Andhra Pradesh High Court: మద్యం నియంత్రణ, డీఅడిక్షన్ సెంటర్లపై విస్తృత ప్రచారం కల్పించాలి
ABN , Publish Date - Apr 24 , 2025 | 04:45 AM
మద్యం నియంత్రణ, డీఅడిక్షన్ సెంటర్లపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. డీఅడిక్షన్ సెంటర్ల పనితీరును పర్యవేక్షించేందుకు చర్యలు తీసుకోవాలని కూడా కోరింది.
ఇప్పటివరకు ఏవైనా కార్యక్రమాలు చేపట్టారా?
పూర్తి వివరాలతో కౌంటర్ వేయండి: హైకోర్టు
అమరావతి, ఏప్రిల్ 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మద్యం నియంత్రణ, డీఅడిక్షన్ సెంటర్ల పనితీరుపై విస్తృత ప్రచారం కల్పించాల్సిన అవసరముందని హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. మద్యం డీఅడిక్షన్ సెంటర్లపై ప్రజల్లో అవగాహన లేదని పేర్కొంది. మద్యం సేవించడం వల్ల కలిగే దుష్ప్రభావాలు, డీఅడిక్షన్ సెంటర్లపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏ చర్యలు తీసుకుంటున్నారు? ఎలాంటి ప్రచార కార్యక్రమాలు చేపట్టారు? ప్రచార కార్యక్రమాల కోసం బడ్జెట్ ఏమైనా కేటాయించారా? పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎక్సైజ్, ఆరోగ్య శాఖల ముఖ్య కార్యదర్శులు, ఎక్సైజ్ శాఖ కమిషనర్‌కు నోటీసులు జారీ చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. నెలలో ఒక వ్యక్తికి విక్రయించే గరిష్ఠ మద్యం బాటిళ్ల సంఖ్యను నిర్ణయించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలన్న పిటిషనర్ అభ్యర్థనను తోసిపుచ్చింది. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని, అలాంటి ఉత్తర్వులు జారీ చేయలేమని పేర్కొంది. డీఅడిక్షన్ సెంటర్ల పనితీరు, రోగులకు అందుతున్న చికిత్సను నిరంతరం పర్యవేక్షించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ విశాఖకు చెందిన డాక్టర్ ఎస్.షిరిన్ రెహ్మన్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. నెలలో ఒక వ్యక్తికి విక్రయించే గరిష్ఠ మద్యం బాటిళ్ల సంఖ్యను నిర్ణయించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. 21 ఏళ్ల లోపువారికి మద్యం విక్రయించకుండా నిలువరించేందుకు ఆధార్ లింక్ చేసి మద్యం విక్రయించేలా చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. ఈ పిల్ బుధవారం హైకోర్టులో విచారణకు వచ్చింది. పిటిషనర్ తరఫున న్యాయవాది వి.రఘు వాదనలు వినిపించారు. రాష్ట్రంలో డీఅడిక్షన్ సెంటర్ల నిర్వహణ సరిగా ఉండటం లేదని, అందులో ఎంతమంది చికిత్స పొందారనే వివరాలు ఏవీ అధికారుల వద్ద లేవని అన్నారు. ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. రాష్ట్ర ప్రభుత్వాలకు మద్యం విక్రయాల ద్వారా అత్యధిక రెవెన్యూ వస్తుందని, ఈ నేపథ్యంలో అమ్మకాలను నియంత్రించే చర్యలు ప్రభుత్వాలు తీసుకోవని తెలిపింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.
Also Read:
ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..
లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...
ప్రధాని నివాసంలో కీలక సమావేశం..
For More Andhra Pradesh News and Telugu News..