Share News

Rainfall: వానలే వానలు

ABN , Publish Date - May 28 , 2025 | 04:46 AM

ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాల సీజన్‌లో దేశంలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో కోస్తా, రాయలసీమల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు అంచనా వేసింది.

Rainfall: వానలే వానలు

నైరుతిపై ఐఎండీ తీపి కబురు

దీర్ఘకాల సగటుకు 106 శాతం కురిసే అవకాశం

దక్షిణ, మధ్య భారతాల్లో సాధారణం కంటే ఎక్కువ

వాయవ్యంలో సాధారణ వర్షపాతం

ఈశాన్య, తూర్పు భారతాల్లో తక్కువ

జూన్‌లో ఊపందుకోనున్న వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాష్ట్రంలో నేడూ రేపు వర్షాలు

దేశంలో తగ్గనున్న ఎండలు

విశాఖపట్నం, మే 27(ఆంధ్రజ్యోతి): నైరుతి రుతుపవనాల సీజన్‌లో ఈ ఏడాది వర్షాలు పుష్కలంగా కురవనున్నాయి. జూన్‌ నుంచి సెప్టెంబరు వరకూ నాలుగు నెలల సీజన్‌లో తూర్పు భారతంలో కొన్ని ప్రాంతాలు, ఈశాన్యలో ఎక్కువ ప్రాంతాలు, వాయవ్యంలో జమ్మూకశ్మీర్‌ మినహా దేశంలోని మిగిలిన అన్ని ప్రాంతాల్లో దీర్ఘకాల సగటుకు 106 శాతం వర్షపాతం నమోదు కానుంది. ఈ మేరకు నైరుతి రుతుపవనాల సీజన్‌కు రెండో దశ అంచనా బులెటిన్‌ను భారత వాతావరణ శాఖ(ఐఎండీ) మంగళవారం విడుదల చేసింది. నాలుగు నెలల దీర్ఘకాలిక సగటు (1971 నుంచి 2020 వరకూ 87 సె.మీ)లో ఈసారి 105 శాతం(నాలుగు శాతం అటుఇటుగా) నమోదవుతుంది. దేశంలో దక్షిణ, మధ్య భారతాల్లో దీర్ఘకాల సగటు కంటే 10 శాతం ఎక్కువ, వాయవ్య భారతంలోని ఎక్కువ ప్రాంతాల్లో సాధారణంగా, జమ్మూకశ్మీర్‌, ఈశాన్యంలోని అనేక రాష్ట్రాలు, తూర్పుభారతంలోని బిహార్‌, ఝార్ఖండ్‌, పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ (సగటు కంటే 94 శాతం కంటే తక్కువ)గా వర్షపాతం నమోదుకానుంది.

2SEA1.jpg

తమిళనాడులో సాధారణం కంటే ఎక్కువ, కేరళ దక్షిణ ప్రాంతంలో తక్కువ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది.


అనేక ప్రాంతాలకు రుతుపవనాల విస్తరణ..

రుతుపవనాలు ప్రస్తుతం కేరళతోపాటు దక్షిణ భారతంలోని అనేక ప్రాంతాలకు విస్తరించాయి. ఈ నెలాఖరులోగా దక్షిణాదిలోని మిగిలిన ప్రాంతాలకు, తూర్పుభారతం వరకు విస్తరిస్తాయని వాతావరణ నిపుణులు అంచనావేశారు. ఈ నేపథ్యంలో జూన్‌ లో వర్షాలు ఊపందుకుంటాయని విశ్లేషిస్తున్నారు. జూన్‌లో దీర్ఘకాల సగటులో 108 శాతం వర్షపాతం నమోదుకానుందని ఐఎండీ తెలిపింది. దక్షిణ, వాయవ్య భారతంలో కొద్దిప్రాంతాలు, ఈశాన్య భారతంలో పలు ప్రాంతాలు తప్ప దేశంలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది. దీనివల్ల ఖరీఫ్‌ సీజన్‌లో పంటల సాగుకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందని వ్యవసాయ శాఖ నిపుణులు వెల్లడించారు. జూన్‌లో వాయవ్య, తూర్పు భారతంలో అతి తక్కువ ప్రాంతాలు తప్ప దేశంలో మిగిలినచోట్ల వడగాడ్పుల ప్రభావం ఉండబోదని ఐఎండీ తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతాయని, అందువల్ల ఎండల తీవ్రత తక్కువగా ఉంటుందని పేర్కొంది. జూలై నెలకు సంబంధించిన బులెటిన్‌ను జూన్‌ నెలాఖరున విడుదల చేస్తారు.

ఏపీలో మంచి వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాల సీజన్‌లో మంచి వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. దీర్ఘకాలిక సగటులో కోస్తాలో 109 శాతం (601 మి.మీ.), రాయలసీమలో 112 శాతం(409 మి.మీ.) వర్షపాతం నమోదు కానుంది. జూన్‌లో కూడా సాధారణం కంటే ఎక్కువగా వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ పేర్కొంది. రుతుపవనాలు ఈ ఏడాది నిర్ణీత సమయం కంటే ముందుగానే కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించగా, మిగిలిన ప్రాంతాలకు వచ్చే రెండు, మూడు రోజుల్లో విస్తరిస్తాయి. దీంతో ఈ ఏడాది తొలకరి ముందుగానే ప్రారంభం కానుందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

థియేటర్ల వివాదం.. జనసేన ఆదేశాలు ఇవే

అది నిరూపించు రాజీనామా చేస్తా.. జగన్‌కు లోకేష్ సవాల్

Read Latest AP News And Telugu News

Updated Date - May 28 , 2025 | 04:46 AM