Share News

Interest Subsidy on Education Loans:విద్యా రుణాలపై 4శాతం వడ్డీ రాయితీ

ABN , Publish Date - Sep 16 , 2025 | 04:20 AM

విద్యా రుణాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులపై ఆర్థిక భారాన్ని తగ్గించేలా రుణాలపై 4 శాతం వడ్డీ రాయితీ కల్పించే పథకాన్ని...

Interest Subsidy on Education Loans:విద్యా రుణాలపై 4శాతం వడ్డీ రాయితీ

  • ‘పీఎం విద్యాలక్ష్మి’లో కేంద్రం ఇస్తున్న 3 శాతం రాయితీతో అనుసంధానిద్దాం

  • త్వరలోనే పథకాన్ని ప్రారంభిస్తాం

  • కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు వెల్లడి

  • విద్యార్థులపై మరింత తగ్గనున్న భారం

అమరావతి, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): విద్యా రుణాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులపై ఆర్థిక భారాన్ని తగ్గించేలా రుణాలపై 4 శాతం వడ్డీ రాయితీ కల్పించే పథకాన్ని త్వరలో ప్రారంభించనుంది. ఈ విషయాన్ని సోమవారం కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ పథకం ‘పీఎం విద్యాలక్ష్మి’కి ఈ 4 శాతం వడ్డీ రాయితీని అనుసంధానం చేద్దామని, దానిపై కసరత్తు చేసుకురావాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. త్వరలోనే ఈ పథకాన్ని ప్రారంభిస్తామని ప్రకటించారు. దీంతో విద్యార్థులు ఎంత వరకైనా చదువుకునే వెసులుబాటు కలుగుతుందన్నారు. ఉద్యోగం సాధించిన తర్వాత 14 ఏళ్లలోపు రుణాన్ని తిరిగి చెల్లించవచ్చన్నారు. కాగా, కేంద్రం పీఎం విద్యాలక్ష్మి పేరుతో ఇప్పటికే విద్యా రుణ పథకాన్ని అమలు చేస్తోంది. ఎలాంటి గ్యారెంటీ లేకపోయినా విద్యార్థులకు రూ.7.5 లక్షల వరకు రుణం ఇస్తారు. దానిపై 3 శాతం వరకు వడ్డీ రాయితీ కల్పిస్తోంది. దేశవ్యాప్తంగా నాణ్యమైన విద్యాసంస్థల్లో ప్రవేశాలు సాధించిన విద్యార్థులకు ఇది వర్తిస్తోంది. ఇప్పుడు దీన్ని మన రాష్ట్ర విద్యార్థులకు అనుసంధానం చేయనున్నారు. కేంద్రం 3 శాతం, రాష్ట్రం 4 శాతం వడ్డీ రాయితీ ఇస్తే విద్యార్థిపై అతి తక్కువ వడ్డీ పడుతుంది. దీంతో విద్యార్థులు ఉన్నత విద్య కోర్సుల్లో స్వేచ్ఛగా చేరే అవకాశం ఏర్పడుతుంది.

అపార్‌ ఐడీలు పూర్తికావాలి

విద్యార్థుల అకడమిక్‌ రికార్డులకు సంబంధించిన అపార్‌ ఐడీల నమోదులో అధికారులు విఫలమవుతున్నారని విద్యాశాఖపై సమీక్షలో సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే కలెక్టర్ల సదస్సు నాటికి (సుమారు 45 రోజుల్లో) వంద శాతం నమోదు కావాలని స్పష్టం చేశారు. ఏడాది మొత్తం ఒకే పుస్తకంలో పరీక్షలు రాసే విధానం తెచ్చామని విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌ వివరించగా... మొత్తం సాఫ్ట్‌ కాపీలుగా మార్చి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని చంద్రబాబు సూచించారు. దానివల్ల విద్యార్థులు, టీచర్ల పనితీరుపై అధ్యయనం సులభమవుతుందన్నారు. సిలబ్‌సను భవిష్యత్తు ఆధారంగా అప్‌డేట్‌ చేయాలని స్పష్టం చేశారు. మన విద్యార్థులు జాతీయ విద్యాసంస్థల్లో అత్యధిక సీట్లు సాధించేలా పాఠశాల విద్య ఉండాలన్నారు. అంతకముందు కోన శశిధర్‌ మాట్లాడుతూ త్వరలో విద్యార్థులకు బోధన అనంతరం రెండు నిమిషాల వీడియో ప్రదర్శిస్తామని తెలిపారు. స్ర్కీన్‌పై ప్రశ్నలు చూసి.. చేతిలో క్లిక్కర్‌ ద్వారా సమాధానాలు చెప్పే విధానం త్వరలో ప్రారంభిస్తామని, తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఈ విధానం అమలు చేస్తామని పేర్కొన్నారు.


ఇక నివేదికలు అడగరు.. ‘ఆంధ్రజ్యోతి’ కథనంపై స్పందన!

కలెక్టర్లను నివేదికలు అడగటంపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇకపై కలెక్టర్లు, ఇతర అధికారులను నివేదికలు అడిగే విధానం ఉండదని స్పష్టం చేశారు. అపార్‌ ఐడీలపై కొన్ని జిల్లాలు వెనుకబడటంపై స్పందించే క్రమంలో ‘నివేదికలు, లెక్కలు, సమీక్షలు’పై సోమవారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. ‘‘పదేపదే నివేదికలు అడుగుతున్నామని ఇటీవల కొందరు రాస్తున్నారు. ఇకపై నివేదికలు అడగటం ఉండదు. మొత్తం రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ తీసుకొస్తాం. కొందరు కార్యదర్శులకు ప్రతిదానికీ నివేదికలు అడగటం పరిపాటి అయింది. మొత్తం ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు నివేదికల అవసరం ఉండదు’’ అని పేర్కొన్నారు.

పాఠశాలలకు అనుసంధానంగా అంగన్వాడీలు

పాఠశాలలకు అనుసంధానంగా అంగన్వాడీలు ఉండేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ కార్యదర్శి సూర్యకుమారి సూచించారు. 6 సంవత్సరాల పైబడిన పిల్లలు కూడా అంగన్వాడీల్లో ఉండిపోతున్నారని, వీరిని బడిలో చేర్చడంపై దృష్టి సారించాలన్నారు. అంగన్వాడీల్లో తండ్రులను కూడా భాగస్వామ్యం చేస్తున్నామన్నారు. అటల్‌ వయో అభ్యుదయ యోజన పథకం కింద రాష్ట్రంలో కొత్తగా మరో 13 వృద్ధాశ్రమాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ నెల 17 నుంచి రాష్ట్రీయ పోషణ్‌ మా కార్యక్రమం మొదలవుతోందని, దీన్ని విజయవంతం చేయాలన్నారు. అంగన్వాడీల్లో పిల్లల హాజరు తక్కువపై జిల్లాల కలెక్టర్లు దృష్టి సారించాలని సూచించారు.

Updated Date - Sep 16 , 2025 | 04:20 AM