సమయపాలన ఏదీ..?
ABN , Publish Date - Feb 23 , 2025 | 12:12 AM
మండలంలోని పలు సచివాలయ ఉద్యోగులు సమయపాలన పాటించడం లేదని, ఇష్టానుసారంగా విధులకు హాజరవుతున్నారని ఆయా గ్రామప్రజలు ఆరోపిస్తున్నారు

ధర్మవరంరూరల్, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పలు సచివాలయ ఉద్యోగులు సమయపాలన పాటించడం లేదని, ఇష్టానుసారంగా విధులకు హాజరవుతున్నారని ఆయా గ్రామప్రజలు ఆరోపిస్తున్నారు. బడన్నపల్లి, ఏలుకుంట్ల, నేలకోట, దర్శినమల, రేగాటిపల్లి, పోతుకుంట, రావులచెరువు తదితర గ్రామాల్లోని సచివాలయ సిబ్బంది ఇష్టారాజ్యంగా విధులకు వస్తున్నారని వాపోతున్నారు. ఉదయం 10.30 గంటలకు హాజరవుతున్నారని, అప్పటికి కూడా ఒకరి.. ఇద్దరు మాత్రమే వస్తున్నారని ఆయా గ్రామస్థులు తెలుపుతున్నారు. శనివారం బడన్నపల్లి గ్రామంలో గ్రామప్రజలు పనుల నిమిత్తం సచివాలయం వద్దకు వెళ్లారు. ఆ సచివాలయంలో ఆర్‌బీకేకు సంబంధించి అధికారి అక్కడే ఉండటంతో రైతులు ఆ సచివాలయం వద్దకు 10 గంటలకే వెళ్లారు. ఆ సమయానికి అధికారులు ఎవరూ రాకపోవడంతో అక్కడే నిరీక్షించారు. సిబ్బంది నింపాదిగా 10.30 గంటలకు వచ్చారు. ధర్మవరానికి కూతవేటు దూరంలో ఉన్న గ్రామాల్లో కూడా ఈ ఉద్యోగులు సమయపాలన పాటించడం లేదని, ఫీల్డ్ వర్క్ పేరుతో అసలు కార్యాలయానికే రావడం లేదని, ఉద్యోగులు సమయపాలన పాటించేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. దీనిపై ఎంపీడీఓ సాయిమనోహర్‌ను సంప్రదించగా.. సచివాలయ ఉద్యోగులు తప్పనిసరిగా సమయపాలన పాటించాలని, ఉదయం 10గంటలకు సచివాలయంలో హాజరై.. తర్వాత ఇతర ఫీల్డ్ వర్క్‌కు వెళ్లాలని చెప్పారు. అసలు సచివాలయానికే రాకుండా ఫీల్డ్‌లో ఉన్నామంటే కుదరదని, విధులను నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు.