Share News

CM Chandrababu: పెట్టుబడులే లక్ష్యం

ABN , Publish Date - Jul 28 , 2025 | 04:31 AM

పోర్టులు, గ్రీన్‌ ఎనర్జీ సహా వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత అనుకూల వాతావరణం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

CM Chandrababu: పెట్టుబడులే లక్ష్యం

  • ఏపీ అత్యంత అనుకూలం

  • డిఫెన్స్‌, ఎలక్ట్రానిక్స్, ఏరో స్పేస్‌లో విస్తృత అవకాశాలు

  • సింగపూర్‌ నుంచి భారత్‌కు పెట్టుబడులు రావాలి

  • వాటికి ఏపీ గేట్‌వేగా ఉండాలి

  • భారత్‌ హైకమిషనర్‌తో చంద్రబాబు

  • సింగపూర్‌లో సీబీఎన్‌ బ్రాండ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందన్న అంబులే

అమరావతి, జూలై 27(ఆంధ్రజ్యోతి): పోర్టులు, గ్రీన్‌ ఎనర్జీ సహా వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత అనుకూల వాతావరణం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సింగపూర్‌ పర్యటనలో భాగంగా ఆదివారం అక్కడి భారత హైకమిషనర్‌ డాక్టర్‌ శిల్పక్‌ అంబులేతో సమావేశమయ్యారు. సీఎంతో పాటు మంత్రులు నారాయణ, లోకేశ్‌, టీజీ భరత్‌, అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో సింగపూర్‌ ప్రగతి, వృద్ధిరేటు, ప్రభుత్వ పాలసీలు, సింగపూర్‌లో భారతీయుల కార్యకలాపాల గురించి చంద్రబాబుకు అంబులే వివరించారు. ఆరోగ్య రంగం, గ్రీన్‌ హైడ్రోజన్‌, ఏవియేషన్‌, సెమీ కండక్టర్లు, పోర్టులు, పారిశ్రామిక రంగాల్లో సింగపూర్‌ అనుసరిస్తున్న విధానాలను వివరించారు. భారత్‌తో సింగపూర్‌ ప్రభుత్వం మంచి సంబంధాలను కలిగి ఉందని అంబులే తెలిపారు. సింగపూర్‌ ప్రభుత్వం, పారిశ్రామికవేత్తల్లో సీబీఎన్‌ బ్రాండ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందని సీఎంకు తెలిపారు. భారత్‌లో ప్రత్యేకించి ఏపీలో పెట్టుబడులకు సింగపూర్‌ సంస్థలు ఆసక్తిగా ఉన్నాయని చెప్పారు. సీఎం చంద్రబాబు స్పందిస్తూ.. గతంలో సింగపూర్‌తో కలిసి అమరావతి ప్రాజెక్టును చేపట్టామని, కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు నుంచి సింగపూర్‌ బయటకు వెళ్లిందని అన్నారు. సింగపూర్‌తో రాజధాని నిర్మాణ భాగస్వామ్యం విషయంలో అలా జరిగి ఉండకూడదని, తన పర్యటన ద్వారా గతంలో ఉన్న మంచి వాతావరణాన్ని పునరుద్ధరించే ప్రయత్నం చేస్తానని తెలిపారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా ప్రగతిశీల విధానాలు అమలు చేస్తున్నామని చెప్పారు. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పాలసీలు, పెట్టుబడులకు గల అవకాశాలను సింగపూర్‌ పారిశ్రామికవేత్తలకు వివరించి, పెట్టుబడులను ఆకర్షించడమే తన పర్యటన లక్ష్యమని తెలిపారు.


గ్రీన్‌ ఎనర్జీ రంగంలో 160 గిగావాట్ల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామన్న సీఎం.. గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రాజెక్టులు ఏపీలో ఇప్పటికే పట్టాలెక్కాయని వివరించారు. ఇండియా క్వాంటమ్‌ మిషన్‌లో భాగంగా క్వాంటమ్‌ వ్యాలీని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. విశాఖలో గూగుల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటవుతుందని, డిఫెన్స్‌, ఏరో స్పేస్‌, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్‌ సంస్థలకు రాయలసీమ ప్రాంతంలో అనువైన పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. ‘ఇండియాకు సింగపూర్‌ నుంచి పెట్టుబడులు రావాలి.. వాటికి ఏపీ గేట్‌వేగా ఉండాలి’ అని అన్నారు. ఏపీలో పెట్టుబడులకు అవసరమైన సహకారాన్ని అందించాలని అంబులేను సీఎం కోరారు. విద్యా రంగంలో తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను, తమ ఆలోచనలను మంత్రి లోకేశ్‌ వివరించారు. ఏపీలో ఇప్పటికే ఏర్పాటవుతున్న ప్రముఖ విద్యాసంస్థల గురించి చెబుతూ, ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఏపీలో చేపడుతున్న ప్రాజెక్టుల గురించి మంత్రి నారాయణ వివరించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఏపీలో పెట్టుబడులకు సింగపూర్ గ్రీన్ సిగ్నల్.. ప్రధానంగా ఈ రంగాల్లో

బద్వేల్‌లో ఉప ఎన్నిక‌.. ఆదినారాయణరెడ్డి ఏమన్నారంటే..

Read latest AP News And Telugu News

Updated Date - Jul 28 , 2025 | 04:31 AM