Irrigation Projects: 71 సాగునీటి ప్రాజెక్టులకు ఊపిరి
ABN , Publish Date - Jul 10 , 2025 | 03:48 AM
జగన్ హయాంలో అర్ధాంతరంగా పనులు ఆపేసి ఉసురు తీసిన సాగునీటి ప్రాజెక్టులకు ఊపిరి పోయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది.
పనుల పూర్తికి రూ.27,941.34 కోట్లు
ఇవ్వాలని కేబినెట్ తీర్మానం..పనులు 25 శాతం దాటలేదంటూ ఈ పథకాల ఉసురు తీసిన జగన్
పలువురు ఎమ్మెల్యేలు తన దృష్టికి తేవడంతో వాటికి సీఎం ఆమోదం
అమరావతి, జూలై 9 (ఆంధ్రజ్యోతి): జగన్ హయాంలో అర్ధాంతరంగా పనులు ఆపేసి ఉసురు తీసిన సాగునీటి ప్రాజెక్టులకు ఊపిరి పోయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. రూ.27,941.34 కోట్ల విలువైన ఆయా ప్రాజెక్టుల పనులు పునఃప్రారంభించాలని బుధవారం కేబినెట్ సమావేశం తీర్మానించింది. ఇందులో గోదావరి-పెన్నా అనుసంధాన పథకానికి రూ.6,020.15 కోట్లు కేటాయించారు. 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే.. 25 శాతం లోపు పనులు జరిగిన ప్రాజెక్టుల టెండర్లను ఆయన రద్దుచేసిన సంగతి తెలిసిందే. చాలా పథకాలకు తిరిగి టెండర్లు పిలవలేదు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక పలువురు ఎమ్మెల్యేలు స్థానిక ప్రాధాన్యం ఉన్న ఆయా ప్రాజెక్టులు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల సమీక్షించిన ఆయన.. రాష్ట్రవ్యాప్తంగా అవసరమైన చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులను గుర్తించాలని జలవనరుల శాఖకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. వాటి పనులను తిరిగి చేపట్టాలనీ నిర్దేశించారు.
ఊపిరి పోసుకున్న ప్రాజెక్టుల్లో ముఖ్యమైనవి..
గోదావరి-పెన్నా అనుసంధాన పథకం-రూ.6,020.15 కోట్లు
నాగార్జునసాగర్ కుడికాలువ గేట్ల మరమ్మతు-రూ.39.54 కోట్లు
గాలేరు-నగరి పరిధిలో మల్లెమడుగు రిజర్వాయర్ పనులు-రూ.292.66 కోట్లు
హంద్రీ-నీవా పరిధిలో పుంగనూరు బ్రాంచ్ కెనాల్ వెడల్పు-రూ.1,925 కోట్లు
ఉమ్మడి కర్నూలు జిల్లా వేదవతి ఎత్తిపోతలు-రూ.1,942 కోట్లు
రాయలసీమ ఎత్తిపోతలు-రూ.3,825 కోట్లు
హంద్రీ-నీవా కాలువలో మిగిలిన పనులు-రూ.6,182.20 కోట్లు
గండికోట రిజర్వాయర్ అభివృద్ధి-రూ.3,556.76 కోట్లు
తెలుగుగంగ ప్రాజెక్టులో మిగిలిన పనులు-రూ.564.60 కోట్లు.
ముక్త్యాల ఎత్తిపోతల-రూ.489.28 కోట్లు
అనకాపల్లి జిల్లాలో పెద్దేరు రిజర్వాయరు-రూ.84.40 కోట్లు
పశ్చిమగోదావరి జిల్లా ఖాజా, తూర్పుకొక్కిలేరు, ముసకపాలెం, ఎలమంచిలి, నరసాపురంలో రెగ్యులేటర్ పునర్నిర్మాణం-రూ.8.8 కోట్లు
కృష్ణా జిల్లా ఉప్పుటేరుపై వేర్వేరు చోట్ల మూడు రెగ్యులేటర్ల నిర్మాణం. ఇందులో ఒక రెగ్యులేటర్‌కు రూ.136.6 కోట్లు.. రెగ్యులేటర్ కమ్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.188.4 కోట్లు.. దుంపగెడ్డ వద్ద రెగ్యులేటర్‌కు రూ.87 కోట్లు.
తూర్పుగోదావరిలో వశిష్ఠ నదిపై రెగ్యులేటర్ నిర్మాణం-రూ.25.1 కోట్లు
నరసాపురంలో నల్లి క్రీక్‌కాలువ-రూ.17.66 కోట్లు
పల్నాడు జిల్లా వరికెలపూడిశెల ఎత్తిపోతలు-రూ. 340.26 కోట్లు
ఉమ్మడి విజయనగరం రాజాంలో తాగునీటి సరఫరా స్కీం-రూ.63.63 కోట్లు