Share News

Republic Day Parade: భళా ఏటికొప్పాక కళ

ABN , Publish Date - Jan 30 , 2025 | 04:18 AM

ఆంధ్రప్రదేశ్‌ వారసత్వ సంప్రదాయానికి ప్రతీకగా ఉన్న ఏటికొప్పాక బొమ్మలతో రూపొందించి, ప్రదర్శించిన శకటం 76వ రిపబ్లిక్‌ డే పరేడ్‌ ఉత్సవానికే హైలెట్‌గా నిలిచింది. సామాజిక మాధ్యమాల్లో సైతం లక్షలాది మంది ఈ శకటానికి ముగ్ధులై ప్రశంసలతో ముంచెత్తారు.

Republic Day Parade: భళా ఏటికొప్పాక కళ

ఢిల్లీ గణతంత్ర పరేడ్‌లో ఆకట్టుకున్న ఏపీ శకటం

జ్యూరీ తృతీయ అవార్డు ప్రకటించిన కేంద్రం

ఆ రాజసానికి నెటిజన్లు కూడా ఫిదా

30 ఏళ్ల తర్వాత రాష్ట్ర శకటానికి కేంద్రం బహుమతి

ఢిల్లీలోని గణతంత్ర పరేడ్‌లో ఆకట్టుకున్న ఏపీ శకటం.. జ్యూరీ తృతీయ అవార్డు ప్రకటించిన కేంద్రం

న్యూఢిల్లీ, అమరావతి, ఎలమంచిలి, జనవరి 29(ఆంధ్రజ్యోతి): గణతంత్ర వేడుకల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ శకటానికి కేంద్ర ప్రభుత్వం జ్యూరీ అవార్డు ప్రకటించింది. రాష్ట్రంలోని చేతివృత్తుల కళా ప్రాముఖ్యతను చాటుతూ, ఆంధ్రప్రదేశ్‌ వారసత్వ సంప్రదాయానికి ప్రతీకగా ఉన్న ఏటికొప్పాక బొమ్మలతో రూపొందించి, ప్రదర్శించిన శకటం 76వ రిపబ్లిక్‌ డే పరేడ్‌ ఉత్సవానికే హైలెట్‌గా నిలిచింది. సామాజిక మాధ్యమాల్లో సైతం లక్షలాది మంది ఈ శకటానికి ముగ్ధులై ప్రశంసలతో ముంచెత్తారు. రాష్ట్రంలోని చేతివృత్తులు, హస్తకళలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విస్తృత ప్రచారం తీసుకురావాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ ఈ శకటాన్ని రూపొందించింది. శకటం ముందు వినాయకుడు, చివర కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామి ఎత్తైన రూపాలతో ఇరువైపులా బొబ్బిలి వీణలు, తెలుగువారి కట్టు, బొట్టు ప్రతిబింభించేలా అమర్చిన ఏటికొప్పాక బొమ్మల కొలువుతో తీర్చిదిద్దారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు సైతం ఈ శకటం మనోహరమైన రూపాన్ని చూసి పులకించిపోయారు. ఆన్‌లైన్‌ ఓటింగ్‌లోనూ ఈ శకటానికి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. కాగా, దేశ రాజధానిలో జరిగిన గణతంత్ర వేడుకల్లో ఏపీ శకటానికి 30 సంవత్సరాల తర్వాత తొలిసారిగా కేంద్ర ప్రభుత్వ జ్యూరీ పురస్కారం లభించింది. కేంద్ర రక్షణ శాఖ ప్రకటించిన ఉత్తమ శకటాల జాబితాలో తొలి స్థానంలో యూపీ శకటం, రెండో స్థానంలో త్రిపుర శకటం నిలవగా మూడో స్థానం ఏపీకి దక్కింది. ఏటికొప్పాక బొమ్మల శకటానికి కేంద్ర ప్రభుత్వం జ్యూరీ తృతీయ బహుమతిని ప్రకటించింది. అలాగే, గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని ఎర్రకోట ప్రాంగణంలో కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన భారత్‌ పర్వ్‌లో కోనసీమ జిల్లాకు చెందిన పి.బాబా సత్య వెంకట కుమార్‌ బృందం గరగ నృత్యాన్ని అద్భుతంగా ప్రదర్శించింది.


కళాకారులకు సీఎం అభినందనలు..

రిపబ్లిక్‌ డే పరేడ్‌లో ఏపీ శకటానికి తృతీయ బహుమతి రావడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ హర్షం వ్యక్తం చేశారు. శకటం రూపకర్తలకు, రాష్ట్ర అధికారులకు ప్రత్యేకించి ఏటికొప్పాక బొమ్మల తయారీ కళాకారులకు సీఎం అభినందనలు తెలిపారు. ఏపీ శకటం తృతీయ స్థానం సాధించడం ఆనందంగా ఉందని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఏటికొప్పాక గ్రామంలో సంబరాలు

ఏటికొప్పాక బొమ్మల శకటానికి అవార్డు ప్రకటించడంతో అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలంలోని ఏటికొప్పాక గ్రామంలో సంబరాలు మిన్నంటాయి. శకటం రూపశిల్పి గొర్సా సంతోష్‌ ఇంటి వద్ద స్థానికులంతా సంబరాలు జరుపుకున్నారు. సంతో్‌షకు గ్రామస్థులు స్వీట్లు తినిపించి అభినందించారు.

వెలకట్టలేని గౌరవం దక్కింది

నేను రూపొందించిన బొమ్మల శకటానికి అవార్డు దక్కినందుకు చాలా ఆనందంగా ఉంది. వెలకట్టలేని గౌరవం దక్కినట్టయింది. ఈ విషయంలో ఐఅండ్‌పీఆర్‌, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో సహకారం అందించాయి. ఏటికొప్పాక హస్త కళారంగానికి ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అందించిన ప్రోత్సాహం జీవితంలో మరిచిపోలేనిది.

-గొర్సా సంతోష్‌, బొమ్మల నమూనా రూపకర్త, ఏటికొప్పాక


మరిన్నీ తెలుగు వార్తల కోసం..

Also Read: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర మంత్రులు.. అసలు విషయం ఇదే

Also Read: పంచగ్రామాల ప్రజలకు గుడ్ న్యూస్

Also Read: ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతోన్న ముఠా గుట్టను రట్టు చేసిన పోలీసులు

Also Read: మీకు వాట్సాప్ ఉంటే చాలు.. మీ ఫోన్‌లోనే ప్రభుత్వం

Also Read: జాతీయ క్రీడల జరుగుతోన్న వేళ.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు

Also Read: హైకోర్టు తీర్పుపై స్పందించిన జ్యోతి సురేఖ

For AndhraPradesh News And Telugu News

Updated Date - Jan 30 , 2025 | 04:18 AM