Thota Chandraiah: తోట చంద్రయ్య కుమారుడికి సర్కారు కొలువు
ABN , Publish Date - May 21 , 2025 | 04:23 AM
వైసీపీ నేతల చేతిలో హత్యకు గురైన టీడీపీ నాయకుడు తోట చంద్రయ్య కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. సీఎం చంద్రబాబు కుమారుడు వీరాంజనేయులకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే హామీ ఇచ్చారు.
మంత్రివర్గం ఏకగ్రీవ తీర్మానం
2022లో వైసీపీ నేతల చేతిలో దారుణ హత్యకు గురైన చంద్రయ్య
మాచర్లటౌన్, మే 20(ఆంధ్రజ్యోతి): వైసీపీ నేతల చేతిలో దారుణ హత్యకు గురైన టీడీపీ నేత తోట చంద్రయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయించింది. మంగళవారం జరిగిన కేబినేట్ సమావేశంలో చంద్రయ్య కుమారుడు వీరాంజనేయులుకు ప్రభుత్వ ఉద్యోగం ఇద్దామని సీఎం ప్రతిపాదించారు. మంత్రులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. కుటుంబానికి పెద్దదిక్కయిన తోట చంద్రయ్య హత్యతో ఆయన కుటుంబం ఆర్థికంగా చితికిపోయి ఇబ్బందుల పాలైందని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున ఆదుకోవాల్సి ఉందని సీఎం వ్యాఖ్యానించారు. చంద్రయ్య కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావడం పట్ల పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం టీడీపీ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు.
ఎవరీ చంద్రయ్య.. ఏం జరిగింది?
పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన తోట చంద్రయ్య టీడీపీలో యాక్టివ్‌గా ఉండేవారు. నాటి సీఎం జగన్ అరాచక పాలనపై ఎలుగెత్తారు. వైసీపీ హయాంలో వెల్దుర్తి మండలం ఎంపీపీగా ఉన్న చింతా శివరామయ్య, అతని కుమారుడు ఆదినారాయణల అక్రమాలపై పలు రూపాల్లో పోరాటాలు చేశారు. దీంతో కక్షగట్టిన వారిద్దరూ 2022,జనవరి 13నగ్రామంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న చంద్రయ్యను అడ్డగించి నడిరోడ్డుపై కత్తులతో తెగబడ్డారు. గొంతు కోసి ప్రాణం తీశారు. హత్య చేసే ముందు ‘జై జగన్’ అని అంటే వదిలేస్తామని చెప్పినా.. తన ప్రాణం పోయినా అననని ‘జై టీడీపీ. జై చంద్రబాబు’ అంటూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చంద్రయ్య హత్య సమాచారం తెలుసుకున్న అప్పటి విపక్ష నేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు గుండ్లపాడుకు చేరుకుని కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపి శ్మశాన వాటిక వరకు చంద్రయ్య పాడె మోశారు. అధికారంలోకి వచ్చాక కుటుంబాన్ని ఆదుకుంటామని అప్పుడే హామీ ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Tiruvuru Political Clash: తిరువూర్‌లో తీవ్ర ఉద్రిక్తత.. దేవినేని అవినాష్ అరెస్ట్
Liquor Case Remand: లిక్కర్ కేసు.. ఆ ఏడుగురు మళ్లీ జైలుకే
Read Latest AP News And Telugu News