Share News

AP Government: కలెక్టర్ల సదస్సులో దశ దిశ..

ABN , Publish Date - Sep 16 , 2025 | 04:37 AM

రాష్ట్రంలో మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో దుర్భిక్ష నివారణకు చర్యలు చేపట్టామని జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ వెల్లడించారు....

AP Government: కలెక్టర్ల సదస్సులో దశ దిశ..

C.jpg

దుర్భిక్ష నివారణ చర్యలు తీసుకుంటున్నాం

9,221.40 కోట్లతో పలు ప్రాజెక్టులు పూర్తి: సాయిప్రసాద్‌

రాష్ట్రంలో మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో దుర్భిక్ష నివారణకు చర్యలు చేపట్టామని జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ వెల్లడించారు. జల వనరుల ప్రగతిని సీఎం చంద్రబాబుకు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. ‘ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నాం. తుంగభద్రతో సహా.. ప్రాజెక్టుల గేట్లను అవసమైనచోట మారుస్తు న్నాం. శ్రీశైలం జలాశయం రక్షణ చర్యలను ఏడాదిలోగా పూర్తి చేస్తాం. పోలవరం ప్రాజెక్టును 2027 డిసెంబరు కల్లా పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ కమాండ్‌ ఏరియా డెవల్‌పమెంట్‌ మోడరైజేషన్‌ (ఎంకాడా) కింద పైపుల ద్వారా సాగు నీటిని తీసుకువెళ్లే పథకానికి రూపకల్పన చేశాం. ఏడాదిలోగా రాష్ట్రంలో రూ.9,221.40 కోట్లతో పలు ప్రాజెక్టులు పూర్తి చేస్తాం’ అని సాయిప్రసాద్‌ వివరించారు.

A.jpg

ఒక్కొ క్కరికి 26 వేల నుంచి 78 వేల లబ్ధి

ఎక్కువ మంది పిల్లలున్నవారికి ‘తల్లికి వందనం’

గత జగన్‌ ప్రభుత్వం కుటుంబంలో ఒక్కరికే అమ్మఒడి కింద రూ.13వేలు ఇచ్చింది. కానీ కూటమి ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ తల్లికి వందనం పథకం అమలు చేసింది. ఫలితంగా లక్షల మంది తల్లులు అదనపు ప్రయోజనం పొందారు. కలెకర్ల సదస్సులో విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్‌ తల్లికి వందనంపై ప్రజెంటేషన్‌ ఇచ్చారు. రాష్ట్రంలో ఆరుగురు, అంతకంటే ఎక్కువ మంది బడికి వెళ్లే పిల్లలున్న తల్లులు 353 మంది ఉన్నారు. వీరందరికీ రూ.78 వేలు చొప్పున నగదు అందింది. ఐదుగురు పిల్లలున్న తల్లులు 2,714 మంది ఉండగా, వారి ఖాతాల్లో రూ.65 వేలు చొప్పున నగదు జమ చేశారు. నలుగురు పిల్లలున్న 27,711 మంది తల్లులకు రూ.52 వేలు చొప్పున తల్లికి వందనం నగదు వచ్చింది. ముగ్గురు పిల్లలున్న 2,97,226 మంది తల్లులకు రూ.39 వేలు చొప్పున నగదు అందింది. ఇక ఇద్దరు పిల్లలున్న 18.27 లక్షల మంది తల్లులకు రూ.26వేలు చొప్పున ఖాతాల్లో జమఅయ్యింది. కాగా తల్లికి వందనం పథకం కింద వివిధ కారణాలతో నగదు పొందలేకపోయిన 2,79,720 మంది విద్యార్థులకు సంబంధించి మూడో విడతలో తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు విద్యా శాఖ కార్యదర్శి వెల్లడించారు.


B.jpg

డ్వాక్రాల పొదుపు రూ.20,739 కోట్లు

సెర్ప్‌ కార్యదర్శి వీ కరుణ

‘రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాలు బ్యాంకుల్లో రూ.20,739 కోట్లు పొదుపు చేశాయి. ఈ విషయంలో దేశంలో ఆంధ్ర మొదటి స్థానంలో ఉంది’ అని సెర్ప్‌ కార్యదర్శి వీ కరుణ తెలిపారు. సోమవారం అమరావతి సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ఆమె సెర్ప్‌ కార్యకలాపాలపై ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ‘డ్వాక్రా సంఘాలు రుణాలు పొందేలా జిల్లా కలెక్టర్లు దృష్టి సారించాలి. వీటిలో రుణాల ఎగవేత కేవలం 0.02ు మాత్రమే. రాష్ట్రంలో మొత్తం 8.32 లక్షల డ్వాక్రా సంఘాలున్నాయి. 89 లక్షల మంది మహిళలు వీటిలో సభ్యులుగా ఉన్నారు. డ్వాక్రా సంఘాలపై అనకాపల్లి జిల్లా కలెక్టర్‌ పనితీరు ఆదర్శప్రాయం. యువతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. పొదు పు సంఘాల్లోని మహిళలు ఎక్కువగా పాడి పరిశ్రమ పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అడిగిన వారందరూ రుణాలు త్వరితగతిన పొందేలా జిల్లా కలెక్టర్లు చొరవ చూపాలి. 3,000 మంది డ్వాక్రా మహిళలు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా మారటానికి ఆసక్తి చూపుతున్నారు. వీరితో మొత్తం 875 మిల్లెట్‌ కేఫ్‌లు ఏర్పాటు చేయాలన్నది లక్ష్యం. పైలెట్‌ ప్రాజెక్టు 12 జిల్లాల్లో ఏర్పాటు చేసిన 200 యూనిట్లు విజయవంతంగా సాగుతున్నాయి’ అని కరుణ చెప్పారు.

D.jpg

ఏపీ బ్రాండ్‌ను తిరిగి తీసుకొస్తున్నాం: అనగాని

జాతీయ జీఎ్‌సడీపీని అధిగమించాం: పయ్యావుల

‘ఏపీ బ్రాండ్‌ను తిరిగి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నాం. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సమ ప్రాధాన్యమిచ్చి అన్ని పథకాలనూ విజయవంతం చేస్తున్నాం’ అని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ అన్నారు. ‘ప్రజలకు సంబంధించిన అన్ని సమస్యలను పీజీఆర్‌ఎస్‌ విధానంలో సకాలంలో పరిష్కరిచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రెవెన్యూలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. తప్పులులేని పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలను అందించేందుకు కృషి చేస్తున్నాం. తప్పుడు రిజిస్ట్రేషన్ల నివారణకు అనేక మార్పులు తీసుకొచ్చాం. ల్యాండ్‌ సీలింగ్‌ భూములను పటిష్ఠంగా క్రమబద్దీకరించాం. రెవెన్యూ రికార్డులన్నీ డిజిటలైజేషన్‌ చేయడం ద్వారా ప్రజలకు మంచి సేవలందిస్తున్నాం. వారసత్వ భూములకు హక్కులు కల్పించేందుకు వీలుగా ఫీజును తగ్గించాం. రైతుల నీటి తీరువా వడ్డీ రూ.85 కోట్లు మాఫీ చేశాం’ అని మంత్రి అన్నారు.


E.jpg

ప్రభుత్వ ముఖచిత్రాన్ని ప్రతిబింబించేలా...

ప్రభుత్వ ముఖచిత్రాన్ని క్షేత్రస్థాయిలో ప్రతిబింబించేలా జిల్లా కలెక్టర్లు కృషి చేయాలని ఆర్థిక మంత్రి పయ్యావుల అన్నారు. ‘సీఎం ఉన్నత స్థాయి ఆలోచనలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్లు ఎదగాలి. ప్రజలకు సంతృప్త స్థాయిలో సేవలు అందించాలి. ఏ ప్రభుత్వంలోనూ ప్రణాళిక శాఖలకు అంతగా ప్రాధాన్యమివ్వరు. కానీ ఈ సీఎం ఎంతో ఉన్నతంగా ఈ శాఖను వినియోగించుకోవడం వల్ల జీఎ్‌సడీపీ సాధనలో దేశంలోనే ప్రథమ స్థానంలో రాష్ట్రం నిలిచింది. జాతీయ స్థాయి జీఎ్‌సడీపీ 8.8ు అధిగమించి 10.8ుని సాధించాం’ అని పయ్యావుల పేర్కొన్నారు.

- అమరావతి, ఆంధ్రజ్యోతి


F.jpg

17.11 శాతం వృద్ధి లక్ష్యం

ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్‌ కుమార్‌

అనేక సవాళ్లున్నప్పటికీ రాష్ట్రం వృద్ధి దిశగా వేగంగా పరుగులు తీస్తోందని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్‌ కుమార్‌ చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం(క్యూ1)లో 10.5 శాతం వృద్ధిరేటు సాధించామని, జాతీయ సగటు వృద్ధిరేటు 8.8 శాతం ఉండగా, ఏపీలో చాలా ముందంజలో నిలిచిందని వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 17.11 వృద్ధిశాతం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. సోమవారం సచివాలయంలో కలెక్టర్ల సదస్సు సందర్భంగా రాష్ట్ర స్థూల ఉత్పత్తి(జీఎస్డీపీ)పై ఆయన ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ క్యూ1లో స్థూల విలువ జోడింపు(జీవీఏ) 10.76 శాతంగా నమోదవ్వడం మంచి పరిణామన్నారు. ఈ సందర్భంగా రంగాల వారీగా ప్రగతిని వివరించారు. క్యూ1లో శ్రీకాకుళం, ప్రకాశం, ఏలూరు, ఎన్టీఆర్‌, తిరుపతి జిల్లాలు 20 శాతంపైగా వృద్ధిరేటు కనబర్చాయని తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 18.65 లక్షల కోట్ల జీఎ్‌సడీపీ సాధనే లక్ష్యమన్నారు. జిల్లా కలెక్టర్లందరూ తప్పనిసరిగా తమ జిల్లాల్లోని వృద్ధిరేటు వివరాలన్నీ ప్రతి నెలా మండలస్థాయిలో 5వ తేదీలోగా, జిల్లాస్థాయిలో 8వ తేదీలోగా డేటా ఎంట్రీ చేయాలని పీయూష్‌ కుమార్‌ చెప్పారు. ప్రతి నెలా 15వ తేదీన ముఖ్యమంత్రి ఆయా జిల్లాలు సాధిస్తున్న జీఎస్డీపీ వృద్ధిరేటు వివరాలను సమీక్షిస్తారని తెలిపారు. పీ4లో 21 లక్షల బంగారు కుటుంబాలు గుర్తించినట్టు చెప్పారు. 10 లక్షల కుటుంబాలను అనుసంధానించామన్నారు. - అమరావతి, ఆంరఽధజ్యోతి

G.jpg1.4 కోట్ల కుటుంబాలకు ‘దీపం-2’ లబ్ధి

దీపం-2 పథకం కింద ఇప్పటి వరకు రెండు విడతల్లో 1.4 కోట్ల కుటుంబాలు ఉచిత గ్యాస్‌ సిలిండర్లను పొందినట్లు కలెక్టర్ల సదస్సులో పౌరసరఫరాల శాఖ వెల్లడించింది. ఆ శాఖ కమిషనర్‌ సౌరభ్‌గౌర్‌ ఇచ్చిన ప్రజెంటేషన్‌లో వివరాలు వెల్లడించారు. సబ్సిడీ కింద రూ. 1,554 కోట్లు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. మూడో విడతలో మరో 64.67 లక్షల కుటుంబాల వారికి ఉచిత గ్యాస్‌ సిలిండర్లను పంపిణీ చేయనున్నారు. దీని కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.150 కోట్లు విడుదల చేసింది. స్మార్ట్‌ కార్డుల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా పూర్తచేసేలా కలెక్టర్లు పర్యవేక్షణ చేయాలని ఈ సందర్భంగా కోరారు. ఈ ఖరీ్‌ఫలో 50 లక్షల మెట్రిక్‌ టన్నుల ఽధాన్యాన్ని మద్దతు ధరకు సేకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.


H.jpg

15 నెలల్లో 10 లక్షల కోట్లు

  • 122 ప్రాజెక్టులకు అనుమతి.. ప్రతి ‘మంగళవారం’ ఇండస్ర్టీ డే

  • పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్‌

కూటమి ప్రభుత్వం జూన్‌ 2024లో ఏర్పాటయిన నాటి నుంచి నేటి వరకూ 122 ప్రాజెక్టులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ ఒప్పందాల ద్వారా రూ.10,06,799 కోట్ల పెట్టుబడులు రాష్ట్రంలో పెట్టనున్నారు’ అని పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్‌.యువరాజ్‌ తెలిపారు. కలెక్టర్ల సదస్సులో సోమవారం ఆయన పారిశ్రామిక రంగంపై ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ‘రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటయ్యే మొత్తం 50 క్లస్టర్లకు లక్ష ఎకరాలకు పైగా ఖాళీ స్థలాలను గుర్తించాం. కలెక్టర్లు భూ సేకరణపై దృష్టి సారించాలి. రాష్ట్రంలో ఐదు చోట్ల డిఫెన్స్‌ క్లస్టర్లు... విశాఖపట్నం-శ్రీకాకుళం జిల్లాల మధ్య 3,000 ఎకరాల్లో నావల్‌ క్లస్టర్‌, అనంతపురం జిల్లా మడకశిర-లేపాక్షి మధ్య 4-5 వేల ఎకరాల్లో ఏరోస్పేస్‌, ఎలకా్ట్రనిక్స్‌ క్లస్టర్‌, ప్రకాశం జిల్లా దొనకొండలో 4,000 ఎకరాల్లో ఎయిర్‌ క్రాఫ్ట్‌ విడిభాగాల తయారీ క్లస్టర్‌ ఏర్పాటు కాబోతున్నాయి. ప్రతి మంగళవారం ఇండస్ట్రీ డే నిర్వహించాలి. జిల్లాల్లో ప్రతి ఎకనామిక్‌ హబ్‌కు ఒక జిల్లా అధికారిని నియమించాలి. ఎంఎ్‌సఎంఈలపై కూడా జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలి. జిల్లా ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చేవి ఎంఎ్‌సఎంఈలే’ అని యువరాజ్‌ తెలిపారు.

I.jpg

పునరుత్పాదక ఇంధనంపై దృష్టి: సీఎస్‌

రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని భారీగా పెంచేందుకు కృషి చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇంధన శాఖ కార్యదర్శి విజయానంద్‌ పేర్కొన్నారు. 4వ కలెక్టర్ల సదస్సులో రాష్ట్ర విద్యుత్‌ రంగంపై ఆయన ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ‘పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంచడంలో భాగంగా ఏపీ డిస్కంలు సోలారైజేషన్‌పై దృష్టి సారించాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి 2,93,587 వ్యవసాయ పంపుసెట్లను సోలార్‌ పంపుసెట్లుగా మార్చేందుకు ఇప్పటికే టెండర్లు పిలిచాం. రూఫ్‌ టాప్‌ సోలార్‌ పవర్‌ ప్లాంట్ల ఏర్పాటును ప్రాధాన్యంగా తీసుకుని వెంటనే గ్రౌండ్‌ చేయడానికి కలెక్టర్లు సహకరించాలి. పైలట్‌ ప్రాజెక్టుగా తిరుపతి జిల్లా నారావారిపల్లెలో, చిత్తూరు జిల్లా నడిమూరులో అమలు చేస్తున్నాం. ఇక్కడ మొత్తం 393 కిలోవాట్‌ పవర్‌ సామర్థ్యంతో రూఫ్‌టాప్‌ సోలార్‌ ప్యానెళ్లను ఏర్పాటుచేశారు. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులను లక్ష్యంగా చేసుకుని ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ 1198.21 మెగావాట్‌ గ్రిడ్‌ కనెక్టడ్‌ రూఫ్‌టాప్‌ సోలార్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు టెండర్లు పిలిచాం. తొలి దశలో 6 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు ఏర్పాటు చేయనున్నాం. ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన విధంగా విద్యుత్తు సబ్సిడీలకు సంబంధించిన అన్ని హామీలను నెరవేరుస్తున్నాం’ అని విజయానంద్‌ వివరించారు.

Updated Date - Sep 16 , 2025 | 04:37 AM