CM Chandrababu Naidu: ఆరోగ్యానికే తొలి ప్రాధాన్యం
ABN , Publish Date - Nov 10 , 2025 | 04:37 AM
డబ్బు, హోదా, కార్లు, బంగ్లాలు ఎన్ని ఉన్నా ఆరోగ్యం బాగా లేకుంటే ఆ కుటుంబాన్ని పేదరికంలోకి నెట్టినట్లేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అందుకే తమ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు.....
ఆరోగ్యం, సంపద, ఆనందకరమైన సమాజ స్థాపనే మా ప్రభుత్వ ఆలోచన. పేదరికం లేని సమాజం చూడాలన్నది జగద్గురు ఆదిశంకరుల కల. ఇది అసాధ్యం కాదు. అందరం అనుకుంటే తప్పకుండా సాధిస్తాం.ఎన్ని ఆస్పత్రులున్నా కంచి పీఠంలాంటి ఆధ్యాత్మిక కేంద్రాలు అవసరం. అవే మానసిక ఉల్లాసాన్ని కల్పిస్తాయి.
- సీఎం చంద్రబాబు
రూ.2.50 లక్షల ఆరోగ్య బీమా: ముఖ్యమంత్రి
పేదలకు రూ.25 లక్షల వరకు వైద్యసాయం
కృత్రిమ మేధతో అన్ని రకాల వైద్యసేవలు
టాటా సంస్థ సహకారంతో సంజీవని కేంద్రాలు
ఏఎన్‌ఎం నుంచి స్పెషలిస్టు వైద్యుల వరకు ఆన్‌లైన్‌లో అందుబాటులో
ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టుగా అమలు
రాబోయే రోజుల్లో రాష్ట్రమంతటా: సీఎం
పెదకాకాని శంకర నేత్రాలయలో సూపర్‌స్పెషాలిటీ బీ-బ్లాక్‌కు శ్రీకారం
త్వరలో శంకర పాఠశాలలు: విజయేంద్ర
గుంటూరు, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): డబ్బు, హోదా, కార్లు, బంగ్లాలు ఎన్ని ఉన్నా ఆరోగ్యం బాగా లేకుంటే ఆ కుటుంబాన్ని పేదరికంలోకి నెట్టినట్లేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అందుకే తమ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. ప్రతి ఒక్కరికీ రూ. 2.50 లక్షల యూనివర్సల్ హెల్త్ కవరేజీని త్వరలోనే తీసుకురాబోతున్నామని ప్రకటించారు. పేదవాళ్లకు రూ. 25 లక్షల వరకు వైద్యసాయం అందిస్తామన్నారు. ఆదివారం గుంటూరుకు సమీపాన పెదకాకానిలోని శంకర నేత్రాలయంలో నూతనంగా నిర్మించిన ఐ కేర్ సూపర్‌స్పెషాలిటీ బీ-బ్లాక్‌ను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. ఆరోగ్య రంగాన్ని కృత్రిమ మేధ(ఏఐ)తో లింకప్ చేసి అవసరమైన అన్నిరకాల వైద్యసేవలు ప్రజలకు ఇంటి వద్దనే అందించే ఆలోచన కూడా చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే తమ ప్రభుత్వం టాటా సంస్థ సహకారంతో డిజిటల్ నెర్వ్ సెంటర్ సంజీవని కేంద్రాలనే మంచి ప్రాజెక్టును తీసుకొచ్చిందన్నారు. ప్రతి ఒక్కరి హెల్త్ రికార్డులను డిజిటలైజ్ చేసే ప్రక్రియ చేపట్టామని, ఏఎన్‌ఎం మొదలుకొని స్పెషలిస్టు వైద్యుల వరకు అందరినీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. దీనిని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామని, రాబోయే రోజుల్లో రాష్ట్రమంతటా విస్తరించి ప్రపంచంలోనే రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దుతామని నమ్మకం వ్యక్తంచేశారు.
కంచి కామకోటి పీఠం ఆదర్శవంతం
శంకర నేత్రాలయాల నిర్వహణలో కంచి కామకోటి పీఠం పాత్ర అనిర్వచనీయమని సీఎం అన్నారు. ‘సామాన్యులకు నేత్ర వైద్య చికిత్సలు అందించే కార్యక్రమానికి కంచి పీఠం 1975లోనే శ్రీకారం చుట్టింది. వచ్చే సంవత్సరం స్వర్ణోత్సవం జరుపుకోబోతోంది. ఆ కార్యక్రమానికి తప్పక హాజరవతాను. ఈ పీఠం 10 రాష్ట్రాల్లో 14 ఆస్పత్రులు స్థాపించి 30 లక్షల మందికి శస్త్రచికిత్సలు చేయించింది. 70 లక్షల మందికి నేత్ర పరీక్షలు నిర్వహించింది. సగటున రోజుకు 50 మందికి ఉచితంగా నేత్రవైద్య శస్త్రచికిత్సలు చేస్తోంది. శంకర నేత్రాలయలో 1986లో కేవలం 14 మంది వైద్య సిబ్బంది ఉన్నారు. నేడు 2,264కి చేరుకోవడం అభినందనీయం. భారతదేశంతో పాటు నేపాల్, నైజీరియా, కంబోడియాలోనూ ఆస్పత్రులు ఏర్పాటు చేసి అన్ని పీఠాలకు కంచి పీఠం ఆదర్శంగా నిలుస్తోంది. పెదకాకాని నేత్రాలయంలో రోజుకు 2,500 నుంచి 3వేల మంది వైద్యసేవలు పొందుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ సేవలు రెట్టింపవుతాయి. రెయిన్‌బో ప్రోగ్రాం, గిఫ్ట్ ఆఫ్ విజన్ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శం. పేదలను ఇంటి నుంచి ఆస్ప్రతికి తీసుకురావడం.. వారికి అన్ని రకాల కంటి పరీక్షలు, వైద్యసాయం, శస్త్ర చికిత్సలు చేసి తిరిగి ఇంటికి చేర్చడం అనే కార్యక్రమం మరెక్కడా లేదు’ అని కొనియాడారు. కంచి పీఠం చేపట్టబోయే కార్యక్రమాల్లో ఏపీ ప్రభుత్వం భాగస్వామిగా ఉంటుందని తెలిపారు.
అన్ని రాష్ట్రాల్లో శ్రీవారి ఆలయాలు
గతంలో తిరుమలలో ఎన్‌టీఆర్ అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారని.. అది ఇప్పటికీ కొనసాగుతోందని చంద్రబాబు చెప్పారు. ‘నేను స్విమ్స్‌లో ప్రాణదానం కార్యక్రమాన్ని ప్రారంభించాను. నాడు శ్రీ వేంకటేశ్వరస్వామి సేవలో పాల్గొనేందుకు వెళ్తుంటే 23 క్లైమోర్ మైన్స్‌ను నక్సలైట్లు పేల్చారు. స్వామి వారే నన్ను కాపాడారు. శ్రీవారి సేవకుల కార్యక్రమాన్ని టీటీడీలో నేను ప్రారంభిస్తే నేడు స్వచ్ఛందంగా వేల మంది తిరుమలకు వచ్చి సేవలందిస్తున్నారు. శ్రీవారి దేవాలయాలను అన్ని రాష్ట్రాల్లో నిర్మిస్తాం. ప్రపంచంలో హిందువులున్న చోట్ల కూడా ఏర్పాటు చేస్తాం. 700 మంది వేద పండితులకు శిక్షణ ఇచ్చి గౌరవవేతనం ఇవ్వబోతున్నాం. కంచి పీఠం చేసే అన్ని కార్యక్రమాలకు అండగా ఉంటా’ అని హామీ ఇచ్చారు.
ఆంధ్రతో అనుబంధం: కంచి స్వామి
విద్యార్థులకు మంచి చదువు, రోగులకు నాణ్యమైన వైద్యసాయం, మందులు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి సాయం చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామని కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి తెలిపారు. ‘చదువు, బలం, మంచిపేరు, కీర్తి, పుణ్యం అనే సేవలు నిత్యం మేం చేస్తుంటాం. విద్య, సంస్కృతి కలిపి శంకర పాఠశాలలు త్వరలో ప్రారంభించబోతున్నాం’ అని ప్రకటించారు. వైద్యం కోసం హిందూ మిషన్ హాస్పిటల్స్ ద్వారా ఉచితంగా గుండె శస్త్ర చికిత్సలు చేయిస్తున్నామన్నారు. సీఎం సలహా మేరకు ఏఐ టెక్నాలజీ ద్వారా త్వరలో కంటి పరీక్షలు నిర్వహిస్తామని శంకర ‘ఐ’ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ రామనాథన్ వీ రమణి చెప్పారు. కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్, ప్రభుత్వ చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు.