Share News

Andhra University: శత వసంతాల ఆంధ్ర విశ్వవిద్యాలయం

ABN , Publish Date - Apr 26 , 2025 | 03:58 AM

ఆంధ్ర విశ్వవిద్యాలయం భాషా ఆధారిత విద్యా సంస్థగా 1926లో స్థాపించబడింది. శతాబ్దకాలంలో ఇది అనేక గొప్ప మేధావులను, నేతలను తయారు చేసిన ప్రతిష్టాత్మక వర్సిటీగా ఎదిగింది.

Andhra University: శత వసంతాల ఆంధ్ర విశ్వవిద్యాలయం

ఏయూ @ 100

నేటి నుంచి ఏడాది పాటు శతాబ్ది వేడుకలు

1926 ఏప్రిల్‌ 26న బెజవాడలో ఏర్పాటు

1930లో విశాఖపట్నానికి తరలింపు

దేశంలోని పురాతన వర్సిటీల్లో ఒకటి

సీవీ రామన్‌, సీఆర్‌రావు, వెంకయ్య

పూర్వవిద్యార్థులే.. ఎందరో ఉన్నతస్థాయికి

దేశంలోని పురాతన విద్యా సంస్థల్లో ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) ఒకటి. 1926 ఏప్రిల్‌ 26న ఏర్పాటైన ఏయూ 99 ఏళ్లను పూర్తి చేసుకుని వందో సంవత్సరంలోకి అడుగు పెడుతోంది. ఈ నేపథ్యంలో శనివారం నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్‌ 26వ తేదీ వరకు శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. నేడు ఏయూ ఆవిర్భావ దినోత్సవంతో పాటు శతాబ్ది వేడుకల ప్రారంభాన్ని పురస్కరించుకుని ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ఆంధ్రులకు ప్రత్యేక విశ్వవిద్యాలయం ఉండాలన్న పోరాట ఫలితంగా ఆంధ్ర విశ్వకళాపరిషత్‌ ఏర్పాటైంది. దేశంలోనే ఇది తొలి భాషా ప్రయుక్త విద్యా సంస్థ. దేశంలో పేరొందిన విద్యా సంస్థల్లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఒకటి. ఆంధ్ర ప్రాంతంలో వర్సిటీ ఏర్పాటు కోసం 1913 నుంచి ఐదేళ్లపాటు పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్వహించారు. ఆ తరువాత ఉమ్మడి మద్రాస్‌ రాష్ట్రానికి జరిగిన తొలి రెండు ఎన్నికల్లో జస్టిస్‌ పార్టీ విజయం సాధించగా.. కౌన్సిల్‌కు ఎన్నికైన ఆంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులు యూనివర్సిటీ ఏర్పాటు చేయాలన్న వాదనను బలంగా వినిపించారు. అప్పటి విద్యా శాఖా మంత్రి సర్‌ అన్నెపు పరశురామ్‌ పాత్రో ఏయూ ఏర్పాటుకు 1925 ఆగస్టు 20న బిల్లు ప్రవేశపెట్టారు. 1926 ఏప్రిల్‌ 26న బెజవాడ కేంద్రంగా ఏర్పాటు చేశారు. తొలి వైస్‌ చాన్సలర్‌గా కట్టమంచి రామలింగారెడ్డి (సీఆర్‌ రెడ్డి), రిజిస్ర్టార్‌గా సీడీ శెట్టి నియమితులయ్యారు. అప్పట్లో ఉపకులపతికి ప్రతి నెలా వచ్చే రెండు వేల వేతనంలో సీఆర్‌ రెడ్డి సగం మొత్తాన్ని వర్సిటీ అభివృద్ధికి విరాళంగా ఇచ్చేవారు. ఏయూ అభివృద్ధికి దాతలు సహకరించాలన్న సీఆర్‌ రెడ్డి పిలుపు మేరకు పిఠాపురం, విజయనగరం, బొబ్బిలి, నిజాం రాజులు భారీగా విరాళాలు అందించేందుకు ముందుకువచ్చారు. ప్రభుత్వం కూడా కొంత మొత్తాన్ని గ్రాంటుగా అందించింది. ఈ నిధులను భవన నిర్మాణాలతో పాటు ఇతర అవసరాలకు వినియోగించారు. బెజవాడలో ఏర్పాటు చేసిన ఏయూను కొద్దికాలానికే మరో ప్రాంతానికి తరలించాలన్న డిమాండ్‌ వచ్చింది.

gtdf.jpg

1930 సెప్టెంబరు ఐదో తేదీన విశాఖలో ఏయూ ఏర్పాటైంది. సర్క్యూట్‌ హౌస్‌ డౌన్‌లోని వాల్తేరు అప్‌ల్యాండ్‌ ప్రాంతంలో భవనాన్ని అద్దెకు తీసుకుని కార్యాలయాలను ఏర్పాటు చేశారు. తర్వాత రెవెన్యూ, దాతలు సమకూర్చిన సుమారు వేయి ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఏయూ ఏర్పాటైంది. కాగా వీసీ పదవికి సీఆర్‌ రెడ్డి రాజీనామా చేయడంతో బాధ్యతలు డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు అప్పగించారు. ఆయన పదవీకాలం ముగిసిన తరువాత తిరిగి సీఆర్‌ రెడ్డి వీసీగా నియమితులయ్యారు. రెండోసారి వీసీగా 13 ఏళ్లపాటు సుదీర్ఘకాలం సేవలందించారు. ఏయూ ప్రభ దశదిశలా వ్యాపించేలా పలు సంస్కరణలు చేశారు.


మేధావుల పుట్టినిల్లు

ప్రపంచంలో గొప్ప మేధావులుగా పేరొందినవారు ఏయూలో పాఠాలు చెప్పారు. హిరెన్‌ ముఖర్జీ, సూరి భగవంతం, టీఆర్‌ శేషాద్రి, హుమయూన్‌ కబీర్‌, వీఈఆర్‌వీ రావు, మామిడిపూడి వెంకటరంగయ్య, పింగళి లక్ష్మీకాంతం వంటి ఎందరో మహనీయుల బోధనలతో వర్సిటీ పునీతమైంది. నోబెల్‌ గ్రహీత సీవీ రామన్‌ ఏయూ పూర్వ విద్యార్థి. కొన్నాళ్లు గౌరవ ఆచార్యులుగా పనిచేసి పరిశోధనల్లో భాగస్వామ్యమయ్యారు. సుప్రసిద్ధ సాంఖ్యక శాస్త్ర నిపుణుడు, పద్మవిభూషణ్‌ సీఆర్‌రావు కూడా ఏయూ పూర్వ విద్యార్థే. వర్సిటీ పూర్వ విద్యార్థుల్లో ఐదుగురు శాంతి స్వరూప్‌ భట్నాగర్‌, ఇద్దరు పద్మవిభూషణ్‌, ఐదుగురు పద్మశ్రీ అవార్డులను అందుకున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌, అమెరికాలో ఎఫ్‌డీఏ డైరెక్టర్‌ డాక్టర్‌ ప్రభ ఆత్రేయ, జీఎంఆర్‌ గ్రూపు సంస్థల అధినేత గ్రంధి మల్లికార్జునరావు వంటి ఎంతోమంది ప్రముఖులు ఏయూలో విద్యను అభ్యసించారు.


20 వేలమంది విద్యార్థులు

తొలుత 20 మందితో ప్రారంభమైన వర్సిటీలో ప్రస్తుతం సుమారు 20 వేలమంది విద్యార్థులు వివిధ కోర్సులు చదువుతున్నారు. వర్సిటీలో 59 దేశాలకు చెందిన వేయి మంది విదేశీ విద్యార్థులు చదువుకుంటున్నారు. తొలుత తెలుగు, హిస్టరీ, ఎకనామిక్స్‌, పాలిటిక్స్‌ విభాగాలు ఉండేవి. ప్రస్తుతం 58 విభాగాలు, 16 ప్రత్యేక పరిశోధన కేంద్రాలు, కంప్యూటర్‌ ల్యాబ్‌లు, జీఐఎస్‌ ల్యాబ్‌లు, 76 సమావేశ మందిరాలతో వర్సిటీ విరాజిల్లుతోంది. ప్రస్తుతం 450 ఎకరాల్లో 215 భవనాల్లో వర్సిటీ నిర్వహిస్తున్నారు. వర్సిటీలో తొలుత 1931లో ఆర్ట్స్‌ కళాశాల ప్రారంభమైంది. ఆ తరువాత సైన్స్‌, న్యాయ, ఫార్మసీ, ఇంజనీరింగ్‌, మహిళా ఇంజనీరింగ్‌ కాలేజీలు ఏర్పాటయ్యాయి. ఈ క్రమంలోనే దూరవిద్యను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఏయూ పరిధిలో 200కుపైగా కాలేజీలు ఉన్నాయి. వర్సిటీకి ఇప్పటి వరకూ 18 మంది వైస్‌ చాన్సలర్లు సేవలు అందించారు. ప్రస్తుత వీసీ జీపీ రాజశేఖర్‌ నేతృత్వంలో శతాబ్ది వేడుకలు జరుగుతున్నాయి.


Also Read:

ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..

లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...

ప్రధాని నివాసంలో కీలక సమావేశం..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 26 , 2025 | 03:59 AM