో ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సంస్థను బార్ కౌన్సి ల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ద్వారా ఏర్పాటుకు ఆమో దం. ఇందులో ఏపీ విద్యార్థులకు 20ు సీట్లు కేటాయింపు.
సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా 1,136 ఎస్‌జీటీలు, 1,124 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను (మొత్తం 2,260).. ఖాళీగా ఉన్న అదనపు పోస్టులుగా మార్చుతూ పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన జీవో 13కు ధ్రువీకరణ. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు విద్యావకాశాలను పెంపొందించే లక్ష్యంతో ప్రత్యేక విద్యా ఉపాధ్యాయుల కోసం ఈ 2,260 పోస్టుల కల్పనకు ఆమోదం.
కడప జిల్లా కే బొమ్మేపల్లిలో 1,000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ హైడ్రోపవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు ఎకరానికి రూ.5 లక్షల చొప్పున 41.99 ఎకరాల ప్రభుత్వ భూమిని అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్‌కు బదిలీ చేయడానికి ఆమోదం.
శ్రీసత్యసాయి జిల్లా పెద్ద కొల్ల గ్రామంలో 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ హైడ్రోపవర్ ప్రాజెక్టు అభివృద్ధికి ఎకరా రూ.5 లక్షల చొప్పున 12.87 ఎకరాలు అదానీ గ్రీన్ ఎనర్జీకి బదిలీకి అంగీకారం.
నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో పారిశ్రామిక పార్కుకు 615.18 ఎకరాలు ఏపీఐఐసీకి కేటాయింపు.
కర్నూలు జిల్లా బి తాండ్రపాడులో ఈఎ్‌సఐసీ ఆస్పత్రి నిర్మాణానికి 5 ఎకరాలు ఈఎ్‌సఐసీకు కేటాయింపు.
చిత్తూరు జిల్లాలోని పలమనేరు రెవెన్యూ డివిజన్ నుంచి పుంగనూరు, చౌడేపల్లి సోమల, సదుం మండలాలను, చిత్తూరు రెవెన్యూ డివిజన్ నుంచి రొంపిచర్ల మండలాన్ని అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి డివిజన్‌లో బదిలీకి ప్రాథమిక నోటిఫికేషన్ జారీకి ఆమోదం.
రవాణా వాహనాలకు సంబంధించి గ్రీన్ ట్యాక్స్ రేటును తగ్గించడానికి ఉద్దేశించిన ముసాయిదాకు ఆమోదం.
హైకోర్టులో 245 పోస్టుల కల్పనకు అంగీకారం.
32,271 కోట్ల పెట్టుబడులకు పచ్చజెండా
ఎ్‌సఐపీబీ నిర్ణయాలకు కేబినెట్ ఆమోదముద్ర
రాష్ట్రంలో భారీగా రూ.32,271 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలతో వచ్చిన పారిశ్రామిక సంస్థలకు ప్రోత్సాహకాలను ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఇవి పరిశ్రమలు స్థాపిస్తే 35,371 మంది యువతకు ఉద్యోగావకాశాలు కలుగుతాయి. ఈ నెల 15వ తేదీన సీఎం చంద్రబాబు అధ్యతన జరిగిన ఎస్‌ఐపీబీ సమావేశంలో పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చిన వివిధ సంస్థల ప్రతిపాదనలను ఆమోదించిన సంగతి తెలిసిందే. వీటిని మం గళవారం కేబినెట్ ఆమోదించింది. కేవలం ఐదు రోజుల్లోనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ద్వారా పరిశ్రమలను స్థాపించేందుకు వచ్చే సంస్థలకు వేగంగా అనుమతులు మంజూరు చేస్తున్నామన్న సంకేతాలను రాష్ట్ర ప్రభుత్వం పంపింది.
డెక్కన్ ఫైన్ కెమికల్స్, భారత్ ఎలకా్ట్రనిక్స్ లిమిటెడ్, పీయూఆర్ ఎనర్జీ, బ్లూజెట్ హెల్త్ కేర్, జూపిటర్ రెన్యువబుల్స్ సంస్థలు పరిశ్రమలు స్థాపించేందుకు వీలుగా ప్రత్యేక పారిశ్రామిక విధానం కింద భూమి, కరెంటు, నీళ్లు రోడ్లు వంటి వసతులకు ఆమోదం.
మోహన్ సింటెక్స్ ఇండియాకి, ఏటీసీ టైర్స్‌కి ప్రత్యేక ప్యాకేజీకింద ప్రోత్సాహకాల కాలపరిమితి పెంపు.
పెట్టుబడులు పెట్టడానికి రామభద్ర ఇండస్ ప్రైవేట్ లిమిటెడ్ (ఆర్‌ఐపీఎల్)కు ప్రత్యేక ప్రోత్సాహకాలు.
వింగ్‌టెక్ మొబైల్స్, అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్‌ప్రైన్యూర్స్ ఇండియా (అలీ్‌ప)కు విద్యుత్, రోడ్లు, నీరు వంటి మౌలిక సదుపాయాల కల్పన.
లెదర్ అండ్ ఫుట్‌వేర్ పాలసీ(2024-29)కి ఆమోదం.
భోగాపురంలో నిర్మిస్తున్న జీవీఏల్ అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి అదనపు భూమి కేటాయింపు.
వరుణ్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం.
విశాఖ తాజ్ గేట్‌వేను 5 స్టార్ డీలక్స్ హోటల్ కమ్ సర్వీస్ అపార్ట్‌మెంట్‌గా అభివృద్ధి చేసేందుకు సమ్మతి.
స్రవంతి హోటల్స్ అండ్ రిసార్ట్స్ (బెంగళూరు) తిరుపతిలో ఐబీఐఎస్ పేరిట నిర్మించే త్రీస్టార్ హోటల్‌కు, తిరుపతిలో నోవాటెల్ హోటల్‌కు ప్రోత్సాహకాలు.
తిరుపతి వడమాలపేటలో బెంగాల్ అల్టిమేట్ రిసార్ట్స్ ఎల్‌ఎల్‌పీ ఆధ్వర్యంలో 5స్టార్ హోటల్.
నితిన్‌సాయి కన్‌స్ట్రక్షన్స్ ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లిలో రోజుకు 20 టన్నుల సామర్థ్యంతో కంప్రెస్డ్ గ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం.
ఎకోరాన్ ఎనర్జీ ఇండియాకు చెందిన 260 మెగావాట్ల విండ్ సోలార్ హైబ్రిడ్ ప్లాంట్‌ను.. అదే గ్రూప్‌లో భాగమైన ఆమ ప్లస్ ఇంజనీరింగ్ లిమిటెడ్‌కు బదలాయించేందుకు ఆమోదం.
అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో రాళ్ల అనంతపురం, కురబహరెళ్లిల్లో ఇదే సంస్థకు చెందిన 300.30 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టు దేశ్‌రాజ్ సోలార్ ఎనర్జీకి బదలాయించేందుకు సమ్మతి. 2,000 మెగావాట్ల సోలార్ ప్లాంట్‌కు బొండాడ ఇంజనీరింగ్ లిమిటెడ్‌కు అనుమతి.
ఈ వార్తలు కూడా చదవండి..
Tiruvuru Political Clash: తిరువూర్‌లో తీవ్ర ఉద్రిక్తత.. దేవినేని అవినాష్ అరెస్ట్
Liquor Case Remand: లిక్కర్ కేసు.. ఆ ఏడుగురు మళ్లీ జైలుకే
Read Latest AP News And Telugu News