Agriculture Minister Achennaidu: పత్తి రైతుల్ని ఆదుకోవాలి
ABN , Publish Date - Nov 07 , 2025 | 04:21 AM
రాష్ట్రంలో పత్తి రైతుల్ని ఆదుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కేంద్రాన్ని కోరారు.
కేంద్ర టెక్స్‌టైల్స్ మంత్రికి అచ్చెన్నాయుడు లేఖ
అమరావతి, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పత్తి రైతుల్ని ఆదుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు గురువారం కేంద్ర టెక్స్ టైల్స్ శాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్‌కు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. ’ఏపీలో 2025-26 ఖరీ్‌ఫలో 4.56 లక్షల హెక్టార్లలో పత్తి సాగవ్వగా, సుమారు 8 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి ఉత్పత్తి అవుతుందని అంచనా వేశాం. కానీ మొంథా తుఫాన్ వల్ల పత్తి పంట తీవ్రంగా దెబ్బతింది. రాష్ట్ర ప్రభుత్వ సీఎం యాప్, ఆధార్ ఆధారిత ఈ-పంట వ్యవస్థ ద్వారా పత్తి కొనుగోళ్లు చేపట్టాం. అయితే రైతుల సౌలభ్యం కోసం కాపాస్ కసాన్ యాప్ నుంచి సీఎం యాప్‌కు రైతు వివరాలు రియల్ టైమ్‌లో సమన్వయం అయ్యేలా చూడాలి. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా తేమ శాతం 12 నుంచి 18 శాతం వరకు ఉన్న పత్తిని కూడా అనుపాత తగ్గింపులతో కొనుగోలు చేయాలి. ఈ వర్షాలకు తడిసిన, రంగుమారిన పత్తిని కూడా తగిన ధర తగ్గింపులతో కొనుగోలు చేయాలి. విపత్తుతో నష్టపోయిన రైతుల్ని ఆదుకోవడంతో కేంద్రం తక్షణ సహకారం అందించాలని’ అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు.