Share News

Minister Atchannaidu: ఆక్వా రంగానికి 1200 కోట్ల విద్యుత్‌ రాయితీలు

ABN , Publish Date - Dec 17 , 2025 | 05:04 AM

రాష్ట్రంలో ఆక్వా రంగానికి రూ.1,200 కోట్ల విలువైన విద్యుత్‌ రాయితీలు ఇస్తున్నాం. సర్వే నంబర్ల ఆధారంగా ఆక్వా కల్చర్‌ రిజిస్ర్టేషన్లు ఈనెల 17 నుంచి చేసేందుకు చర్యలు తీసుకున్నాం...

Minister  Atchannaidu: ఆక్వా రంగానికి 1200 కోట్ల విద్యుత్‌ రాయితీలు

  • 17 నుంచి సర్వే నంబర్ల ఆధారంగా ఆక్వా రిజిస్ర్టేషన్లు

  • అప్సడా ప్రమాణస్వీకారోత్సవంలో మంత్రి అచ్చెన్న

  • అప్సడ కో చైర్మన్‌గా ఆనం రమణారెడ్డి, సభ్యుల ప్రమాణస్వీకారం

పెనమలూరు, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలో ఆక్వా రంగానికి రూ.1,200 కోట్ల విలువైన విద్యుత్‌ రాయితీలు ఇస్తున్నాం. సర్వే నంబర్ల ఆధారంగా ఆక్వా కల్చర్‌ రిజిస్ర్టేషన్లు ఈనెల 17 నుంచి చేసేందుకు చర్యలు తీసుకున్నాం’ అని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. మంగళవారం ఉదయం నియోజకవర్గ కేంద్రం పెనమలూరులోని రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్‌ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన రాష్ట్ర ఆక్వా కల్చర్‌ అభివృద్ధి ప్రాధికార సంస్థ(అప్సడ) పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. దానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ‘దేశంలోని ఆక్వా ఉత్పత్తుల్లో మన రాష్ట్ర వాటా 29 శాతం ఉంది. అప్సడా చైర్మన్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడు మాట్లాడినా ఆక్వా రంగంలో నాణ్యత, ట్రేసబిలిటీ ముఖ్యమని అంటారు. అందుకు అనుగుణంగానే రైతులు తమ విధానాలను మార్చాల్సి ఉంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుంది. రైతులు తమ పూర్వపు స్థాయిని చేరేలా సీఎం చంద్రబాబు తీసుకొన్న చొరవ అభినందనీయం. కోడిగుడ్లకు ఎలా మార్కెటింగ్‌ చేశారో అదే విధంగా ఆక్వా రంగానికి ఒక సంస్థను తయారు చేసే పనిలో ఉన్నాం. ఆక్వారంగానికి జలవనరులు, విద్యుత్‌ వంటి శాఖలతో అవినాభావ సంబంధాలుంటాయి. సదరు శాఖలతో ముడిపడి ఉన్న విషయాలను పరిష్కరించేందుకు ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తాం. ఏ రైతు ఎన్ని ఎకరాలు ఆక్వా సాగు చేస్తున్నాడో తెలుసుకొనేందుకు జియో ట్యాగింగ్‌ కూడా చేస్తున్నాం.


ఆక్వా కల్చర్‌లో కృత్రిమ మేధ వినియోగానికి చర్యలు తీసుకుంటున్నాం. ఉభయగోదావరి, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో అధికారులు వంద శాతం రిజిస్ర్టేషన్లు పూర్తి చేయాలి’ అని మంత్రి పేర్కొన్నారు. అప్సడా కో చైర్మన్‌ ఆనం వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ... ‘ఆక్వా రంగానికి ట్రేసబిలిటీ ముఖ్యం. దీనికి ఒక్క మత్స్యశాఖ వల్ల మాత్రమే పరిష్కారం దొరకదు. రెవెన్యూశాఖ కూడా క్లియరెన్సు ఇవ్వాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు. ఆర్టీసీ చైర్మన్‌ కొనకళ్ల నారాయణ, ఏపీఐఐసీ చైర్మన్‌ రామరాజు, మత్స్యశాఖ కమిషనర్‌ రామ్‌శంకర్‌ నాయక్‌ తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో అప్సడా పాలకమండలి డైరెక్టర్లుగా దేశంశెట్టి లక్ష్మీనారాయణ, లంకె నారాయణప్రసాద్‌, గుత్తికొండ వీర్రాజబాబు తదితరులతో మత్స్యశాఖ కమిషనర్‌ రామ్‌శంకర్‌ నాయక్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌, కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు పాల్గొన్నారు.

Updated Date - Dec 17 , 2025 | 05:04 AM