Share News

Revenue Subcommittee to Resolve: డిసెంబరుకల్లా తేల్చేద్దాం

ABN , Publish Date - Aug 14 , 2025 | 03:43 AM

జిల్లాల విభజనలో గత ప్రభుత్వం సృష్టించిన సమస్యలను డి సెంబరుకల్లా పరిష్కరించాలని మంత్రివర్గ ఉపసంఘం ...

Revenue Subcommittee to Resolve: డిసెంబరుకల్లా తేల్చేద్దాం

  • జిల్లాల సమస్యలపై జిల్లాలకే.. పర్యటనకు ఉపసంఘం నిర్ణయం

  • ఈ నెల 29, 30 తేదీల్లో కలెక్టర్లతో భేటీ.. ప్రజలు, ప్రజాప్రతినిధులతో కూడా

  • జిల్లాలు, డివిజన్లు, మండలాల సరిహద్దులపై సెప్టెంబరు 2 వరకు వినతుల స్వీకరణ

  • గిరిజన ప్రాంతాల సమస్యలపై ప్రత్యేక దృష్టి.. ఉపసంఘం ఏర్పాటైన నాటి నుంచి భారీగా వినతులు.. ప్రతి సూచననూ పరిశీలిస్తాం: రెవెన్యూ మంత్రి అనగాని

అమరావతి, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): జిల్లాల విభజనలో గత ప్రభుత్వం సృష్టించిన సమస్యలను డి సెంబరుకల్లా పరిష్కరించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. జిల్లాలు, డివిజన్లు, మండలాల సరిహద్దులు, ప్రధాన కేంద్రాలపై ప్రజల నుంచి సెప్టెంబరు 2 వరకు వినతులు స్వీకరించాలని, గిరిజన ప్రాంతాల సమస్యలపై ప్రత్యేక దృష్టిసారించాలని నిశ్చయించింది. జిల్లాల్లో పర్యటించనుంది. బుధవారం సచివాలయంలో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ అధ్యక్షతన ఉపసంఘం సమావేశం జరిగింది. మంత్రులు అనిత, నిమ్మల రామానాయుడు, నాదెండ్ల మనోహర్‌, పి.నారాయణ, బీసీ జనార్దన్‌రెడ్డి, సత్యకుమార్‌ పాల్గొన్నారు. గతంలో జరిగిన జిల్లాల విభజన, దానివల్ల తలెత్తిన పాలనా సమస్యలు.. జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల సరిహద్దుల్లో ఉన్న ఇబ్బందులు.. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సీసీఎల్‌ఏ జి.జయలక్ష్మి ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఇప్పటి వరకు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, విన్నపాల్లో కీలకమైన వాటిపై ఉపసంఘం చర్చించింది. జిల్లాల్లో ఉన్న సమస్యలకు డిసెంబరునాటికి పరిష్కారం చూపాలని నిర్ణయించింది. సెప్టెంబరు 2వ తేదీ వరకు ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఇతర వర్గాల నుంచి ఫిర్యాదులు, విన్నపాలు, సూచనలు, సలహాలు స్వీకరించనుంది. ఉపసంఘంలోని మంత్రులు బృందాలుగా ఏర్పడి ఈ నెల 29, 30వ తేదీల్లో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన పర్యటించాలని నిర్ణయం తీసుకున్నారు. గిరిజన ప్రాంతాలు పాడేరు, రంపచోడవరం, పోలవరం విలీన మండలాల్లో కూడా పర్యటించి అక్కడి ప్రజలతో మాట్లాడాలని మంత్రులు భావిస్తున్నారు. జిల్లాల పర్యటనలో తొలుత కలెక్టర్లు, ఆ తర్వాత జిల్లా ప్రజాప్రతినిధులతో ఉపసంఘం సమావేశం కానుంది. పాలనాపరమైన ఇబ్బందులు, సరిహద్దు సమస్యలపై కలెక్టర్ల నుంచి వివరాలు తెలుసుకుంటారు. ప్రజలు, కలెక్టర్లు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చే నివేదికలు, సూచనలు, సలహాల ఆధారంగా సెప్టెంబరు 15 నాటికి ఉపసఘం తుది నివేదికను సిద్ధం చేసి ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందించాలని భావిస్తోంది. ఆ తర్వాత జిల్లాల పేర్లు, ప్రధాన కేంద్రాల ఏర్పాటు, డివిజన్‌, మండలాల పునర్విభజనపై నిర్ణయం సుకోనుంది. అనంతరం ప్రభుత్వ నిర్ణయాలను బట్టి రెవెన్యూ శాఖ గెజిట్‌ నోటిఫికేషన్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియనంతా డిసెంబరులోపే పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తోంది.


ప్రజాభిప్రాయానికే ప్రాధాన్యం: అనగాని

జిల్లాల పేర్లు, ప్రధాన కేంద్రాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్విభజనలో ప్రజాభిప్రాయానికే ప్రాధాన్యమిస్తామని మంత్రి అన గాని మీడియాకు చెప్పారు. కమిటీ ఏర్పాటైనప్పటి నుంచి పెద్ద ఎత్తున విన్నపాలు, సూచనలు వస్తున్నాయని, ప్రతి అంశాన్నీ పరిశీలిస్తామని తెలిపారు. తాము కేవలం జిల్లాల పునర్విభ జన అంశంపైనే అధ్యయనం చేస్తున్నామని, అసెంబ్లీ నియోజకవర్గల మార్పు తమ పరిధిలో లేని అంశమని చెప్పారు.

సూచనల వెల్లువ..

  • జిల్లాల పేర్లు, ప్రధాన కేంద్రాల మార్పు, డివిజన్లు, మండలాల పునర్విభజనపై ప్రజలు, సంఘాలు, పార్టీలు, ప్రజాప్రతినిధుల నుంచి పెద్ద ఎత్తున విన్నపాలు ఉపసంఘానికి చేరుతున్నాయి. అందులో కొన్ని..

  • తూర్పుగోదావరి జిల్లాకు సర్‌ ఆర్థర్‌ కాటన్‌ పేరు పెట్టాలి.

  • కోనసీమ, కాకినాడ జిల్లాల్లో మండలాల విభజన జరగాలి.

  • మండపేట మండలాన్ని రాజమండ్రిలో కలపాలి.

  • సర్వేపల్లి మండలాన్ని నెల్లూరులోనే కొనసాగించాలని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఉపసంఘాన్ని కోరారు.

  • చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపాలన్న వినతులు వచ్చాయి. వెదురుకుప్పం తిరుపతికి 15 కిమీ దూరంలో ఉంది. కానీ దానిని చిత్తూరులో చేర్చారు.

  • అన్నమయ్య జిల్లాకు ప్రధాన కేంద్రంగా రాజంపేటను ఎంపిక చేయాలన్న విన్నపాలు వచ్చాయి. గతంలో వైసీపీ నేతలు వ్యూహాత్మకగా రాయచోటిని జిల్లా కేంద్రంగా ఎంపిక చేయించారు. జిల్లాల పునర్విభజనకు లోక్‌సభ స్థానాలను ప్రామాణికంగా తీసుకున్న వైసీపీ సర్కారు జిల్లా కేంద్రాల ఏర్పాటులో సొంత రాజకీ య ప్రయోజనాలకే పెద్దపీట వేసింది.

  • పాడేరు, అల్లూరి జిల్లా విలీన మండలాల విషయంలో 23 విన్నపాలు వచ్చాయి.

  • నరసాపురం లోక్‌సభ స్థానాన్ని పశ్చిమగోదావరి జిల్లాగా పునర్విభజన చే శారు. భీమవరాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు నరసాపురాన్ని జిల్లా కేంద్రం చేయాలని అక్కడి ప్రజాప్రతినిధులు ఉపంఘానికి లేఖ రాశారు.

  • బాపట్ల లోక్‌సభ స్థానం ఆధారంగానే జిల్లాను పునర్విభజన చేయాలని అక్కడి నేతలు కోరుతున్నారు. జిల్లా కేంద్రాన్ని చీరాలకు మార్చాలని ఆ ప్రాంత వాసులు కోరారు. బాపట్ల జిల్లాకు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పేరుపెట్టాలన్నారు.

  • గుంటూరు లేదా పల్నాడు జిల్లాకు గుర్రం జాషువా పేరుపెట్టాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ ఉపసంఘాన్ని కోరారు.

  • కృష్ణా జిల్లా మడిచర్లను బాపులపాడు మండలం నుంచి నూజివీడు లేదా ముసునూరు మండలంలో కలపాలని స్థానికులు కోరారు.

  • శ్రీకాకుళం జిల్లా మురపాకను మండలంగా ప్రకటించాలని ఆ ప్రాంతానికే చెందిన బీఎస్‌ నాయుడు కోరారు.


ఉపసంఘం ముందు కీలక ప్రతిపాదనలు..

  • బాపట్ల జిల్లాలో అద్దంకి రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన వచ్చింది.

  • పాలనా సౌలభ్యం కోసం పార్వతీపురం మన్యం జిల్లా లక్నాపురం గ్రామాన్ని రెండు రెవెన్యూ గ్రామాలుగా విభజించాలి.

  • అన్నమయ్య జిల్లాను పూర్తిగా పునర్విభజించాలని ప్రతిపాదన వచ్చింది. చిత్తూరులో ఉన్న పుంగనూరు, చౌడేపల్లి, సోమల, సోదం, పులిచర్ల, రొంపిచర్ల మండలాలను అన్నమయ్య జిల్లాలో కలపాలని రెవెన్యూశాఖ అంటోంది. ఈ జిల్లాలో కొత్తగా మదనపల్లె అర్బన్‌ మండలం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన వచ్చింది.

  • ఎన్టీఆర్‌ జిల్లాలో వీరులపాడు మండల కేంద్రంగా వీరులపాడునే కొనసాగించాలన్న ప్రతిపాదన వచ్చింది.

  • విజయనగరం జిల్లాలో ఉన్న శృంగవరపు కోట, లక్కవరపు కోట, కొత్తవలస, వేపాడ, జామి మండలాలను విశాఖ జిల్లాలో కలుపాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది.

Updated Date - Aug 14 , 2025 | 03:43 AM