Share News

SC ST Schemes: త్వరలో సంక్షేమ శాఖల ‘స్వయం ఉపాధి’ జాతర!

ABN , Publish Date - Apr 05 , 2025 | 02:20 AM

ఆంధ్రప్రదేశ్‌లో స్వయం ఉపాధి పథకాలను మళ్లీ పునఃప్రారంభిస్తూ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల అభివృద్ధికి రూ. వేల కోట్లతో యూనిట్లను అందించేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి.

SC ST Schemes: త్వరలో సంక్షేమ శాఖల ‘స్వయం ఉపాధి’ జాతర!

బీసీ సంక్షేమశాఖ దరఖాస్తుల ప్రక్రియ పూర్తి

రూ.2 వేల కోట్లతో బీసీలకు వివిధ యూనిట్లు

కొత్తగా ప్రారంభించిన ఎస్సీ సంక్షేమం

రూ.800కోట్లతో 20 వేల మందికి ఉపాధి లక్ష్యం

త్వరలో ఎస్టీ, మైనారిటీ కార్యాచరణ ప్రణాళికలు

గత ప్రభుత్వం నిలిపేసిన పథకాలు మళ్లీ గాడిలోకి..

ఏటా లక్షల మందికి స్వయం ఉపాధి లక్ష్యంగా సర్కారు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

కూటమి సర్కారు రాకతో సంక్షేమంతోపాటు అభివృద్ధికి బాటలుపడ్డాయి. ఇప్పటికే సామాజిక పింఛను పెంపుదలతో పాటు అన్న క్యాంటీన్‌, మహిళలకు గ్యాస్‌ సిలిండర్ల సబ్సిడీ పథకాలు అమల్లోకి తెచ్చారు. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీలకు స్వయం ఉపాధి యూనిట్లు అందించి వారిని స్వయం అభివృద్ధి దిశగా మళ్లించి స్వర్ణాంధ్రప్రదేశ్‌ సాకారం చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. మిగతా శాఖల కంటే ముందుగా బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత స్వయం ఉపాధి యూనిట్లను బీసీలకు అందించేందుకు శ్రీకారం చుట్టారు. ఆ శాఖ ఇప్పటికే 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆన్‌లైన్‌ బెనిఫిషరీ మేనేజ్‌మెంట్‌ అండ్‌ మానిటరింగ్‌ సిస్టం(ఓబీఎంఎంఎస్‌) ద్వారా దరఖాస్తులు స్వీకరించింది. ఎస్సీ కార్పొరేషన్‌ కూడా 2025-26 సంవత్సరానికి ఇప్పటికే కార్యాచరణ ప్రణాళిక ప్రారంభించింది. ఈ నెల 11 నుంచి ఓబీఎంఎంఎస్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఎస్టీ, మైనారిటీ కార్పొరేషన్లు కూడా కసరత్తు ప్రారంభించాయి.

యూనిట్లపై లబ్ధిదారులతో సమావేశాలు

గతంలో స్వయం ఉపాధి యూనిట్ల ఎంపిక, యూనిట్‌ విలువ తదితర అంశాలపై అసంబద్ధంగా ఉండటంతో.. ఇప్పుడు అలాంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బీసీ సంక్షేమశాఖ ఈసారి వినూత్నంగా జనరిక్‌ మెడికల్‌ షాపులు డీఫార్మసీ, బీ ఫార్మసీ పూర్తి చేసిన నిరుద్యోగ యువతకు అందిస్తోంది. జనరిక్‌ షాపులకు రూ.8 లక్షలు యూనిట్‌ విలువగా నిర్ణయించి రూ.4 లక్షలు సబ్సిడీగా అందించి.. మండల కేంద్రాలు, ఇతర ప్రధాన కేంద్రాల్లో ఏర్పాటుకు నిర్ణయించారు. మంత్రి సవిత ఆదేశాలతో ఈ సారి ప్యాసింజర్‌ ఆటోలను కూడా స్వయం ఉపాధి కింద యువతకు ఇవ్వాలని నిర్ణయించారు. మొత్తంగా బీసీలకు స్వయం ఉపాధి యూనిట్ల కోసం సుమారు రూ.2 వేల కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. బీసీ కార్పొరేషన్‌ అధికారులు విజయవాడలోని బీసీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో గురువారం ఆటో డ్రైవర్లు, ఆటోలను సరఫరా చేసే కంపెనీ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. లబ్ధిదారులతో సంప్రదించి వారికి అవసరమైన యూనిట్లు కొనుగోలు చేయడం ద్వారా స్వయం ఉపాధి యూనిట్లు సక్సెస్‌ అవుతాయని అధికారులు గుర్తించారు. ఇప్పటికే మినీ డెయిరీ యూనిట్‌ కోసం మేలు రకం గేదెలు కొనుగోలు చేసేందుకు బీసీ సంక్షేమశాఖ ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. ఎస్సీ కార్పొరేషన్‌ కూడా ఇటీవల 32 రకాల యూనిట్లును ఎస్సీలకు అందించాలని కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. ఈ నెల 11 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించనుంది. రూ.800 కోట్లతో సుమారు 20 వేల మంది ఎస్సీలకు స్వయం ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. స్వయం ఉపాధి ఏటా నిరంతర ప్రక్రియగా కొనసాగనుంది.


టీడీపీ హయాంలోనే స్వయం ఉపాధి

2014కు పూర్వం కాంగ్రెస్‌ హయాంలో ఫెడరేషన్లు ప్రారంభిస్తే.. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నిధులు కేటాయించడంతో పాటు ఫెడరేషన్లు, కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించి గౌరవించారు. 2018-19 బడ్జెట్‌లో బీసీల్లోని అన్ని వర్గాలకూ సంక్షేమ ఫలాలు అందించాలనే లక్ష్యంగా బడ్జెట్‌ను రూపొందించారు. అంతకుముందు ఎప్పుడూ కేటాయించని తరగతులకు ఆ బడ్జెట్‌లో ప్రత్యేక స్థానమివ్వడం విశేషం. చేనేత సంక్షేమానికి అంతకుముందు కంటే పది రెట్లు పెంచి కార్మికుల విశ్వాసాన్ని చూరగొన్నారు. రజకులకు వందరెట్లు, దూదేకుల కులాలకు చెందిన వారికి 20రెట్లు, నాయీబ్రాహ్మణులకు 35రెట్లు బడ్జెట్‌లో కేటాయింపులు పెంచారు. రాష్ట్రంలో ఉన్న 137 బీసీ కులాలను గుర్తించి ప్రతి కులానికి చెందిన పేదలు లబ్ధి పొందేలా చర్యలు తీసుకున్నారు. రజక, నాయీ బ్రాహ్మణ, సగర, వడ్డెర, ఉప్పర, కృష్ణ బలిజ, వాల్మీకి, కుమ్మరి, భట్రాజ ఫెడరేషన్లను కార్పొరేషన్లుగా చంద్రబాబు ప్రభుత్వం మార్చి ంది. కొత్తగా మేదర, విశ్వబ్రాహ్మణ, కల్లుగీత కార్మికులకు ఫైనాన్స్‌ కార్పొరేషన్లను ఏర్పాటుచేసింది. ఎన్నికల ముందు యాదవ, తూర్పు కాపు/గాజుల కాపు, కొప్పుల వెలమ/పోలినాటి వెలమ, కురుబ/కురుమ, వన్యకుల క్షత్రియ, కళింగ, గవర, చేనేత, మత్స్యకారులు, గాండ్ల, ముదిరాజ్‌లకు కూడా ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటుచేశారు. ఏటా ఈ కార్పొరేషన్ల ద్వారా సుమారు 60వేల మంది బీసీ యువతకు స్వయం ఉపాధి పథకాలు అందించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్పొరేషన్లన్నింటినీ రద్దుచేసి మళ్లీ అదే పేర్లతో అన్ని కులాలకూ ఫైనాన్స్‌ కార్పొరేషన్లు ఏర్పాటుచేశారు. తెలుగుదేశం ప్రభుత్వం ఓట్‌ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో పెట్టిన కేటాయింపులన్నీ 2019-20 బడ్జెట్‌లో యథావిధిగా ఉంచి.. ఈ నిధులన్నీ నవరత్నాల కోసం మళ్లించారు. ఆయా కార్పొరేషన్ల స్వయం ఉపాధి పథకాల కోసం ఒక్క పైసా ఖర్చు చేయలేదు. బీసీ కులాల ఫైనాన్స్‌ కార్పొరేషన్లు వేటికీ నిధులు కేటాయించలేదు. దీంతో స్వయం ఉపాధి పథకాలు, ఇతర సంక్షేమ పథకాలన్నీ నిలిచిపోయాయి. అయితే డీబీటీ పథకాలను ఆయా కార్పొరేషన్ల ద్వారా లెక్కలు రాసి బుక్‌ అడ్జె్‌స్టమెంట్‌ కార్పొరేషన్లుగా మార్చేశారు. కూటమి సర్కార్‌ తిరిగి స్వయం ఉపాధి కల్పనలో పూర్వ వైభవం తీసుకురావాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తోంది.


రాష్ట్రంలో నిరుద్యోగులకు స్వయం ఉపాధి జాతర మొదలవనుంది. దీనికి సంబంధించి ఆయా సంక్షేమ శాఖలు ఇప్పటికే కసరత్తు ప్రారంభించాయి. గత టీడీపీ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగులకు వివిధ యూనిట్ల ద్వారా స్వయం ఉపాధి కల్పిస్తే.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్‌ సర్కారు వారి నోటికాడ కూడు లాగేసింది. ఇప్పుడు మళ్లీ టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి రావడంతో ఆయా వర్గాల్లో ఆశలు చిగురించాయి. ఇప్పటికే గత ఐదేళ్ల వైసీపీ సర్కార్‌ విస్మరించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమాన్ని తిరిగి ప్రారంభించి.. పేద బడుగు వర్గాల మోముల్లో సంతోషాన్ని నింపుతోంది. 2014లో టీడీపీ ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు భారీగా సంక్షేమ పథకాలను అమలు చేయగా, ఇప్పుడు మళ్లీ అదే రీతిలో సంక్షేమ పథకాల అమలుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది!.


ఇవి కూడా చదవండి

Borugadda Anil: రాజమండ్రి నుంచి అనంతపురానికి బోరుగడ్డ.. ఎందుకంటే

Kasireddy shock AP High Court: లిక్కర్ స్కాంలో కసిరెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 05 , 2025 | 02:20 AM