Annadata Sukhibhava: ఈ ఏడాది నుంచి ‘అన్నదాతా సుఖీభవ’
ABN , Publish Date - Mar 01 , 2025 | 06:10 AM
కేంద్రం అమలుచేస్తున్న పీఎం కిసాన్ యోజనను కలుపుకొని రైతులకు రూ. 20వేలు చొప్పున లబ్ధిని ఈ పథకం కింద అందిస్తామని తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
ఒక్కో రైతుకు రూ.20వేలు చొప్పున లబ్ధి
వ్యవసాయ బడ్జెట్‌ను సమర్పించిన అచ్చెన్న
అమరావతి, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అన్నదాతా సుఖీభవ పథకాన్ని ఈ ఏడాది నుంచి అమలు చేస్తామని, ఇందుకు అవసరమైన నిధులు కేటాయించామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. కేంద్రం అమలుచేస్తున్న పీఎం కిసాన్ యోజనను కలుపుకొని రైతులకు రూ. 20వేలు చొప్పున లబ్ధిని ఈ పథకం కింద అందిస్తామని తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ‘‘ఆధునిక సాంకేతికతను ఉపయోగించి రైతులకు సాగు ఖర్చులు గణనీయంగా తగ్గించడం, ప్రకృతి సేద్యం వైపు రైతులను మళ్లించడం, అధిక ఆదాయ పంటలపై దృష్టిని పెంచడం ఎగుమతికి అనువైన, సన్నరకాల వరి సాగును ప్రోత్సహించడమే లక్ష్యంగా వ్యవసాయ బడ్జెట్ రూపొందించాం’ అని తెలిపారు. ‘‘వ్యవసాయ రంగంలో 15ు వార్షిక వృద్ధి సాధించేందుకు 11 పంటలను గ్రోత్ ఇంజన్లుగా గుర్తించాం. 2024-25లో జీఎ్‌సడీపీ మొదటి అంచనా ప్రకారం వ్యవసాయం జీవీఏ రూ.57,187కోట్లు. వ్యవసాయ రంగ వృద్ధి రేటు 22.86 శాతం. వ్యవసాయం కుంటుపడితే మరే రంగమూ ముందుకెళ్లే అవకాశం ఉండదు. అందుకే వ్యవసాయాన్ని ప్రాథమిక రంగంగా గుర్తించాం.’’ అని అచ్చెన్నాయుడు తెలిపారు. కాగా, శాసనమండలిలో వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి నారాయణ ప్రవేశపెట్టారు.