Central Minister Manohar Lal: నగరాలకు క్లైమేట్ బడ్జెట్!
ABN , Publish Date - Mar 07 , 2025 | 07:03 AM
భవిష్యత్తు తరాలకు సురక్షితమైన పర్యావరణాన్ని అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఓ వైపు సుస్థిర పట్టణాభివృద్ధి దిశగా ముందుకు సాగుతూనే కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ..

కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర పురపాలకశాఖ ఒప్పందం
అమరావతి, మార్చి 6(ఆంధ్రజ్యోతి): భవిష్యత్తు తరాలకు సురక్షితమైన పర్యావరణాన్ని అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఓ వైపు సుస్థిర పట్టణాభివృద్ధి దిశగా ముందుకు సాగుతూనే కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ, జాతీయ పట్టణ వ్యవహారాల సంస్థలతో సిటీస్-2.0 వాతావరణ కార్యాచరణ ప్రణాళికను అమలు చేయడానికి త్రైపాక్షిక అవగాహన ఒప్పందం చేసుకుంది. రాజస్థాన్‌లోని జైపూర్‌లో నిర్వహించిన 12వ ప్రాంతీయ ఆర్థిక ఫోరం వేదికగా ఈ చారిత్రక ఒప్పందం జరిగింది. కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సమక్షంలో రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి సురే్‌షకుమార్ ఈ ఒప్పందంపై సంతకం చేశారు. ఒప్పందం ఫలితంగా ఏపీ ప్రభుత్వానికి రూ.23.10 కోట్ల గ్రాంటు లభించనుంది. ఈ నిధులతో నగరాలకు సంబంధించి రాష్ట్ర క్లైమేట్ సెంటర్ స్థాపన, రాష్ట్ర, నగర స్థాయిలో క్లైమేట్ డేటా అబ్జర్వేటరీల నిర్మాణం, డేటా ఆధారిత వాతావరణ కార్యాచర ప్రణాళికల రూపకల్పన, తక్కువ కార్బన్ నగరాల నిర్వహణ చట్టం ద్వారా మున్సిపల్ అధికారుల సామర్థ్యాల పెంపుదల కార్యక్రమాలు చేపట్టనున్నారు. సిటీస్-2.0 కార్యక్రమంలో ప్రత్యేకంగా నగరాలకు క్లైమేట్ బడ్జెట్ కేటాయించడం విశేషం. ఈ బడ్జెట్ ద్వారా వాతావరణ సంరక్షణకు సంబంధించిన కార్యక్రమాలకు తగిన ఆర్థిక మద్దతు లభిస్తుంది. అదనంగా మూడు స్థాయిల్లో సాంకేతిక సహాయ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో దేశీయ, అంతర్జాతీయ నిపుణుల భాగస్వామ్యంతో రాష్ట్ర, నగర స్థాయిల్లో పర్యావరణ పరిరక్షణకు సమగ్ర మార్గదర్శకం అందించనున్నారు.