Share News

Vidadala Rajini: రజనీ ఆమె మరిదికి పదేళ్లు శిక్ష పడే అవకాశం ఉంది

ABN , Publish Date - Apr 05 , 2025 | 03:20 AM

రూ.2.20 కోట్లు వసూలు కేసులో వైసీపీ నేత విడదల రజని, ఆమె మరిది గోపీనాథ్ వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై వాదనలు హైకోర్టులో జరిగాయి. తదుపరి విచారణను ఏప్రిల్ 8కి వాయిదా వేశారు.

Vidadala Rajini: రజనీ ఆమె మరిదికి పదేళ్లు శిక్ష పడే అవకాశం ఉంది

హైకోర్టుకు తెలిపిన ఏజీ దమ్మాలపాటి

బెయిలివ్వండి షరతులకు లోబడతాం

రజనీ తరఫు న్యాయవాది వాదనలు

అమరావతి, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): స్టోన్‌ క్రషర్‌ యజమానిని బెదిరించి రూ.కోట్లు వసూలు చేశారనే ఆరోపణలతో ఏసీబీ నమోదు చేసిన కేసులో తమకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ వైసీపీ నేత, మాజీ మంత్రి విడదల రజని, ఆమె మరిది గోపీనాథ్‌ వేసిన పిటిషన్లపై హైకోర్టులో శుక్రవారం వాదనలు జరిగాయి. అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ స్పందిస్తూ.. ఏసీబీ అధికారులు నిందితులపై ఐపీసీ సెక్షన్‌ 386(చంపేస్తామని బెదిరించి బలవంతపు వసూళ్లకు పాల్పడడం) నమోదు చేశారని తెలిపారు. ఈ సెక్షన్‌ కింద 10 ఏళ్లు శిక్షపడేందుకు వీలుందని చెప్పారు. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌. శ్రీరామ్‌, న్యాయవాది మహేశ్వరరెడ్డి వాదనలు వినిపిస్తూ.. కేసు వెనుక రాజకీయ కారణాలున్నాయని తెలిపారు. 41(ఏ) కింద నోటీసులు ఇవ్వకుండా, ఐపీసీ సెక్షన్‌ 386ను చేర్చారన్నారు. చంపేస్తామని బెదిరించి బలవంతంగా సొమ్ము వసూలు చేసినట్లు ఫిర్యాదులో ఎక్కడా లేదన్నారు. కోర్టు విధించే షరతులకు కట్టుబడి ఉంటామన్నారు. అయితే, ఏసీబీ తరఫున ఏజీ పూర్తిస్థాయి వాదనల కోసం విచారణను న్యాయమూర్తి జస్టిస్‌ టి. మల్లికార్జునరావు ఈ నెల 8కి వాయిదా వేశారు. వైసీపీ హయాంలో విజిలెన్స్‌ తనిఖీ పేరుతో తనను బెదిరించి, రూ.2.20 కోట్లు వసూలు చేశారని పల్నాడుజిల్లాలోని లక్ష్మీబాలాజి స్టోన్‌ క్రషర్స్‌ మేనేజింగ్‌ పార్టనర్‌ నల్లపనేని చలపతిరావు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. కాగా, విడదల రజని పీఏ దొడ్డా రామకృష్ణ వేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ కూడా ఈ నెల 8కి వాయిదా పడింది.


ఇవి కూడా చదవండి

Borugadda Anil: రాజమండ్రి నుంచి అనంతపురానికి బోరుగడ్డ.. ఎందుకంటే

Kasireddy shock AP High Court: లిక్కర్ స్కాంలో కసిరెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 05 , 2025 | 03:21 AM